2, సెప్టెంబర్ 2023, శనివారం

బంధము భారంబైనను


*కం*

బంధము భారంబైనను

బంధితులది కాచినపుడె బాధ్యత తోడన్,

బంధుత్వంబులు బతుకును

బంధరహితజీవనమ్ము బడపగు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! బంధం భారమైననూ బంధం చే కలిసిన వారు దానిని బాధ్యత గా కాపాడినప్పుడే బంధుత్వాలు బతుకుతాయి,బంధాలు లేని జీవనం చాలా కష్టమైనది(బడప= చాలా కష్టం).

*సందేశం*:-- రక్తసంబంధం అయినా,మిత్ర హిత బంధమైనా బాధ్యత గా కాపాడుకున్నప్పుడే నిలబడుతుంది. చిన్న చిన్న తప్పు లను పెద్ద మనస్సు తో క్షమించగలిగినప్పుడే బంధుత్వమాధుత్యములనొందగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

ఇతరుల నతిగా పొగడగ

హితులగు నీ స్వంత జనులు హెచ్చుగ తెగడున్.

శ్రితహితగణ ద్వేషజనులు

నితరుల శ్లాఘించుచుండు నిరతము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ఇతరుల ను ఎక్కువగా పొగడటం వలన నీ శ్రేయస్సు కోరే నీ స్వజనులు నిన్ను ఎక్కువగా తిరస్కరించెదరు. హితులను ద్వేషించేవారే అతిగా ఎల్లప్పుడూ ఇతరుల ను పొగుడుతారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: