2, సెప్టెంబర్ 2023, శనివారం

నవగ్రహా పురాణం🪐* . *15వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *15వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*సూర్యగ్రహ జననం - 6*


బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ , రోజు రోజుకీ అదితి కశ్యపుల ఆనందాన్ని పెంచుతూ పెద్దవాడవుతున్నాడు.


వినతా , కద్రువా , దితీ , దనూ - మొదలైన అదితి చెల్లెళ్ళు బాల సూర్యుణ్ణి నేల మీద ఉండనివ్వడం లేదు. దిగే చంకా , ఎక్కే చంకా అయిపోయింది బాలసూర్యుడి పని !


బాలసూర్యుడు బోర్లా పడ్డాడు... పాకుతున్నాడు... దోగాడుతున్నాడు. బాలసూర్యుడు ఆశ్రమంలో కదిలితే , ఏదో మసక వెల్తురు తనతో బాటు కదలాడుతున్న అనుభూతి కలుగుతోంది అందరికీ. బాలసూర్యుడు రాగానే , అప్పటిదాకా అక్కడ వున్న వెల్తురు , వత్తి ఎగదోసిన దీపం కాంతిలా పెరుగుతున్నట్టునిపిస్తోంది. తల్లిదండ్రులకూ పినతల్లులకు అదితి అరుగుమీద కూర్చుని పూల మాలికలు అల్లుతోంది. *"అక్కా అదితీ ! అక్కా"* అంటూ కంగారుగా వచ్చింది సింహిక , ఆమె చేతుల్లో బాలాదిత్యుడున్నాడు. *"అబ్బ ఎంత వేడిగా ఉందో వీడి వొళ్ళు ! ఇందమ్మా ! తీసుకో ! నా వల్ల కాదు ! అంటూ సింహిక బాలాదిత్యుడ్ని అదితి చేతుల్లోకి విసిరినంత పని చేసింది.


*"అంత వేడిగా లేదు. సింహికా !"* బాలుణ్ని తాకిచూస్తూ అంది అదితి. *"ఏమో తల్లీ... నా చేతులేమో మండి పోతున్నాయి !"* అంది సింహిక అరచేతుల్ని చూసుకుంటూ.


కశ్యపుడు వచ్చాడు. బాలాదిత్యుడిని ముట్టుకుని చూశాడు.


*"వేడిగానే ఉంది , అదితీ ! జ్వరం వచ్చినట్టుంది. పసివాడికి !"* అంటూ కొడుకుని తీసుకుని ఆశ్రమంలోకి నడిచాడు.


అదితి ఆయన వెనకే వెళ్ళింది.


నాలుగు రోజులు గడిచాయి. శరీరం వేడిగా వున్నా కూడా బాలసూర్యుడు ఆడుకుంటూనే వున్నాడు.


*"ఇదేదో మొండి అనారోగ్యమే , అదితి. ఏం చేద్దాం ?"* అయిదో రోజు ఉదయం సూర్యుడి శరీరాన్ని తాకి చూసిన కశ్యపుడు అన్నాడు.


అదితి కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కస్తోంది. *"నాకు... భయంగా వుంది , స్వామీ...."* అందామె విచారంగా. *"నాధా ! నారదముని మీ కోసం వచ్చారు !"* అంది వినత అక్కడికి వస్తూ..


కశ్యపుడు ఆశ్రమం వెలుపలికి నడిచాడు. ఎదురుగా నిలుచున్న నారద మహర్షికి నమస్కరించాడు. *"నారాయణ"* నారదుడు దీవిస్తూ అన్నాడు..


*"దయ చేయండి !"* అరుగునూ , అరుగు మీదున్న దర్భాసనాన్నీ చూపిస్తూ ఆహ్వానించాడు కశ్యపుడు. *"రాకరాక వచ్చారు ! చిన్నవాడి నామకరణ సందర్భంలో వచ్చారు. మళ్ళీ ఇంత కాలానికి వచ్చారు."*


*"బాలసూర్యుడు బాగున్నాడు కద !"* నారదుడు ప్రశ్నించాడు. 


*"ఈ మధ్య ఉష్ణాధిక్యతతో బాధ పడుతున్నాడు ! మాకు కొంచెం ఆందోళనగానే ఉంది !"* కశ్యపుడు సమాధానం చెప్పాడు.


*"అలాగా ? పదండి... చూద్దాం !"* నారదుడు అరుగుమీంచి లేస్తూ అన్నాడు. కశ్యపుడు ఆశ్రమంలోనికి దారి తీశాడు. ఇద్దరూ లోపలి కక్ష్యలోకి వెళ్ళారు. బాలసూర్యుడు అంతటా కలయదిరుగుతూ ఆడుకుంటున్నాడు. అదితి లేచి నారదుడికి ప్రణామం చేసింది.


*"ఇక్కడ ఏదో కాంతి సంచరిస్తున్నట్టుంది !"* నారదుడు బాలసూర్యుణ్ణి చూస్తూన్నాడు.


*"పుట్టినప్పట్నుంచీ అంతే , మహర్షీ ! పసివాడి చుట్టూ పసిడి కాంతులు పల్చగా కనపడుతూ ఉంటాయి.”* కశ్యపుడు బాలసూర్యుణ్ణి ఎత్తుకొని , నారదుడికి అందించాడు. *"చూడండి ! శరీరం కాలిపోతోంది."*


*“నారాయణ ! నారాయణ !"* అంటూ నారదుడు బాలసూర్యుణ్ని ఎత్తుకుని , పరమానందంతో చిన్నారి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు.


*“మహర్షీ...!"* బాలకుడి స్పర్శతో స్పందించకుండా చిరునవ్వు నవ్వుతున్న నాదరుడి వాలకానికి ఆశ్చర్యపోతున్న కశ్యపుడు అన్నాడు. *"అలా ఆశ్రమం ముందు కూర్చుందాం !"* అంటూ నారదుడు బాలసూర్యుణ్ణి ఎత్తుకుని అవతలకి నడిచాడు. అదితి , కశ్యపుడు అనుసరించారు.


బాలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని , అరుగు మీద కూర్చున్న నారదుడు ఆ దంపతుల వైపు చిరునవ్వుతో చూశాడు. *"బాగుంది ! అయితే జన్మించిన నాటినుంచీ మన బాలసూర్యుడు లీలగా కాంతిని ప్రసరిస్తున్నాడన్నమాట !"*


*"పాపడు పెరిగే కొద్దీ ఆ వెలుగూ పెరుగుతూ వస్తోంది మునీంద్రా !”* అదితి బాలుణ్ణి చూస్తూ అంది.


నారదుడు చిన్నగా నవ్వాడు. *"బాగుంది తల్లీ ! వెలుగు ఆయన సహజ లక్షణం కదా !!*


*"అదే అనుకున్నాం మేమంతా !"* కశ్యపుడు వినయంగా అన్నాడు.


*"నారాయణ ! వెలుగునేమో బాలకుని సహజ లక్షణంగా భావించి స్వీకరించారు. బాగానే ఉంది ! అలాగే వెలుగుతో పాటు ఆయనగారి వేడిమినీ స్వీకరించాలి కదా ?”*


*"మహర్షీ !"* కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*"ఔను కశ్యపా ! వెలుతురులాగే , వేడిమి కూడా బాలసూర్యుడి సహజ లక్షణం !"*


*"అలాగా !”* కశ్యపుడు ఆశ్చర్యపోతూ అన్నాడు. *"ఔను కదా ! అదితీ , నేనూ ఇద్దరం అలా ఆలోచించలేకపోయాం ! ఆందోళనలో మునిగిపోయాం !"*


*"సంతానం పట్ల ఉన్న వాత్సల్యం ఆలోచనా శక్తిని మాయలో కప్పివేసింది !"* నారదుడు నవ్వుతూ అన్నాడు అదితి వైపు చూస్తూ. అదితి కళ్లు చెమ్మగిల్లాయి. *“వేడి స్పర్శతో భయపడిపోయాను స్వామీ !”*


*"తల్లీ ! లోకాలకు వెలుగునూ , వేడిమినీ అందించే వేలుపు నీ బిడ్డగా , నీ ఒడిలో ఆడుతున్నాడు. మరిచిపోయావా ?”* నారదుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు. 


*"మీ రాకతో నాలుగు రోజులుగా నన్ను కలిచివేసిన ఆందోళన దూరమైంది ,”* అదితి నమస్కరిస్తూ అంది.


నారదుడు బాలసూర్యుణ్ణి అదితికి అందించాడు. అదితి లోనికి వెళ్లింది.


*"కశ్యపా ! సకాలంలో బాలసూర్యుడికి విద్యాభ్యాసం ప్రారంభించు ! నాలుగు వేదాలతో పాటు నీవు నేర్చిన సకల శాస్త్రాలు సూర్యునికి బోధించు. సూర్యుడు నీ అధ్యాపకత్వంలో సకల విద్యాపారంగతుడు కావాలి !”* అన్నాడు నారదుడు.


*"తమ ఆజ్ఞ !"* కశ్యపుడు వినయంగా అన్నాడు. *"అదితేయులకూ , దైత్యులకూ , దానవులకూ , ఇతర పుత్రులకూ నా విద్య సంపూర్ణంగా నేర్పలేకపోయాను. సూర్యుణ్ణి సకల శాస్త్ర విశారదుణ్ణి చేస్తాను.”*


*“మంచిది ! విద్యార్జనలో , విద్యలో , విద్యాబోధనలో సూర్యుడు నిన్ను మించిపోవాలి సుమా !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.. 


*"నా కోరికా అదే ! తనయుడు తనను మించినవాడుగా ఎదగాలి అన్న ఆశ తండ్రిలో సహజంగా జన్మిస్తుంది మునీంద్రా !"*


*"ఔను ! అది పితృ సహజమైన ఆశ !"* నారదుడు నవ్వుతూ అన్నాడు..


కశ్యపుడు బరువుగా నిట్టూర్చాడు. *"మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి దేవ , రాక్షస సామ్రాజ్యాలు స్థాపించుకున్న నా పుత్రుల విషయంలో తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోయాను...”*


*“నారాయణ !”* నారదుడు తేలిగ్గా అన్నాడు. *“అది ఆ విధి సంకల్పం కశ్యపా ! కలిసి మెలిసి ఉండలేకపోయినప్పటికీ , గర్భ శత్రువులుగా ఉన్నప్పటికీ , నీ పుత్రులైన దేవ , రాక్షసులు ఎవరికి వారు వివాహాలు చేసుకొని వైభవంతో జీవిస్తున్నారు. ఎవ్వరికీ ఏ లోటూ లేదు !".*


*"వాళ్ళకు మీ దర్శనం అనుగ్రహించారా , ఇటీవల ?"* కశ్యపుడు ఉత్సాహంగా అడిగాడు.


*"నా వ్యాపకం నిత్య సంచారం కదా ! విషయ సేకరణ లేకపోతే సంచారం సారహీనంగా ఉంటుంది. విషయం కావాలంటే , వైరి బృందాలను తక్కువ వ్యవధానంలో కలుస్తూ ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే నా సంచారం , దేవ దానవ సామ్రాజ్యాల మధ్యే అధికంగా ఉంటుంది !”*


*"అది వాళ్ళ అదృష్టం ! దితిజులనూ , దనుజులనూ వారి సోదరులనూ కొంచెం కనిపెట్టి ఉండండి ," కశ్యపుడు అర్థిస్తున్నట్లు అన్నాడు. “నారాయణ ! అందుకు ఈ నారదుడు చాలడు !”* నారదుడు చిరునవ్వుతో అన్నాడు.


*"వాళ్ళను వాళ్ళే కనిపెట్టుకుంటారు.”*


కశ్యపుడు మౌనంగా చూశాడు.


*"కశ్యపా ! శ్రీమహావిష్ణువు దక్షిణ నేత్రంలో ఉండే సూక్ష్మ సూర్యుడు , నీ పుత్రుడుగా అవతరించాడు. తల్లిదండ్రులకు నిత్య సంతోషం కలిగించే కుమార సూర్యుని ఆలనలో , పాలనలో నిమగ్నుడై ఆనందం అనుభవించు. వేయిమంది అయోగ్యులకు విద్య నేర్పడం కన్నా , ఒకే ఒక్క యోగ్యునికి విద్యాబుద్ధులు నేర్పడం మంచింది. చెప్పానుగా ! సూర్యుణ్ణి సకల విద్యా పారంగతుణ్ణి చేయి !”*


కశ్యపుడు అలాగే అన్నట్లు తలవంచి నమస్కరించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: