11, మార్చి 2021, గురువారం

మహాశివరాత్రి

 మహాశివరాత్రి విశిష్టత  - సంపూర్ణ వివరణ . 


    ప్రప్రధమముగా మనం శివుడు గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే శివుడు గురించి తెలుసుకుంటేనే కదా శివరాత్రి గురించి తెలిసేది . 


   "రుద్రము" లో   "అధ్యవోచ దధివక్తా ప్రథమోధైవ్యో భిషక్ " అని చెప్పబడినది. దేవతలకు ప్రధమవైద్యుడు , అందరికన్నా ముందుగా ( విషయాలను ) చెప్పినవాడిగా శివుణ్ణి కీర్తించడం జరిగినది. అందుకనే శివుడిని బై ( వై)ద్యనాధుడు " అని కూడా చెప్పబడినది. 


             శివరాత్రి పర్వదినం నందు ఉపవాసం , జాగరణ , శివునికి అభిషేకం , బిల్వములు , తుమ్మిపువ్వులతో అర్చనలు నిర్వహించబడును. 


    జాగరణ చేయుటకు ప్రధానకారణం శివుడు ఈదినము నందు హాలాహలం మింగినాడని పురాణాలు చెప్తాయి. ప్రపంచాన్ని దహించివేసే హాలాహలం నిరోధించే సమర్ధత శివునికి మాత్రమే ఉన్నది. శివుడు ఆపని అప్పుడు చేయకుండా ఉన్నచో లోకమే ఉండేది కాదు. ఆనాటి శివుని సాహసానికి ఆశ్చర్యచకితులు అయిన లోకులు నాటి తీవ్ర పరిమాణాన్ని స్ఫురిస్తూ నిద్రాహారాలు మాని శివుణ్ణి ధ్యానించడమే జాగరణ , ఉపవాసాలకి సంకేతం . ఆపత్సమయాలలో అవసరం అయితే జాగరణ ( నిద్రమేల్కొనడానికి ) కావలసిన మానసిక  , శారీరక అభ్యాసం ( తర్ఫీదు ) కలిగి ఉండటం సమాజానికి మంచిది కదా ! దేవునికి (ఉప)  సమీపంలో , (వాసం ) ఉండడం అని కూడా ఉపవాసానికి ఉండే అర్ధాలలో ఒకటి. 


          పుట్టినప్పటి నుండి గిట్టేవరకు నిరంతరాయంగా పనిచేసే అవయవాలలో జీర్ణాశయం ( ప్రేవులు) కూడా ఒకటి . అట్టి జీర్ణాశయానికి కొన్ని సందర్భాలలో విశ్రాంతిని ఇవ్వడం ఆరోగ్యసూత్రాలలో ఒకటి . శివుడిని పూజించేందుకు ఉపయోగించే మూలికలలో బిల్వము ( మారేడు) ద్రోణపుష్పి ( తుమ్మి) ముఖ్యమైనవి . వీటిని ఆయుర్వేదంలో విషచికిత్సలలో వాడతారు. 


            శివుడు శ్మశానవాసి . పాములను ఆభరణంగా ధరించి , హాలాహలం మింగినవాడు. కావున విషహార ద్రవ్యాలతో , తాపాన్ని తగ్గించే అభిషేకములతో శివుని పూజించుటకు ప్రాధాన్యత ఏర్పడినది . 


                              సంపూర్ణం  


                     కాళహస్తి వేంకటేశ్వరరావు 


                 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                              9885030034

కామెంట్‌లు లేవు: