*అమ్మ కోరిక*
" ఏంటి! ఎప్పుడూ నాన్న ఈ టైం లో ఫోన్ చేయరే, ఏమయ్యిందో" అనుకుంటూ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసాను.
" హలో నాన్నా! ఏమయ్యింది". "ఒరేయ్ బాలు .. అది.. అదీ …మీ అమ్మకు వంట్లో బాగోలేదురా, మొన్న హాస్పిటల్ లో జాయిన్ చేసాము. ఇంకా 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేము అంటున్నారు డాక్టర్స్. ఇప్పటికే ఐదు లక్షలు కట్టాము. నువ్ డబ్బులు పంపించి వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ కి వచ్చేయ్ రా" అంటూ చెప్పలేక చెప్పలేక చెప్పాడు నాన్న.
ఆ మాట విన్న నాకు మెదడు మొద్దుబారిపోయింది. ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. "నాన్నా! ఒక్క నిమిషం, ఇపుడే మళ్ళీ కాల్ చేస్తా," అంటూ ఫోన్ కట్ చేసాను.
కళ్ళ ముందు ఏమి కనిపించడం లేదు. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. అమ్మా అమ్మా అంటూ మనసు రోదిస్తోంది. వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్లి చల్లని నీళ్లతో మొహం కడుక్కుని వచ్చి, మళ్ళీ నాన్నకు కాల్ చేసాను. "నాన్నా! డాక్టర్ నెంబర్ ఒకసారి నాకు ఇవ్వండి. నేను మాట్లాడుతాను. అలాగే వెంటనే అమ్మని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకెళ్లండి. నేను ఎల్లుండికల్లా వచ్చేస్తా. ఒక నర్స్ ని కూడా అటెండెంట్ గా తీసుకెళ్లండి." అని చెప్పి, ఫోన్ కట్ చేసి డాక్టర్ కి కాల్ చేసి పరిస్థితి తెలుసుకున్నా. వెంటనే అమ్మని ఇంటికి పంపే ఏర్పాట్లు, మెడికల్ అసిస్టెంట్ని మొత్తం డాక్టర్ గారు ఏర్పాటు చేస్తా అన్నారు. ఇంక నేను అమెరికా నుంచి ఇండియాకి నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నా.
నేను వచ్చేసరికి అమ్మ ని ఇంటికి తీసుకువచ్చారు. ప్రతిక్షణం అమ్మను చూసుకోడానికి నర్స్ కూడా ఉంది. వెంటనే వెళ్లి అమ్మ పక్కన కూర్చుని అమ్మ చెయ్యి పట్టుకుని "అమ్మా! అమ్మా! నేను వచ్చాను. కళ్ళు తెరువు అమ్మా !. నన్ను చూడు." అంటూ ఏడుస్తూ ఉన్నా. పక్కనే అన్నయ్య నాన్న చెల్లి నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతలో అమ్మలో మెల్లిగా కదలిక కనబడింది. చేయి కదిలించే ప్రయత్నం చేస్తోంది. కళ్ళు తెరవాలని ఆరాటం అమ్మలో కనబడుతోంది. "అమ్మా ..!అమ్మా..!" అంటూ మేము పిలుస్తున్నామో ఏడుస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలా ఆరోజంతా అమ్మ పక్కనే ఉన్నాం అందరం. అమ్మ మంచం పక్కనే అందరం పడుకున్నాము ఆ రాత్రికి.
తెల్లారేసరికి అమ్మలో కొంచం కదలిక వచ్చింది. నన్ను చూసి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. అది చూసి మా చెల్లి, " అమ్మా..! లే అమ్మా..! నీ ముద్దుల కొడుకు వచ్చేసాడు. కనీసం వాడితో అయిన మాట్లాడు" అంటూ ఏడుస్తోంది. నేను అమ్మ చేతిని నా చేతిలోకి తీసుకున్నా. అమ్మ స్పర్శ ఏదో చెప్తోంది నాకు. ఇంక అమ్మ తన ఆఖరి గడియల్లో ఉందని అర్థం అవుతోంది.
"నాన్నా..! ఇటు రా" అని పిలిచా. "మంచం మీద కూర్చొని అమ్మ తలని నీ ఒడిలో పెట్టుకో నాన్నా..!" అని చెప్పా. నాన్న అలాగే చేసాడు. అన్నయ్య, చెల్లి అమ్మకు చెరొక వైపు కూర్చున్నారు.అమ్మ చేతుల్ని పట్టుకుని. నేను అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నా. అమ్మ పాదాలు తాకుతూ. అలా అలా ఐదు నిమిషాల్లో అమ్మ కళ్ళల్లో నుంచి ఒక ఆనందభాష్పాన్ని రాల్చి స్వర్గలోక ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడ మంచం మీద విగత జీవిగా మిగిలింది. ఒక్కసారిగా మమ్మల్ని అనాధలుగా మార్చేసి, శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయింది.
అందరికి కబురు చేసాము. అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. "బాలుని డబ్బులు పంపమంటే, పంపకుండా ట్రీట్మెంట్ ఆపేసి ఇంటికి తెచ్చేశారు పార్వతమ్మని. అందుకే ఇలా కాలం చేసింది ఆవిడ. లేకుంటే ఇంకా బతికి ఉండేది. కలికాలం కదా.. ఏం పిల్లల్లో ఏమో, డబ్బులకు విలువ నిచ్చి అమ్మను చంపేసుకున్నారు." అనడం నాకు వినిపిస్తూ ఉంది. నాన్న కూడా విన్నాడు. అదే నిజమేమో అనుకునే పరిస్థితిలో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అనిపించింది ఆ క్షణంలో నాకు. "సరేలే ఎవరైనా ఏమైనా అనుకోని," అనుకుని అమ్మకి చివరి సారిగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి చేసాము. అమ్మకి ఘనంగా వీడ్కోలు పలికాము.
కర్మకాండలన్నీ అయ్యాక, నేను ఒక పుస్తకం తెరిచి, "నాన్నా..! ఈ బుక్ గుర్తుందా! నేను అమెరికా వెళ్లే ముందు అమ్మకు గిఫ్ట్ గా ఇచ్చాను, నాతో ఏమి చెప్పాలనిపించినా ఈ బుక్ లో రాయమని చెప్పాను, అదే ఇది" అంటూ , నాన్నకు ఇచ్చా చదవమని. అది అమ్మ రాసిన ఉత్తరం లాంటిది. నాన్న కళ్ళు అందులోని అక్షరాలవెంట పరుగులు తీస్తూ.. కళ్ళల్లో నుంచి కన్నీరు ధారగా రావడం మొదలయ్యింది.
" ఒరేయ్ బాలు, నీకు ఒక విషయం చెప్పాలని ఉందిరా. ఈరోజు మన ఇంటి పక్కన ఉండే రత్నమ్మ గారు చనిపోయారు. ఆ ఆంటీకి నువ్వంటే భలే ఇష్టం కదా. నీ చిన్నప్పుడు నువ్ ఎప్పుడు వాళ్ళింటికి వెళ్లినా నీకోసం హార్లిక్స్ కలిపి ఇచ్చేది. గుర్తుందా. తనకి జ్వరంగా ఉందని వాళ్ళబ్బాయి హాస్పిటల్ లో చేర్చాడు. రెండు రోజులు బాగానే ఉంది, హాస్పిటల్ కి వెళ్లిన వాళ్ళతో కూడా మాట్లాడింది. రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాలే అంటూ. కానీ ముడవరోజుకు పరిస్థితి బాగాలేదు. చాలా సీరియస్ గా ఉంది కండిషన్ అన్నారు. నాలుగవ రోజుకి చనిపోయింది అంటూ వార్త చెప్పారు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా బాలు. నాకు అలా హాస్పిటల్ లో చనిపోవడం ఇష్టం లేదురా. నాకేమైనా అయితే, డాక్టర్స్ ఏమి చెప్పలేము అని చేతులు ఎత్తేస్తే .. నన్ను ఆ మెషీన్స్ మద్యలో వదిలేయకండిరా. నాకు మన సొంత ఇంట్లో నాన్న ఒడిలో తల పెట్టుకుని, మీ అందరూ నా చుట్టూ ఉండగా, అందర్నీ తనివితీరా చూసుకుంటూ వెళ్లిపోవాలని ఉంటుంది రా. నువ్ ఈ సారి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఈ పుస్తకం చదువుతావుగా. అపుడు తెలుస్తుందిలే నీకు నా కోరిక."
ఇది చదివి నాన్న కళ్ళ వెంబడి నీళ్లు జల జలా రాలిపోతున్నాయి. "నాన్నా..! ఏడవకండి. నేను కూడా ఇది నిన్న రాత్రే చదివాను. నేను అమౌంట్ పంపించలేదు అని మీరు కూడా అనుకుంటున్నారు కదా. నాకు అమ్మ కన్నా డబ్బే ముఖ్యం అయ్యింది అని బాధ పడ్డారు కదా. ఒక సారి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. నేను అమెరికాలో బయలుదేరక ముందే ఐదు లక్షలు పంపించాను. నాకు డబ్బు ముఖ్యం కాదు. అమ్మ ప్రాణమే ముఖ్యం. కానీ డాక్టర్ గారితో మాట్లాడక తెలిసింది. హోప్ లేదని. అందుకే అమ్మ అందరితో కలిసి ఉండాలి, హాస్పిటల్ లో ఎవరు దిక్కు లేనిదానిలా ఒంటరిగా చనిపోకూడదని ఆ నిర్ణయం తీసుకున్నా. అది తప్పనిపిస్తే క్షమించండి నాన్నా..!" అన్నాను.
"లేదురా..! మేమే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజంగా నువ్ మీ అమ్మకి ముద్దుల కొడుకువే. మీ అమ్మ మనసు నువ్ అర్థం చేసుకున్నట్లుగా, కట్టుకున్న భర్తను నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వే మమ్మల్ని క్షమించాలిరా నిన్ను అర్థం చేసుకోనందుకు." అన్నాడు నాన్న.
"లేదు నాన్నా మీరు అలా అనకండి. అలా చూడండి ఆకాశంలో నుంచి ఆ మెరిసే నక్షత్రం ఎలా చూస్తుందో మనల్ని. ఆ నక్షత్రం ఎవరో తెలుసా.. "మా అమ్మ" అంటూ నేను అన్నయ్య చెల్లి ఒకేసారి అన్నాం.
" అవును రా..! మన బాగోగులు చూసుకోవడం మీ అమ్మకి చాలా ఇష్టం. అందుకే ఆకాశంలో తారకలా నిలిచి, అనుక్షణం మనందరిని గమనిస్తూ ఉంటుంది మీ అమ్మ ప్రేమగా..." అంటూ కళ్ళు తుడుచుకున్నాడు నాన్న. నేను, అన్నయ్య, చెల్లి ముగ్గురం నాన్నను కౌగిలించుకుని అలా ఆకాశంలో మెరిసే నక్షత్రాన్నీ చూస్తూ ఉండిపోయాము.
దేవలపల్లి సునంద
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి