15, జనవరి 2022, శనివారం

అసిధారావ్రతం

 *అసిధారావ్రతం!*


‘అదేమీ ఆషామాషీ విషయం కాదు. అసిధారావ్రతం!’ అని చాలామంది అంటూ ఉంటారు. అసలు ఏమిటీ అసిధారావ్రతం.

 

‘అసి’ అంటే ‘కత్తి’, ‘ధార’ అంటే ‘పదునైన అంచు’ అని అర్థం. అంటే కత్తియొక్క పదునైన అంచు అని భావన.  


అర్థం వరకు బానే ఉంది గానీ ఈ జాతీయం ఏమిటి, భాషా ప్రయోగం ఎలా చేయాలి, మధ్యలో ఈ వ్రతం ఏమిటి మరి!


 ‘అసిధారావ్రతం’ అనేది నిజంగానే ఒక వ్రతం. పెళ్లైనవాళ్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు చేపట్టే కఠినమైన వ్రతం ఇది.

 

ఏవైనా కారణాల చేత భార్యాభర్తలు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఒకే మంచం మీద పడుకున్న భార్యభర్తల మధ్య ఒక పదునైన కత్తి పెట్టేవారు. కత్తి ఆ భార్యాభర్తల మధ్య హద్దులా ఉంటుంది. ఉన్నచోటు నుంచి తెలిసో తెలియకో ఏ మాత్రం కదిలినా కత్తికి బలి కాక తప్పదు. అందుకే ఎంతో అంకితభావంతో ఈ దీక్ష చేసేవారు.

 

ఇప్పుడు ఈ ‘అసిధారావ్రతం’ ఎక్కడైనా ఆచరణలో ఉందా లేదా అనేది తెలియదుగానీ, కఠినమైన పని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ కఠినమైన పనిని అంతకంటే కఠినమైన దీక్షతో చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం *అసిధారావ్రతం* అన్న జాతీయాన్ని వాడటం జరుగుతోంది.

 

మీకు తెలిసిన యిలాంటి జాతీయాల గురించి తెలియజేసి భాషాభివృద్ధికి తోడ్పడండి.

కామెంట్‌లు లేవు: