*👆శ్రీ కుప్పా విశ్వనాథ శాస్త్రి గారు.*
🌷🌷🌷
(రచయిత పేరు తెలియదు.)
మీరు ఈ మహానుభావుడి పేరు విన్నారా? మీరు ఆయన పేరు వినకుంటే అది ఆయన ఔన్నత్యమే తప్ప వేరే ఏమీ కాదు. అదేమిటి అంటారా? ఆయనకి కీర్తి కండూతి, వ్యక్తిగత ప్రచార ఆర్భాటాలు లేవు అని నా భావం.
ముందుగా ఆయన ఎవరు , ఆయన ఏమి చేస్తుంటారో చెబుతాను.
ఈయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‍లో శ్రీమద్భగద్గీత ప్రవచనం చేశారు. వీరు వృత్తి రిత్యా తిరుపతి లో సంస్కృత విశ్వవిద్యాలయంలో న్యాయ తర్క విభాగంలో ప్రొఫెసర్‍గా ఉన్నారు.
ఈయన గూర్చి గూగుల్ లో ఎంత వెదకినా నాకు కనపడలేదు. అది ఆయన సింప్లిసిటీ కావచ్చు కానీ మంచికి ప్రచారం జరగాలి. ఇలాంటి మహానుభావుల గూర్చి అందరికీ తెలియాలి.
10 సెప్టెంబర్ 2020 లో మొదలు పెట్టి 13 జనవరి 2022 వరకు భగవద్గీత పారాయణ, ప్రవచనం అనె యఙ్జాన్ని చేపట్టి విజయవంతంగా నిర్వహించారు ఈయన. ఈ కార్యక్రమం ఎస్వీబీసీ భక్తి ఛానెల్‍లో లైవ్ టెలికాస్ట్ గా ప్రసారం అయ్యి అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఎంతో మంది ఈ కార్యక్రమము చాలా బాగుంది అని చెప్పటం జరిగింది. తప్పక చూడండి అని నాకు ఎందరో చెప్పారు. నా పని వత్తిళ్ళవల్ల ఈ లైవ్ కార్యక్రమం టీవీలో చూసే అవకాశం నాకు కలగలేదు. కానీ నా అదృష్టం బాగుండి యూట్యూబ్ లో ఈ కార్యక్రమం 491 ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉండటం వల్ల గత పదిహేను రోజులుగా క్రమం తప్పకుండా వింటున్నాను. ఈ కార్యక్రమం గూర్చి మాటల్లో చెప్పలేము. అది ఒక అమృతతుల్యమైన భాషణం. అది వినడం పూర్వ జన్మ సుకృతం.
చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి ధర్మరాజు గూర్చి, దుర్యోధనుడి గూర్చి, ఏకలవ్యుడి గూర్చి, కర్ణుడి గూర్చి కొన్ని అభిప్రాయాలు ఏర్పడి పోయాయి.
ఈ ప్రవచనం వింటుంటే మహా భారతపాత్రలు వాటి అంతరంగాలు, నిజానిజాలు ఏమిటి అనేది తెలుస్తోంది. ముఖ్యంగా భీష్ముడి గూర్చి, కర్ణుడి గూర్చి వారు చెప్పిన మాటలు వింటే మన అంతరంగాలు ఎంతో ఙ్జానాన్ని పొందుతాయి.
ఇంతాచేసి నేను వినింది కేవలం ఈ రోజు దాకా 17 ఎపిసోడ్లు మాత్రమే.నేను ఇంకా ప్రధమాధ్యాయం లో 16వ శ్లోకంలోనే ఉన్నాను.
ఆయన చెప్పే వివరణ వింటుంటే హృదయం ఆనందంతో ఉప్పొంగి పోతుంది. మనసులో చీకట్లు తొలగిపోయి ఙ్జాన జ్యోతులు వెలిగిన అనుభూతి కలుగుతోంది.
పాశ్యాత్య మెధావులుఅందరూ టన్నులు టన్నులు పర్సనాలిటి డెవలెప్‍మెంట్ బుక్స్ వ్రాస్తూ ఈ గీత ద్వారానే ఇన్‍స్పైర్ అయ్యాం, మా ఙ్జానం అంతా గీత దయనే అంటూంటే ఏమిటో అనుకునే వాడిని.
నా ప్రయాణం అటు నుంచి ప్రారంభం అయ్యింది కదా. అంటే పాశ్చాత్య మేధావులు వ్రాసిన వ్యక్తిత్వ వికాస గ్రంధాలు చదివి, వారి శిక్షణా కార్యక్రమాలలో చేరి నేను పొందిన ఙ్జానం యొక్క మూలాలు ఎక్కడున్నాయో బేరీజు వేసుకుని చూసేదానికి ఇప్పుడు నాకు అవకాశం లభించింది.
శ్రీ కుప్పా విశ్వనాథ వారిలో నేను గమనించిన కొన్ని అంశాలు.
** వారు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా విషయాన్ని చెబుతారు
** ఎక్కడా కూడా సంక్లిష్టమైన (కాంప్లికేటెడ్ ) పదాలు కానీ, ఉదాహరణలు కానీ ఉండవు
** ఏ పాత్ర పట్ల అనుకూల ధోరణి (బయాస్డ్ అప్రొచ్) లేదు
** ముఖ్యంగా స్వాతిశయం లేదు. తనను తాను గురువుని అని పొగుడుకుంటూ, తన అనుభవాలని ఏకరువు పెట్టుకుంటూ మాట్లాడటం ఉండదు
** ఆయన ప్రవచనంలో ఎవ్వర్నీ కించపరచడం ఉండదు
** తనను తాను పొగుడుకోవడం ఉండదు
** అనవసరమైన ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం ఉండవు
** ఇతర మతాల్ని, మతావలంబకుల్ని విమర్శించటం ఉండదు
** మరీ ముఖ్యంగా ’నేను’ అనే పదమే ఆయన వాడలేదు ఇప్పటిదాక
** నేటి వ్యవస్థని, సినిమాలని, రాజకీయాలని విమర్శించాల్సిన సందర్భాలు ఎన్నో వచ్చినా ఆయన పని కట్టుకుని వాటిని విమర్శించాలనే కార్యక్రమం పెట్టుకోలెదు. ఆయన ఏకాగ్రత అంతా భారతంలోని పాత్రల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి వదిలి వేయాలి. ఎవ్వర్ని ఆదర్శంగా పెట్టుకోవాలి, ఎవ్వర్నీ త్యజించాలి అన్న ధోరణిలో సాగుతోంది.
** తాను ఎవరూ అని కానీ, తన వృత్తి వ్యాసంగాలు కానీ, తాను పొందిన సన్మానాలు కానీ ఆయన అసలు చెప్పుకోడు.
** అత్మ స్థుతి లేదు, పరనింద అసలు లెదు. స్వోత్కర్ష లేనే లేదు. ఆయన నోట ఇంతవరకు ’నేను’ అన్నమాటనే నేను వినలేదు.
** అలా అన్చెప్పి ఏదో చాదస్తంగా చెబుతున్నాడు అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఆయనకి ఇంగ్లీష్ భాషమీద సాధికారత ఉంది. ఆయన సరదాగా వాడే ఉపమానాలు, పదాలు మనల్ని ఆలోచింపజేస్తాయి.
** అలాంటి ప్రవచనకారుడు మన మధ్య ఉండటం, ఆయన ప్రవచనాన్ని వినే అదృష్టానికి నేను నోచుకోవడం నా పూర్వజన్మ సుకృతం.
టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమయింది. టెక్నాలజీ ని ఇలా సద్వినియోగం చేసుకోవటానికి అవసరమైన వనరులు టీటీడికి ఉండటం ఎంతో మంచిది అయింది.
***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి