*మధువు కైటభుడు*
తేనపట్టును దగ్గరనుంచి పరిశీలన గా చూస్తే దానిలో ఉన్న విభాగాలు తెలుస్తాయి. పై భాగం తేనె నిల్వ చేసే భాగం. కిందిభాగం వాటి పిల్లలు వుండేభాగం. ఆ పిల్లలకు ఆహారంగా ఉండడానికి ఆ తేనెటీగలు తేనెను సేకరించి ఉంచుతాయి.
మధువు అంటే తేనె. కీటమ్ అంటే పురుగు. కీటభం చిన్నపురుగు. కైటభం చిన్న పురుగులకు సంబంధించినది. మధు, కైటభాలు రెండూ తెనపట్టులో భాగాలు. ఆధ్యాత్మికంగా చూస్తే అవే అహంకార మమకారాలు. పురుగులు అహంకారం. తేనె మమకారం.
*తేనెటీగలు తేనెపట్టు దగ్గరకు ఎవరైనా వస్తే ప్రాణాలకు తెగించి పోరాడతాయి. మనమూ అంతే. మనమీదికి గాని మనదాని మీదికి గాని ఎవరైనా వస్తే అలాగే పోరాడతాము. ఎక్కువ పోరాటాలు "మనవి" (ఆస్తులు, ధనము, అధికారము) అనుకున్న వాటి కోసమే జరుగుతాయి. అవి తేన లాగా మనకూ ఎదుటివాడికి కూడా చాలా తియ్య గా ఉంటాయి కాబట్టి..*
మధువు కైటభుడు ఇద్దరూ విష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవి లో నించి పుడతారు. ఆయన లోపల నుంచి పుట్టారు కనుక వాళ్ళతో యుద్ధం చేసి ఆయన వాళ్ళను జయించ లేక పోతాడు. మోసం తో జయించాలను కుంటాడు. మీకు వరమిస్తాను రండి అంటాడు. వాళ్ళు నవ్వి నువ్వు మాకు వరాలిచ్ఛే దేమిటి నీకే మేము వరమిస్తా మంటారు. సరే అని మీరు నాచేతులో మరణించాలి అని వరం కోరతాడు విష్ణువు. వాళ్ళు ఒప్పుకుని కొన్ని కోరికలు కోరతారు. అది మధు కైటభుల కధ.
నిజానికి ఈ తేనె తుట్టే అనేది మన అందరిలో నూ ఉంటుంది. ఇది జీవుడిలో మాయ చేత అవరింపబడిన భాగం, అసుర భాగం. రెండవది జ్ఞానం చేత అవరింపబడిన భాగం, దైవ సంబంధ మైనది. రెండూ మన మనసు లోనే ఉంటాయి. యుద్ధం వాటి మధ్య జరుగుతుంది. జ్ఞానం యొక్క సహాయం లేకుండా గెలుపురాదు. ఇది సూత్రం. పరాయి వాళ్ళతో యుద్ధం చెయ్యొచ్చు గానీ మనలో మనం యుద్ధం ఎలా చేస్తాము అని కొందరికి సందేహం. వివేక చూడామణి లో ఆది శంకరులు ఇలా చెప్తారు. "మనసా కల్ప్యతే బంధో, మోక్ష స్తేనైవ కల్ప్యతే". బంధమూ మొక్షమూ రెండింటినీ మనసే కల్పిస్తుంది అని. అహంకార మమకారాలు కల్పించేది మనసే వాటిని వదిలించుకో డానికి ఉపయోగ పడేది కూడా మనసే.
అహంకారాన్నే జీవుడు తన స్వరూపంగా భావిస్తాడు. ఆ స్తాయిని దాటి ప్రజ్ఞానాన్ని ఆసరాగా పొంది తన అసలు స్వరూపం ఇది కాదు అని తెలుసుకునే టప్పుడు, లోపల పెద్ద యుద్ధం మే జరుగుతుంది. అలా (లోపలి) యుద్ధం చేసి అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించి తన అసలు రూపాన్ని (ఆనంద స్వరూపాన్ని) అందుకోవాలి. ఇది మధు కైటభు ల తో నారాయణుడి యుద్ధం సూచించే ఆధ్యాత్మిక రహస్యం.
* * *
పురాణాల లో కధలకూ ఆధ్యాత్మిక విషయాలకూ సంబంధం ఉంటుంది. ఈ సంబంధం పొడుపు కధలలో లాగా ఉంటుంది. ఇంకెక్క డైనా ఇలాంటిదే ఇంకో పొడుపు కథ వస్తే ఈ విషయం అక్కడ పనికి వస్తే వాడుకోవచ్చు.
మధు కైటభుల కథను అన్వయిస్తే సుందర కాండ లోని మధువన ధ్వంసం ఘట్టం లో ఉన్న ఆధ్యాత్మిక సూచన అర్ధమౌతుంది. ఈ మధువనం లో ఉండే తేనే తెట్టెలను మూడు తరాల నుంచి, అంటే వాలి సుగ్రీవుల తండ్రి ఋక్ష ధ్వజుడు అతని తర్వాత వాలి, వాలి తర్వాత సుగ్రీవుడు ఈ మధు వనాన్ని తాము అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా కాపాడు కొస్తుంటారు. అంజనేయుడి అనుమతి తో అంగదుడు కపులకు మధు భక్షణ కు అనుమతిస్తాడు.
యుద్ధానికి బయల్దేరేవాడు నాకు దెబ్బ తగులు తుందేమో అనీ, నావాళ్లకు ఇబ్బంది అవుతుందేమో అని భావిస్తే యుద్ధానికి వేళ్ళనే లేడు. వెళ్లినా "జయము జయము మహారాజా మన సైన్యాలు యుద్ధం లో చిత్తుగా ఓడాయి మహారాజా" అని వార్త చెప్పడానికి పనికి వస్తాడు. అట్లాంటి వాడు యుద్ధం చెయ్యడు.
*ఆంజనేయుడిని వైష్ణవులు ఆచార్య స్వరూపం గా భావిస్తారు.*.. స్వామికి అనుగ్రహం ఎవరిపైన కలిగితే వాళ్ళను సన్మార్గం లో పెట్టి ఒకమెట్టు పైకి ఎక్కిస్తుంటాడు. ఆంజనేయుడు అప్పటికే రామదాసు అయ్యాడు. సుగ్రీవుడి దండు (సైన్యం) రామ దండు గా మారాలి. లేకుంటే యుధ్దం లో గెలవ లేరు. ఆంజనేయుడు అనుమతించి మొత్తం కపి సేన లో వుండే వాళ్ళందరి చేతా మధువనాన్ని ధ్వంసం చేయిస్తాడు. దీనికి ఆధ్యాత్మిక అర్థం కపు లందరి మనసు లోపలి తేనెతుట్టెలను వాళ్ళ చేతనే ధ్వంసం చేయించడం. ఇదే మధువన ధ్వంసం. అంత దాకా వాళ్ళు సుగ్రీవ సైన్యం. ఆతరవాత రామ దండు. రామ దండు అంటే వానర మూక అనే మాట అప్పటినుంచి సార్థక మైంది. ఆ తరవాత వానరులందరూ అహంకార మమకారాలను వదిలి రామ కార్యం లో నిమగ్నులవుతారు.
రామ రావణ యుద్ధంలో వానరులు కూడా చాలా మంది మరణిస్తారు. హనుమంతుడు సంజీవిని తెచ్చినప్పుడు వీళ్ళు మళ్లీ బతుకుతారు. మళ్లీ ఇంకో సారి యుద్దంలో కొంతమంది చచ్చిపోతారు. యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఇంద్రుడు మళ్ళీ బ్రతికిస్తాడు. అంటే వీళ్ళు రెండు సార్లు మరణించినా కూడా రాముడి పక్షాన యుద్ధం చేయడం మానరు. అంత గట్టిగా రాముడి పక్షాన నిలబడి ఉంటారు. ఒకసారి అహంకారం నశించి న జీవుడు ఎప్పటికీ భగవంతుడిని వదిలిపెట్టడు.
********
వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి ఈ మధు కైటభ వధకూ సంబంధం వుందిట. ఈ రాక్షసులకు విష్ణువు ఇచ్చిన వరం వల్ల వారికి మొక్షమివ్వడానికి ఉత్తర ద్వారం లో నుంచి వైకుంఠానికి తీసుకు వెళ్లారని. ఉత్తర ద్వార దర్శనం అందరికీ మోక్ష కారక మయ్యేటట్లు విష్ణువు అనుగ్ర హించాడని చెప్తారు.
ఈ వానరులంతా సీతను వెతకడానికి దక్షిణానికి వెళ్లిన వాళ్ళు. దక్షిణ సముద్రం వద్ద నుంచి తిరిగి రాముడి దగ్గరకు (పరమాత్మ దర్శనానికి) రావాలంటే ఉత్తరాని కి ప్రయాణించాలి. అలా ఉత్తరానికి ప్రయాణిస్తూ వస్తే మధువన ధ్వంసం తరవాత రామ దర్శనం జరుగుతుంది.
*పవని నాగ ప్రదీప్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి