3, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్..114

 

..

అత్రిమహాముని ఆశ్రమానికి చేరుకున్న సీతారామలక్ష్మణులు ఆయనకు నమస్కరించి నిలుచున్నారు.వీరిని చూడగనే ఎక్కడలేని సంతోషము కలిగింది మహర్షికి.ఆయన రాముడిని స్వంత కొడుకులాగ ఆదరించాడు.స్వయంగా తానే ఆతిధ్యమిచ్చాడు.

.

ఆయన తన భార్య అయిన అనసూయాదేవిని అక్కడికి పిలిచి ఆమెసముఖంలో మంచిమాటలతో వారిని సంతోషపెట్టాడు.

.

సీతను అనసూయకు అప్పగించి ఆవిడగూర్చి రాముడితో .ఈవిడ అనసూయ గొప్పతపఃసంపన్నురాలు,పదివేల సంవత్సరములు తపస్సు చేసినది.ఎన్నో వ్రతాలు పూర్తిచేసినది.ఈమె తన గొప్పపనులచేత "అనసూయ" (కోపము,అసూయ లేనిది)అని లోకంలో ప్రసిద్ధి చెందినది.

.

అనసూయామాత వద్దకు సీతాదేవి వచ్చి ఆవిడకు ప్రదక్షిణము చేసి వినయంగా తన పేరుచెప్పి నమస్కరించింది.

.

అప్పుడు ఆ వృద్ధ తాపసి అమ్మాయీ విన్నానే నీగురించి ! నీవు ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నావని తెలుసుకొన్నాను.

బంధుజనాన్ని,అహంకారాన్ని వదలి అడవికివెడుతున్న నాధుడిని అనుసరిస్తున్నావు .

.

ఏ స్త్రీ అయితే భర్తవనములో ఉన్నా ,నగరములో ఉన్నా ,వాడుపాపాత్ముడుకానీ ,పుణ్యాత్ముడుకానీ అతనిని అనుసరిస్తూ ఉంటుందో ఆ స్త్రీ కి ఉత్తమ లోకములు కలుగుతాయి.

.

సీతా ,భర్తను మించిన బంధువు ఎవడైనా ఉన్నాడా?

.

మనస్సును కామమునకి వశం చేసిన స్త్రీలు భర్తలమీద అధికారం చెలాయిస్తూ మంచిచెడ్డలు తెలుసుకోలేరు.

.

అమ్మా స్త్రీ కి భర్తపూజ్యుడు అనే విషయము నాకు తెలియును.భర్త ఎంత చరిత్రహీనుడైనా అతనిని తప్పక పూజించవలసినదే.

.

అలాంటిది గుణములచేత శ్లాఘింపదగినవాడు,దయామయుడు,జితేంద్రియుడు,

స్థిరమైనప్రేమగలవాడు,ధర్మాత్ముడూ,నాతల్లివలే,తండ్రివలే నాకు చాలా ఇష్టుడు అయిన నా భర్తగురించి వేరే చెప్పాలా?

.

తన తల్లి కౌసల్యవిషయములో ఏ విధముగా ప్రవర్తించునో ఇతర రాజభార్యల విషయములో కూడా అలాగే ఉంటాడు.

.

అంత ఎందుకు దశరధుడు ఒక్కమాటు చూసిన స్త్రీ ని కూడా తన తల్లి లాగ గౌరవిస్తాడు.

.

అమ్మా! నాకు నా తల్లి,అత్తగారు ఇరువురూ ఉపదేశించిన మాటలను మనస్సులో ఉంచుకొన్నాను.

.

స్త్రీ కి పతి శుశ్రూషే పెద్ద తపస్సు వేరే ఏ తపస్సు అవసరములేదు.

.

నాకు సావిత్రి ,రోహిణి ఆదర్శము అని పలుకుతున్న సీతమ్మను దగ్గరకు తీసుకొని ముద్దుగా శిరస్సుపై ఆఘ్రాణించింది అనసూయామాత.

.

NB

.

సీత దృష్టిలో రాముడు ఎంత గొప్పవాడో చూడండి.

అలాగే దశరధుడు ఎంత కాముకుడో కూడా గమనించగలరు.అంత కాముకుడైన తండ్రికి ఏకపత్నీవ్రతుడైన కొడుకు.!


రామాయణమ్.115

.

సీతను చూస్తుంటే ఆవిడకు సంతోషం ! ఆవిడ మాటలకు మెచ్చి ఏదైనా ఇవ్వాలనుకొని సీతా ! నీకు ఏమి వరము కావాలో కోరుకో అమ్మా ! నీకు కావలసినది ఇస్తాను .అని పలికింది అనసూయామాత.

.

తల్లీ! నీ ఆప్యాయతే నాకు కొండంత వరము నాకు అది చాలు అని బదులిచ్చింది సీతమ్మ.

.

పెద్దలకు అనుగ్రహము కలిగితే ఆగరుకదా !

.

విదేహపుత్రీ ! ఇదిగో నీకు దివ్యములు,శ్రేష్ఠములు అయిన ఈ పూలమాలలు,వస్త్రము,అలంకారములు,అంగరాగము,శ్రేష్టమైన మైపూతను ఇస్తున్నాను .ఇవి ఎల్లప్పుడు ఉంటాయి.ఈ వస్త్రము మాయదు,నలగదు. ఈ దివ్యమైన అంగరాగము పూసుకొని నీవు నీ భర్తను శోభింపచేయగలవు.

.

అనురాగం తో అనసూయామాత ఇచ్చిన వస్తువులు స్వీకరించింది సీతమ్మ.

.

స్థిరనియమాలు గల అనసూయా మాత తనకు ప్రియం కలిగించే ఒక విషయం సీతమ్మను అడిగింది.

.

అమ్మాయీ చెప్పవే ! నీ వివాహపు ముచ్చట్లు!

 సీతమ్మను దగ్గరగా కూర్చోపెట్టుకుని మురిపెంగా చూస్తూ అడిగింది ముదుసలి ముత్తయిదువ మహాసాధ్వి అనసూయా మాత.

.

ఆవిడకు సీతమ్మ చెప్పే కబుర్లు మహదానందాన్ని కలిగిస్తున్నాయి.

.

సీతమ్మ సవివరంగా తను తన తండ్రికి ఏవిధంగా దొరికింది,తన స్వయం వరాన్ని ఎలా ప్రకటించినదీ,మహర్షివిశ్వామిత్రులవారితో రామలక్ష్మణులు వచ్చిన సంగతీ.రాముడు ఏవిధంగా వింటిని ఎక్కుపెట్టి విరిచిన విషయము తెలిపింది.

.

రాముడు శివధనుర్భంగం గావించిన వెంటనే నన్ను రామునకు ఇచ్చుటకై నా తండ్రి చేతిలోనికి జలకలశము తీసుకొన్నాడు.

.

కానీ!

.

రాముడు అందుకు అంగీకరించలేదు!

.

తన తండ్రీ,ప్రభువూ అయిన దశరధమహారాజు అభిప్రాయము తెలుసుకొనకుండా స్వీకరించను అని వినయంగా మా నాన్నగారికి తెలియచేశాడు.

.

అప్పుడు జనకమహారాజు దశరధమహారాజుకు కబురుపెట్టి ఆయన వచ్చి తన సమ్మతిని తెలియచేసిన తరువాత మాత్రమే నన్ను స్వీకరించాడు రాముడు..

.

మా చెల్లెళ్ళకు కూడా అదే సమయములో లక్ష్మణ,భరత,శత్రుఘ్నులతో వివాహం జరిపించారు మా తండ్రిగారు.

అని తమ వివాహ వృత్తాంతాన్ని అనసూయామాతకు తెలిపింది సీతమ్మ.

.

NB.

.

మన సినిమాలలో చూపించినట్లుగా విల్లువిరిచిన వెంటనే దండ రాముడి మెడలో వేయలేదు సీతమ్మ.

తండ్రి అభిప్రాయము ముఖ్యము రాముడికి! 

తండ్రికి ఆయన ఇచ్చిన గౌరవము అది!

కామెంట్‌లు లేవు: