3, అక్టోబర్ 2020, శనివారం

*బకాసుర వధ*



శాలిహోత్రుని వద్ద పాండవులు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు.తరువాత వారు ఏకచక్రపురానికి బ్రాహ్మణ వేషాలలో బయలుదేరారు. పాండవులు, కుంతీదేవి జింక చర్మాలు ధరించి, నార చీరలతో, వేదపఠనం చేస్తూ ఏకచక్రపురం వచ్చారు.

ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తమ నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రతీరోజు మౌనంగా అందరి ఇల్లకూ వెళ్లి బిక్ష స్వీకరించి, తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ బిక్షను రెండు భాగాలు చేసి, అందులో ఒక భాగం భీమునికి పెట్టి, మిగిలింది తను, మిగిలిన నలుగురు కొడుకులు తింటూ ఉండేవాళ్ళు.సత్ప్రవర్తనులు, సహృదయులు అయిన వారిని చూసి ఆ అగ్రహారంలో వాళ్ళు అందరూ చాలా ఆనందపడేవాళ్ళు.

ఒకరోజు భీముడు, కుంతీ ఇంట్లో ఉన్నారు. మిగిలిన వారు బిక్షాటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంటిలో నుండి రోదన ధ్వనులు వినపడ్డాయి. అవి విని కుంతీదేవి భీముని పిలిచి “నాయనా భీమసేనా! ఈ ఇంటి వారికీ ఏదో కష్టం కలిగినట్టుంది. వీరు మనకు ఉపకారం చేసారు. వవాళ్ళ ఉపకారాన్ని గుర్తించడం మనకు పుణ్యం, కాని దానికి ప్రత్యుపకారం చెయ్యడం ఎక్కువ పుణ్యం. కాబట్టి వాళ్లకు తగిన ప్రత్యుపకారం చెయ్యడానికి ఆలోచించు” అని చెప్పింది.

“అమ్మా!నీ ఆజ్ఞ అవశ్యం నెరవేరుస్తాను. తప్పకుండా వారికి ప్రత్యుపకారం చేస్తాను. నీవు వారి శోక కారణం కనుక్కొని రా అమ్మా” అన్నాడు భీముడు. సరే అని కుంతి వారి వద్దకు వెళ్ళింది. రోదిస్తున్న ఆ ఇంటి యజమానిని వారి దుఃఖానికి కారణం అడిగింది.

“అమ్మా జనన మరణాలు, సంయోగ వియోగాలు ప్రకృతి సిద్ధమైనవి. కాని వేదోక్తంగా వివాహమాడిన భార్యను రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను. పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపవలిసిన కూతురిని రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను. నాకు, నా పితరులకు పిందోదకాలు ఇవ్వవలిసిన కుమారుడిని రాక్షసునికి ఆహారంగా వెళతాను” అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు.

దానికి ఆయన భార్య సమ్మతించలేదు. “నాధా, మిమ్మల్ని వివాహమదినందుకు మీకు సంతాన ప్రాప్తి కలిగించాను. నా బాధ్యత తీరిపోయింది. భర్త కంటే ముందు మరణించిపుణ్యలోకాలకు వెళతాను. పైగా భర్తలేని స్త్రీలకు అవమానాలు ఎక్కువ. ప్రతీవాడు కోరతాడు, పైగా భార్య మరణిస్తే భర్త మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త మరణిస్తే, భార్య వేరే వివాహం చేసుకోలేదు కదా. కాబట్టి నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళతాను. మీరు వేరే వివాహం చేసుకొని, పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి,ప్రయోజకులను చెయ్యండి” అని చెప్పింది ఆ ఇల్లాలు.

అప్పుడు కూతురు ముందుకు వచ్చి, “అమ్మా, నాకు వివాహం చేసి మీకు మనుమలు కలిగే కంటే, మీరు జీవించి ఉంటే మీకు ఇంకా ఎక్కువ మంది సంతానం కలుగుతారు.అందుకని నేనే రాక్షసునికి ఆహారంగా వెళతాను” అని చెప్పింది.

ఇంతలో చిన్నవాడైన కుమారుడు,ధైర్యంగా ఒక చిన్న కర్ర తీసుకొని, “తండ్రీ నేను వెళ్లి ఆ రాక్షసుడిని చంపుతాను” అని వచ్చీ రాని మాటలతో ఓదార్చాడు.

ఇదేమి కుంతికి అర్థం కాలేదు. “అమ్మా రాక్షసుడు ఎవరు? మీరు వాడికి ఆహరం కావడం ఏమిటి? వివరంగా చెప్పండి.

దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. “అమ్మా, ఇక్కడికి ఆమడ దూరాన, యమునా నదీ తీరాన బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు గ్రామాల మీద పది అందరిని భక్షిస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు అందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ప్రతీరోజూ ఇంటికి ఒక మనిషి, రెండు దున్న పోతులూ, బండెడు ఆహరం వాడికి పంపాలి. ఈ దేసాన్నేలే రాజు కూడా వాడిని ఎదిరించే శక్తి లేనందున, ఆయన దీనిని గురించి ఆలోచించలేదు.”

అప్పుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో, “అయ్యా, మీరు దుఃఖించ వలదు.ఈ ఆపద తొలగే ఉపాయం నాకు తెలుసు. మీకు ఒక్కడే కొడుకు, నాకు ఐదుగురు కొడుకులు. వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపుతాను” అని చెప్పింది.

దానికి ఆ బ్రాహ్మణుడు “అమ్మా, వద్దమ్మా మీరు మాకు అతిథులు. మిమ్మల్ని ఆ కోరిక కోరడం మహాపాపం. పైగా బ్రాహ్మణ హత్య ఘోర పాపము” అని అన్నాడు.

దానికి కుంతీదేవి నవ్వి “అయ్యా! మీరు ఏమి ఆలోచించకండి, నా కుమారుడు అమిత బలవంతుడు. ఇదివరకు కొంత మంది రాక్షసులను చంపాడు. ఆ బకుడిని చంపి వస్తాడు” అని చెప్పింది.

వెంటనే భీముని పిలిచి జరిగిందంతా భీమునికి చెప్పింది. భీముడు సంతషంగా ఒప్పుకున్నాడు.ఇంతలో ధర్మజుడు, మిగిలిన తమ్ములు వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసాడు. తల్లిని పిలిచి “అమ్మా భీముడు ఎవ్వరితోనో యుద్ధానికి పోతున్నట్టున్నాడు. తనంతట తానే వేలుతున్నడా లేక మీరు వెళ్ళమన్నారా?” అని అడిగాడు.

జరిగిందంతా ధర్మజునికి చెప్పింది కుంతి.

“అమ్మా! అమ్మా! ఇదేమిటమ్మా!పరాయి వాళ్ళ కోసం కన్నకొడుకును బాలి ఇస్తావా అమ్మా. అమ్మా నీకు మతి భ్రమించినట్టుంది. భీమసేనుడు విదిచిపెట్టదగిన వాడా చెప్పమ్మా?” అన్నాడు.

“నాయనా ధర్మరాజా,భీముని బలము తెలియక నేను ఈ పని చెయ్యడం లేదు. ఈ భీమసేనుని శక్తి నీకు తెలియదు. వీడు పుట్టిన పడవ రోజున వీడు నా చెయ్యి జారి ఒక కొండ రాయి మీద పడ్డాడు. ఆ పెద్ద బండ రాయి పొడి పొడి అయింది. వీడు వజ్ర కాయుడు. ఆ రాక్షసుడిని చంపి ఈ అగ్రహారానికి శాస్వతంగా రాక్షస బాధ తీర్చగలడు.

క్షత్రియ ధర్మాన్ని ఇదివరకు వేద వ్యాసుడు చెప్పగా విన్నాను. అది నీకు చెపుతాను విను. ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలను తొలగించడానికి పుట్టిన వాడు. మృత్యుభయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలు పొందుతాడు. సాటి క్షత్రియుడిని రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే, ప్రజల అనురాగాన్ని పొందుతాడు. ఇది క్షత్రియ ధర్మం. మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం లభించింది” అని చెప్పింది.

వెంటనే ఆ ఉరి వారందరూ రక రకాలైన పిండి వంటలు, ఆహార పదార్థాలు తయారు చేసారు. ముందుగా భీముడికి తృప్తిగా కడుపునిండా భోజనం పెట్టారు. ఒక బండినిండా ఆహారపదార్థాలు నింపారు. భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటుకు వెళ్ళాడు. యమునా నదీ తీరాన బండి నిలిపాడు. బకాసురుని పిలిచాడు. వాడు ఎంతకూ రాలేదు. వాడు వచ్చేదాకా ఉరికే ఉండటం ఎందుకని, ఆ బండిలో ఆహారపదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా తినేసాడు.

Cont...

బకాసురుడికి ఏమి తోచడంలేదు. ప్రతీరోజూ భయంగా తన వద్దకు వచ్చే నరుడు ఈ రోజు ఎక్కడో ఉండి పిలుస్తున్నాడు ఏమిటి అనుకున్నాడు. ఎంతకూ నరుడు రాకపోతే ఆకలి బాధకు తట్టుకోలేక బండిని వెతుక్కుంటూ వెళ్ళాడు. బండి మీద కూర్చుని ఆహారాన్ని తింటున్న భీముడిని చూసాడు.

తన కోసం తెచ్చిన ఆహారాన్ని నరుడు తినడం చూసి సహించలేకపోయాడు.భీముడిని పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు.భీముడికి చీమ కుట్టినట్లైనా లేదు.బకుడు పక్కనే ఉన్న ఒక చెట్టును పెరికి భీముని మీద వేసాడు. భీముడికి కోపం వచ్చింది. బకాసురుడి మీద కలియ పడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. భీముడు బకాసురుడితో మల్ల యుద్ధం చేసి, చంపేసాడు.

బకాసురుడు పెట్టిన కేకలకు అతని బంధువులు అందరూ అక్కడకు వచ్చారు. “చూడండి, ఈ బకాసురుడు చచ్చాడు.మీరు కూడా ఏకచక్రపుర వాసులకు ఏమన్నా ఆపద తలపెడితే వీదిలాగే చస్తారు” అని చెప్పాడు. చేసేది లేక భీమునికి భయపడి వారందరూ దానికి ఒప్పుకున్నారు. భీముడు బకాసురుని కళేభరాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్రపురం పొలిమేరలలో పడవేసాడు. అది చూసిన ఏకచక్రపుర వాసులందరూ సంతోషించారు. భీముని పరాక్రమాన్ని ఎంతగానో కొనియాడారు.

ఇంటికి వెళ్లి తల్లి కుంతికి, అన్నయ్య ధర్మజునికి, తమ్ములకు జరిగిందంతా చెప్పాడు. ఆ ఉరి వారందరూ “ వీడు సామాన్య బ్రాహ్మణుడు కాదు. మంత్రం సిద్ధి కలవాడు” అంటూ భీముని చూడడానికి అతను ఉన్న ఇంటికి వచ్చారు.

కామెంట్‌లు లేవు: