3, అక్టోబర్ 2020, శనివారం

**సంపూర్ణ తిరుమల చరిత్ర** - 7

 **దశిక రాము**




శ్రీమహావిష్ణువు 12 అంశలతో ఈ జగత్తు పరిపాలించబడుతుంది అని వైష్ణవ భక్తుల విశ్వాసం. అందుకే మహా విష్ణువు యొక్క 12 అంశలూ 12 మంది ఆళ్వారులుగా జన్మించి ఈ లోకాన్ని కాపాడుతుంటారని అభిప్రాయం. భక్తసులభుడైన శ్రీహరి తన ఆయుధాలను ఈ జగత్తును రక్షించేందుకు ఆళ్వారుల రూపంలో అవతరింపచేశాడని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది.


మధురకవి ఆళ్వారులు


వీరు గరుడుని అవతారంగా వైష్ణవులు కొలుస్తారు. ఆళ్వారుల్లో చివరివారు, తమ అమృత గానంతో శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేసినవారు. ఈ మధురకవి ఆళ్వారులు బ్రాహ్మణ వంశంలో జన్మించారు. వీరు నమ్మాళ్వారుల సమకాలికులు. నమ్మాళ్వారులకంటే పెద్దవారు. వీరు సంస్కృత, తమిళ భాషల్లో గొప్ప పండితులు. వీరి అసలు పేరు భట్టనాథులు. కానీ వీరు తమ మృదుమధుర గానంతో శ్రీమహావిష్ణువు గానం చేసి శ్రోతలను ఆనందింప చేశారు కనుక వీరిని మధురకవి యాళ్వారులు అని పిలిచేవారు. ఆ పేరే సార్ధక నామధేయం అయింది. వీరు తమ భక్తి తత్వాన్వేషణలో అనేక పుణ్యక్షేత్ర దర్శనార్థం దక్షిణాపథం నుండి తూర్పుదిశగా తీర్థయాత్రలకు బయల్దేరారు. అనేక ప్రాంతాలు, క్షేత్రాలు దర్శించిన ఈ మధురకవి ఆళ్వారు ప్రయాగ క్షేత్రం చేరుకున్నారు. అక్కడ ప్రయాగలో తమ భక్తిగానంతో భక్తులను పరవశం చేస్తుండగా అక్కడికి చేరిన కొంతమంది ఈ ఆళ్వారుల పుట్టుపూర్వోత్తరాల గురించి అడిగారు. వారికి తాను దక్షిణాపథంనుండి ఉత్తర ప్రాంతంలోని పుణ్య క్షేత్రాలు దర్శించి వచ్చానని, ఇక్కడ ఈ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక భక్తి తత్వాన్ని గురించి తనకు తెలీని విషయాలు తెలుసుకోవాలని ఉందని ఇక్కడి మహానుభావులను దర్శించ వచ్చానని తెలియజేశాడు.


ఇంతలో అక్కడ చేరిన వారిలో కొందరు ఆశ్చర్యంతో ''స్వామీ! దక్షిణాపథంలో లేని పుణ్యక్షేత్రాలు, తత్వవేత్తలు, పండితులు, జ్ఞానులు ఇక్కడ ఉన్నారా?” అని అడిగారు. ''తమరు నమ్మాళ్వారులు నివసించే ప్రాంతం నుండే కదా వచ్చారు. అక్కడ ఆళ్వారు తిరునగరిని దర్శించలేదా? వారి గురించి తమకు తెలీదా?” అని అడిగారు. తిరునగరిలో జన్మించి పదహారు సంవత్సరాలు తింత్రిణీ వృక్షం కింద తపస్సు చేసిన నమ్మాళ్వారుల గురించి వారి భక్తి తత్వాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేశారు. వారి ఈ సమాచారంతో మధురకవి ఆళ్వారులకు నమ్మాళ్వారులను చూడాలని, కలుసుకోవాలని ఉత్సాహపడ్డాడు.


నమ్మాళ్వారుల భక్తి తత్వాన్ని, మహిమలను విన్న మధురకవి ఆళ్వారుల దృష్టి అంతా నమ్మాళ్వారుల మీదికి మళ్ళింది. కానీ తాను ఉత్తరదేశ యాత్రను మధ్యలో ముగించడానికి మనస్కరించలేదు. అలాగని నమ్మాళ్వారుల గురించిన ధ్యాస వదల్లేదు. ఉత్తరదేశ పుణ్యక్షేత్ర యాత్రలు యాంత్రికంగా చేస్తూనే ఉన్నా మనసులో నమ్మాళ్వారుల రూపాన్ని చిత్రించుకుని ఎప్పుడూ ఆ ధ్యాసలోనే ఉండసాగాడు. ఎప్పుడెప్పుడు ఈ ఉత్తరదేశ తీర్థయాత్రలు ముగించుకుని తిరునగరి చేరి నమ్మాళ్వారులను కలుసుకుంటానా అనే ధ్యాస ఎక్కువైంది. నమ్మాళ్వారులను దక్షిణదేశంలో వెలసిన ఒక ఆధ్యాత్మిక తేజస్సుగా ఊహించుకుని వారి రూపాన్ని మనసులో చిత్రించుకుని పదేపదే వారి ధ్యాసలోనే కాలం గడపసాగాడు.


కానీ ఒకనాడు విచిత్రం జరిగింది. నమ్మాళ్వారులు కూడా తన శిష్య బృందంతో ఉత్తరదేశ యాత్ర చేస్తూ అక్కడి ఆలయాలను దర్శించసాగాడు. మధురకవి కూడా అదే ఆలయాన్ని చూడవచ్చాడు. ఊహారూపంలో దక్షిణ ప్రాంతంలో నుండి వెలుగొందే దివ్య నక్షత్రంగా ఊహించుకున్న నమ్మాళ్వారుల దివ్యమంగళరూపాన్ని అక్కడ మధురకవి దర్శించడం జరిగింది. నమ్మాళ్వారుల దివ్యతేజోరోపాన్ని వారు ధరించిన వకుళమాలను చూసిన మధురకవి వారిని నమ్మాళ్వారులుగా గుర్తించి పాదాభివందనం చేశాడు. క్షణమాత్రం జరిగిన ఈ సన్నివేశంలో నమ్మాళ్వారుల అంతరంగాన్ని గ్రహించిన మధురకవి ఆ మధురానుభూతిని మదినిండా నింపుకుని ఉత్తరదేశయాత్రను ముగించుకుని తిరిగి నమ్మాళ్వారులను కలుసుకునేందుకు ఆళ్వారు తిరునగరి చేరుకున్నారు.


ఈవిధంగా మధురకవి ఆళ్వారులు తమ యాత్రలో నిరంతరం నమ్మాళ్వారుల ధ్యాసతోనే ముగించుకుని తన తిరుగు ప్రయాణంలో వకుళ భూషణుడైన నమ్మాళ్వారుల నివాసమైన యాదినాథస్వామి ఆలయానికి విచ్చేసి అక్కడ ద్వాదశోర్ధ్వపుండ్రములతో కనులపండుగ్గా ప్రకాశిస్తోన్న శఠగోప యోగీంద్రుని చూసి సాష్టాంగ దండప్రణామం చేసి ఆనందంతో కరతాళధ్వనులు చేయసాగాడు. అప్పుడు ఆ శఠగోప యోగి కళ్ళు తెరిచి చూసి మళ్ళీ మూసుకున్నాడు. అంత మధురకవి ఆయనను ''ప్రకృతి కడుపున పుట్టిన జీవుడు ఏమి తిని, ఎలా బ్రతుకుతాడు?” అని ప్రశ్నించాడు. డానికి నమ్మాళ్వారు ''అదే తిని, అలాగే బ్రతుకుతాడు'' అని సమాధానం చెప్పాడు. అందుకు మధురకవి తన సమస్యకు భావపూర్ణమైన జవాబు ఇచ్చినవాడు సామాన్య మానవుడు కాడని, గొప్ప తత్వవేత్త అని తలచి ఆ యోగిపుంగవుని అత్యంత భక్తిశ్రద్ధలతో శరణు కోరి, తనను శిష్యునిగా చేర్చుకోమని, కటాక్షించమని వేడుకున్నాడు.


అప్పుడు నమ్మాళ్వారులు, మధురకవిని ఆశీర్వదించి తన శిష్యునిగా చేసుకుని ముక్తినొసగే సులభోపాయాలను ఉపదేశించాడు. మధురకవి క్రమక్రమంగా పరాభక్తి, పరజ్ఞానం అలవరచుకున్నాడు. ఆయన తన శ్రావ్యమైన స్వరంతో మధురగానం చేస్తూ నమ్మాళ్వారుల భగవత్తత్వాన్ని ప్రబంధరూపంలో రచించి ప్రచారం చేశాడు. ఇలా మధురకవి నమ్మాళ్వారుల సేవలో చాలాకాలం గడిపాడు. అందుకే గురుశిష్యుల అవినాభావ సంబంధంగా నమ్మాళ్వారులని, మధురకవిని పోలుస్తుంటారు పండితులు.


34 సంవత్సరాలు జీవించిన నమ్మాళ్వారులవారు తన అనంత భక్తి వాంగ్మయాన్ని శిష్యుడు మధురకవికి పంచి అశేష భక్తజన వాహిని ముందు శ్రీవారి సాయుజ్యాన్ని చేరుకున్నారు. తర్వాత వారి జ్ఞాపకార్ధం మధురకవి అదే ఆలయ ప్రాంగణంలో నమ్మాళ్వారుల ఆలయాన్ని, ప్రహరీ గోడను నిర్మించి, ఆలయ నిర్వహణ యావత్తు తానే నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో కొలవసాగాడు. వారు గానంచేసిన వేదాలను ప్రబంధాలుగా రచించి వాటిని ఎంతో ప్రాచుర్యంలోకి తెచ్చి తన మధుర స్వరంతో గానం చేయసాగాడు.


ఈవిధంగా మధురకవి తన జీవితం అంతా తింత్రిణీ వృక్షం వద్దనే గడుపుతూ భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తూ నమ్మాళ్వారులు ఎంచుకున్న మార్గాన్నే అనుసరించాడు. నమ్మాళ్వారుల ద్రవిడ వేదసారాన్ని ప్రబంధ రూపంలో గానం చేస్తూ యావద్దేశంలో భక్తి సాహిత్యాన్ని ప్రచారం చేశారు. వీరు నమ్మాళ్వారుల మీద అనేక పాశురాలు, పాటలు రచించి శ్రావ్యగానం చేసి ఆనందించేవారు. ఆ పాటలు అక్కడి ప్రజలను, భక్తులను ఆనంద పరవశులను చేసేవి.


వీరి ఆలయాన్ని తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలలో చూడవచ్చు.


వైష్ణవ భక్తి తత్వాన్ని అనంత భక్తి పారవశ్యంతో రచించి, గానంచేసి ఈ భారతావనిని తరింపజేసిన ఆళ్వారుల భక్తి సారాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకోవడం సామాన్యులకు అంత తేలిక కాదు. వారి అనంత భక్తి తత్వాన్ని అర్ధం చేసుకోవడం అంటే ఆ అనంత పద్మనాభుని అర్ధం చేసుకోవడమే. వారి భక్తి పారవశ్యం హైందవ భక్తి ప్రపంచానికే ఆదర్శం. ఆ పన్నిద్దరు ఆళ్వారుల గురించి సూక్ష్మంగా తెలియజేసే ప్రయత్నంలో వీరి సమగ్ర లీలా విశేషాలను పొందుపరచలేకపోతున్నాం. కానీ వైష్ణవ భక్తి ప్రపంచంలో అగ్రగాములైన వ్వ్ ఆళ్వారుల గురించి వారి చరిత్ర గురించి కనీస అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో వారి ప్రస్తావన చేయాలని భావించడం జరిగింది. అందుకే వచ్చే వారం నుండి ఆళ్వారుల్లో చివరివారైన నమ్మాళ్వారుల చరిత్ర, మధురకవి ఆళ్వారుల చరిత్ర ఇందులోని 6, 7 భాగాల్లో ప్రస్తావించినందువల్ల మళ్ళీ వివరించకుండా మిగిలిన ఆళ్వారుల చరిత్ర అందించ సంకల్పించాం. కనుక వచ్చే వారం నుండి మిగిలిన ఆళ్వారుల చరిత్రను అందించే మహదవకాశం కలిగించిన వేంకట ప్రభువుకు సదా కృతజ్ఞతలు.


వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి 


దయచేసి షేర్ చేయండి 


స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన నామం " గోవిందా " ... ఎవరు తనని గోవిందా అని పిలుస్తారా అని ఎదురు చూస్తుంటారట స్వామి వారు ... 


కనుక మనం ఆలస్యం చేయక 


అందరం " గోవిందా గోవిందా " అని పలికి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ...


గోవిందా గోవిందా 

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


🔱 **అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ.** 🔱


   🌹 **లోకాస్సమస్తా స్సుఖినోభవంతు** 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


**ధర్మము-సంస్కృతి**

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను** 

**పాటిద్దాం**

**మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: