3, అక్టోబర్ 2020, శనివారం

రామాయణమ్. 81

 

..

రాత్రి గడిచింది .అందరికన్న ముందుగా రాముడు నిద్దుర లేచాడు.ప్రక్కకు తిరిగి చూస్తే తమ్ముడు ఇంకా నిద్దురపోతూనే కనిపించాడు.

సోదరుడిని మెల్లగా తట్టి నిద్రలేపాడు .లక్ష్మణా ! వనంలో సంచరించే ప్రాణుల ధ్వనులు ఎంత మధురంగా ఉన్నాయో విను.ఇది మరల మనము బయలుదేరే సమయం త్వరగా ప్రయాణం సాగించాలి.

.

అన్నగారిచేత మేలుకొలుపబడ్డవాడయిన లక్ష్మణుడు నిద్రను,బద్ధకాన్ని వదిలించుకొని లేచి యమునలో స్నానంచేసి ప్రయాణ సన్నద్ధుడైనాడు.

.

భరద్వాజ మహర్షి చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ చిత్రకూటం వైపు సాగిపోయారు.

.

రామచంద్రుడు మార్గంలో సీతమ్మకు వనశోభను చూపిస్తూ.... సీతా !చూశావా ఈ కింశుకవృక్షాలు! వాటిపూలను అవే మాలలు గ్రుచ్చి వేసుకొన్నట్లుగా ఉంది.ఎర్రటిపూలతో మంటపెట్టినట్లుగా ఉంది.

.

శిశిరం వెళ్లిపోయింది. అందుకే అడవంతా విరగబూసింది .సీతా ఇటు చూడు ఈ భల్లాత(జీడి) వృక్షము పూలు పండ్లతో భారం మోయలేక వంగిపోయి ఉంది.ఇవి అందించే మధురఫలాలను తినడానికి నరులెవ్వరూ ఇచటలేరు కదా! 

.

లక్ష్మణా ! అదుగో చూశావా ప్రతిచెట్టుమీదా తేనెపట్టు ఉంది.ప్రతి తేనేపట్టు ఎంతో పెద్దగా ఉండి నేలను తాకుతున్నట్లుగా ఉన్నాయి.

.

ఎక్కడ చూసినా పూలే ! నేల అంతా పరుచుకొని రహదారిని కప్పివేసి సున్నితమైన సీతమ్మపాదాలకు రక్షణగా ఉన్నాయవి..

.

వానకోయిలకూస్తుంటే దానికి సమాధానంగా నెమలి క్రేంకారం మనోహరంగా శ్రవణానందకరంగా ఉన్నది.వనమంతా పక్షుల కూజితాలతో సందడిసందడిగా ఆహ్లదకరంగా ఉంది.

.

ఎదురుగా ఎత్తైన శిఖరాలతో చిత్రకూటం కనపడుతున్నది .దానిమీద గుంపులుగుంపులుగా ఏనుగులు సంచరిస్తున్నాయి.

.

లక్ష్మణా మనోహరమైన ఈ గిరిశిఖరాలమీద ఉండాలనే ఉత్సాహం ఊరిస్తున్నదయ్యా! అందాలుచిందించే ఈ చోటు చోడు కంటికి బహుపసందయిన విందుగావిస్తున్నది.

ఈ తరులు,ఈ గిరులు ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రదేశం .

ఇక్కడే మనం నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించవచ్చు.

.

ఆ ప్రదేశంలో ఎందరో మునులు స్థిరనివాసం ఏర్పరచుకొని తాపసవృత్తిలో జీవిస్తున్నారు.వారందరినీ చూశారు వారు.

.

ముందుగా వాల్మీకి మహర్షి ఆశ్రమం చేరుకొని ఆ మహానుభావుడికి నమస్కరించి వినయంగా నిలుచున్నారు మువ్వురు.వారి ఆగమనానికి మహర్షి ఆనందించి వారిని తగురీతిగా సత్కరించి కూర్చోమని ఉచితాసనాలిచ్చినాడు.

.

రాముడు తమను తాము మహర్షికి పరిచయం చేసుకొని తమ రాకకు గల కారణాన్ని మహర్షికి తెలిపి,లక్ష్మణుని వైపు తిరిగి లక్ష్మణా మనం ఇక్కడ నివసించటానికి యోగ్యమైన ఒక గృహాన్ని నిర్మించవలె అందుకు కావలసిన సామాగ్రిని సేకరించమని కోరాడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: