3, అక్టోబర్ 2020, శనివారం

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము

 *దశిక రాము**


💮 #-21💮


     💠శ్లోకం 15💠

లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|

చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||


135. లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.

136. సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.

137. ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.

138. కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.

139. చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.

140. చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.

141. చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).

142. చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి

29. వ్యంగ కాడు, వాని యంగాలె వేదాలు,


వేద సారమంత విస్తృతముగ


ఎరుక గలిగి యెరుక బరచు కవి యతడె


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : అవ్యంగః ... అ + వి + అంగ ... వి అంగ కానివాడు అనగా ఏవిధమైన లోపాలు లేనివాడు, వేదాంగః ... వేదాలే అంగాలైనవాడు, వేదవిత్ .... వేదాల లోతుపాతులను క్షుణ్ణంగా తెలిసిన వాడు, కవి ... సర్వ ద్రష్ట.


భావము : ఏ విధమైన లోపాలు లేని మనోహరమైన రూపం గలవాడు, వేదాలే తన అంగాలు కాగా, వాటి లోతుపాతులు క్షుణ్ణంగా ఎరిగినవాడు, సర్వమూ తెలిసిన మునీశ్వరుడు(" నాన్ ఋషి కురుతే కావ్యం " ... అనే పెద్దల వాక్కును బట్టి కావ్యం వ్రాయగలవాడు అనగా కవి ఐనవాడు ఋషి తుల్యుడే ఇక్కడ ఆంగ్ల పాఠంలో కూడా కవిః అంటే మునీశ్వర అనే అర్థం కనబడుతూండటం గమనార్హం కదా!) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు. }



శ్లో. లోకాధ్యక్ష, సురాధ్యక్షో, ధర్మాధ్యక్ష, కృతా కృతః


చతురాత్మా, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్రా, చతుర్భుజః !!15!!


(నామాలు 133...140)


30. అధిపతె జగమునకు, అరసు నాకమునకు,


అరయ గల్పములకు నతడె బతియు,


కార్య కారణములు కనగ యాతనిలోనె


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : లోకాధ్యక్ష ... లోకాలకు అధిపతి, సురాధ్యక్ష ... స్వర్గాధిపతి, ధర్మాధ్యక్ష ... ధర్మాలకు అదినాథుడు, కృతా కృతః ... కార్య కారణ రూపుడు, వ్యక్తా వ్యక్త స్వరూపుడు.


భావము : లోకాలకు అధిపతి, స్వర్గానికి (నాకమునకు) అధినాథుడు(అరసు అంటే రాజు, ప్రభువు అనే అర్థాలూ ఉన్నాయి కదా), ధర్మాలకు( కల్పము అంటే న్యాయము, ధర్మము అనే అర్థాలూ ఉన్నాయి కదా) అధిపతి (పతి అంటే కూడా ప్రభువు అనే అర్థం ఉందికదా), వ్యక్తా వ్యక్త స్వరూపుడు(కృతము అంటే చేసినది, అకృతము అంటే చేయనిది...చేసేదీ చేయించేదీ వాడే . కనుక చేయించేటపుడు తాను అకృత రూపుడే కదా) అయిన ఆ శ్రీహరికి శత సహస్ర వందనాలు.}


31. చనుగ జూడ చతురాత్మయై తానె


నాల్గు వ్యూహములతొ నయముగాను


నాల్గు కోరలుండు, నాలుగే భుజములు


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : .చతురాత్మా ... విభూతి చతుష్టయం, చతుర్ వ్యూహ ... నాలుగు వ్యూహాలు, చతుర్ దంష్ట్ర ... నాలుగు కోరలు, చతుర్భుజః ... నాలుగు భుజాలు.


భావము : పరమాత్ముడైన శ్రీహరి రజోగుణ స్వరూపమై సృష్టి కార్యక్రమంలో పరబ్రహ్మ, ప్రజాపతులు (కశ్యపాదులు), కాలము, సృష్టి, స్థితిలో విష్ణువు, మనువులు, కాలము, పాలన, తమోగుణ ప్రధానమైన లయములో రుద్రుడు, అగ్ని, కాలము, లయము...( దీనినే విభూతి చతుష్టయం అంటున్నారు)లై ప్రసిద్ధికెక్కుతున్నాడు(చను అంటే ప్రసిద్ధికెక్కు అనే అర్థమూ ఉంది కదా). ఇక నాలుగు వ్యూహాలంటే వాసుదేవ. సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనే వ్యూహాలు... (బహుశా ఆ అవతారాలే వ్యూహాత్మకం కావచ్చునేమో), నాలుగు కోరలంటే ... ధర్మార్థ కామ మోక్షములు, నాలుగు వేదాలు, చతురాత్మలూ, వ్యూహాలు... (వీటితోనే సందర్ఙానుసారం రక్కసి గుణాలను అణచివేస్తుంటాడా శ్రీహరి,) నాలుగు భుజాలు ... శంఖు, చక్ర, గదా, ధనువులు వీటిని ధరించడానికీ, జగత్తులోని తన భక్తులను భవసాగరం నుంచి దాటించడానికి తగినంతగా విశాలమూ, దృఢతరమూ అయిన భుజాలు... ఇన్ని విశిష్టతలున్న ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}



ఓం నమో నారాయణాయ

🕉️🙏🕉️🙏🕉️🙏

🙏🙏🙏


**ధర్మము - సంస్కృతి**

కామెంట్‌లు లేవు: