3, అక్టోబర్ 2020, శనివారం

ఆత్మ జ్ఞానం కలిగించే వాడు గురువు.

 సేకరణ 👇

ఔదుంబర వృక్షానికి దత్తాత్రేయ స్వామికి అవినాభావ సంబంధం కదా. ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం దత్తాత్రేయుల వారి కృపచే గురు బలం కలుగుతుంది. మరి గురు గ్రహానికి చెందిన వృక్షం రావి చెట్టు. మేడి( ఔదుంబర) శుక్ర గ్రహానికి చెందిన వృక్షం కదా? ఈ సందిగ్ధం తీర్చండి దయచేసి.

చక్కని ప్రశ్న అండి. 

దత్తాత్రేయుల వారు సర్వదేవతా స్వరూపులు, ఆది,అంతము లేని శక్తి స్వామి వారిది. 

ఏదో ఒక గ్రహంకి సంబంధించిన శక్తిగా వారి శక్తిని పరిమితం చేయలేము.

గురుగ్రహం అనుగ్రహం మానవులకు కలగాలి అంటే, మనకు ఆత్మానుభూతి అందించే ఏ వ్యక్తిని మనం గురువుగా భావించినా, పూజించినా కూడా, 

సేవించిన శిష్యుడు యొక్క భావం, ఆ దత్తప్రభువుకు వినతి గా చేరుతుంది. 

ఈ విధంగా స్వామివారు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతంలో తెలియజేశారు.

గురుడు దేవతల గురువు, ఆత్మ జ్ఞానానికి సంకేతం.

శుక్రుడు దానవుల గురువు. ప్రకృతి లో ఉండే ఇహిక సుఖాలను ఇచ్చే గ్రహం, శారీరక సౌఖ్యం లాంటివి.

మనం గ్రహాల విషయంకి వస్తె రెండు గ్రహాలు గురుస్థానంలో ఉన్నవే. 

కాక పోతే రెండు వర్గాల మధ్య దేవతా లక్షణాలు, రాక్షస లక్షణాలు ఉండే, మానసిక స్థితులలో తేడా అంతే.

ఎన్నోసార్లు స్వామివారి చరిత్రలో, 

"కలియుగంలో మానవులు యొక్క మానసికస్థితి అన్నిటినీ కావాలి అని, కబళించాలనే భావం తో ఉంటారు" అని చెప్పబడి ఉన్నది.

అంటే కలియుగంలో మానవులు దగ్గర దగ్గరగా రాక్షస ప్రవృత్తిని కలిగిఉంటారు. అంటే వివేకం ను కోల్పోయి ఉంటారు అని. (మీరు ఈ విషయం, నా నేటిమాటలో అంతకు ముందు ప్రస్తావించాను, చూడవచ్చు)

రాక్షసులకు గురువు శుక్రుడు , శుక్రగ్రహం యొక్క మొక్క మేడివృక్షం. మేడిచెట్టు మూలములో శ్రీ దత్తప్రభువు స్థిరనివాసం. ద్వంద్వ వైఖరి. 

అంటే ప్రకృతి పరంగా సుఖానికి, ఆధ్యాత్మిక పరంగా ఆత్మ జ్ఞానానికి.

సకల జీవుల యొక్క, దేవతా ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి కూడా, శ్రీ దత్తులవారి  సంకల్పంలోనే ఉంటుంది. ఇక్కడా కూడా ద్వంద్వ వైఖరి.

స్వామి వారు చెప్తారు, ద్వంద్వం లేక పోతే సృష్టి, స్థితి,లయ ఉండదు. మనం ఈ ప్రకృతి లో, ప్రతీ దానిలో ద్వంద్వ వైఖరి గమనించ వచ్చు.

మనం విశ్వవ్యాప్తంగా చూస్తే, మనం చూసే ఇటువంటి నక్షత్ర మండలాలు ఎన్నో ఉన్నాయి. 

మనకు తెలిసినది, ప్రస్తుతం మనం చూడ గలుగుతున్న ఈ గ్రహస్థితి ఈ ఖగోళవ్యవస్థకి సంబంధించినది మాత్రమే.

దత్తప్రభువును, దిగంబరా దిగంబరా అని స్మరిస్తాము. 

అంటే దిక్కులను అంబరంగా గల ప్రభువు అని అర్థం వస్తుంది కదా, 

అంతంలేని దిక్కులు స్వామి వారికి వస్త్రాలు. 

అనంతం అయిన శక్తి స్వామి వారు.

కాబట్టి గురు గ్రహం కు మాత్రమే స్వామి వారిని భావించ కూడదు.

స్వామి సంకల్ప స్వరూపం, అవతారాలు వారి సంకల్పానికి రూపాలు, వీటిలో మళ్లీ ద్వంద్వ  రూపాలు, మూల అవతారాలు, అంశ అవతారాలు.

సర్వదేవతా స్వరూపం అయిన దత్తాత్రేయస్వామి వారు, 

నరసింహ అవతారంలో, హిరణ్యకశిపుని సంహరించిన తరువాత, వారి గోళ్ళకు బాధ కలిగింది. 

వారికి ఉపశమనం కోసం లక్ష్మీఅమ్మవారి స్వరూపం, అక్కడి ఆకులుతో స్వామివారి గొరులను శుభ్రపరుస్తారు. ఉపశమనం కలుగుతుంది, 

అప్పుడు ఆ ఆకులు కలిగిన ఔదుంబర వృక్షంకు స్వామివారు వరంఇస్తారు, 

నీ వలన నాకు ఉపశమనం కలిగినది కావున, నీ మూలంలో నేను స్థిరంగా ఉంటాను అని.

స్వామివారు మూలంలో ఉండటం వలన, ఈ ఔదుంబర వృక్షం ను, కల్పవృక్షం గా ఈ భూలోకం లో మనం కొలుస్తాము. 

ఔదుంబర వృక్షంనకు ప్రదక్షిణలు చేసి ఏ కోరిక అయినా నెరవేరుతుంది.

ఔదుంబర స్తోత్రం కూడా ఉన్నది. 

ప్రదక్షిణ చేస్తూ, ఒక రెండు వాక్యాలు ఈ స్తోత్రం నుండి స్వీకరించినవి పఠిస్తాము. 

ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః ।

చింతామణి ర్గురోహ్ పాదౌ దుర్లభా భువనత్రయే।।

ఔదుంబర వృక్షం, ప్రకృతి పరంగా చక్కని, చూడ ముచ్చట గా ఉండే ఫలాలను అందిస్తుంది. 

కానీ వాటిలో పురుగులు ఉంటాయి. 

అంటే, లౌకికంగా అందం గా కనిపించే ప్రతీది మనసు కోరుకుంటుంది. కానీ పర్యవసానం కుళ్ళి ఉంటుంది అని.

అదే విధంగా, ఈ వృక్షంకు పోషణలో శ్రర్ధ లోపిస్తే, గొంగళిపురుగుల వంటి పురుగులు వచ్చేస్తాయి. అంటే మన మనసుని గమనిస్తూ ఉంటే చక్కని లక్ష్యం గల జీవితం ఉంటుంది అని. మానవుని జీవితానికి లక్ష్యం ఒక్కటే, ఆత్మ జ్ఞానం.

అంటే, ఇక్కడ దత్తాత్రేయస్వామి, ఔదుంబర సేవనం చేసే భక్తులకు ఒక పరీక్ష వంటిది పెట్టారు. 

ఆ సేవ చేసేవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. 

ఔదుంబర సేవ చేసేవారు నిరంతర గమనింపులో ఉండాలి. 

ఏమరపాటు మొక్కని పాడు చేస్తుంది. ఇది భౌతికం గా, 

ఆధ్యాత్మిక పరంగా చూస్తే, మనిషి కి తన వ్యక్తిత్వాన్ని నాశనంచేసే దుష్టశక్తులు నలువైపులా ఉంటాయి. వాటి నుండి ఎల్లవేళలా జాగురూకులు అయిఉండాలి అనేది తెలియజేస్తుంది. 

ఎంత చక్కటి సందేశం చూడండి. 

నిరంతరం అప్రమత్తంగా ఉండండి అని, ఈ సేవ తెలియజేస్తోంది.

ఔదుంబర వృక్షంకు ప్రదక్షిణలు చేసిన ప్రతీవారు ఆ కోరిక తీరింది, ఈ కోరిక తీరింది అని చెపుతూ ఉంటారు. 

కానీ, స్వామి చెప్పేది, 

ధర్మ బద్ధంగా ఉండే ప్రతీ కోరిక, తీరుతుంది అని చెప్తారు.

ఇక్కడ కూడా ధ్వంద్వం ఉంది గమనించండి. 

కోరిక ఏ విధం అయినది అయినా తీరుతుంది అని, ధర్మ బద్ధంగా ఉండేది తప్పక తీరుతుంది అని.

మనుషులు యొక్క మనస్తత్వం, 

ఈ యుగధర్మం ప్రకారం, 

ప్రతీ దానికీ ప్రమాణం, ఋజువు కావాలని అనుకుంటారు.

దాని కోసం, 

ధర్మ ఆక్షేపణ జరుగ కుండా, 

వారి పూర్వజన్మ కర్మఫలంగా కోరిక నెరవేరుస్తారు. తీరుతుంది, సందేహం లేదు.

మన పరిస్థితుల దృష్ట్యా కోరికలు కొరకూడదు. 

మనకి ఏది అవసరమో ఆ స్వామి కి తెలుసు. 

అందుకు మనం స్వామిని మనవారిగా, 

ద్వంద్వ స్థితిని విడిచి, వారితో మమేకం అయిపోవాలి. 

అందుకే ఆత్మ జ్ఞానం కలిగించే వాడు గురువు. 

శక్తి లేనిదే ఆత్మజ్ఞానంకు విలువ ఉండదు. 

అంటే, అన్ని విధాల మనం సౌఖ్యం అనుభవిస్తూ, ఆత్మ జ్ఞానం కోరుకోవాలి, అది నిజమైనది అవుతుంది. 

అంటే, స్మశాన, ప్రసవ, దరిద్ర, లాంటి వైరాగ్య స్థితి కాకుండా అని భావం ఇక్కడ.

అన్ని ప్రకృతి పరమైన కోరికలు తీర్చే గ్రహం శుక్రుడు అయితే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేది గురుగ్రహం. 

రెండింటి సమ్మేళనమే దత్త ప్రభువు ఉన్న ఔదుంబర వృక్షం. 

సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణార వింద మస్తు

కామెంట్‌లు లేవు: