3, అక్టోబర్ 2020, శనివారం

పోత‌న త‌ల‌పులో....71

 


నాయ‌నా, భీమ‌సేనా, నాకు ఎందుకో అన్నీ దుశ్శ‌కునాలే క‌న‌ప‌డుతున్నాయి.

ఎడ‌మ‌క‌న్ను అదురుతోంది. విన‌కూడ‌ని వార్త ఏదో వినాల్సి వ‌స్తుంద‌నిపిస్తున్న‌ది.

నా మ‌న‌సు మ‌న‌సులోలేదు అని చెప్పాడు ధ‌ర్మ‌రాజు.

  మాట‌ల్లోనే అర్జునుడు ద్వార‌క‌నుంచి వ‌స్తూనే అన్నా అంటూ ధ‌ర్మ‌రాజు పాదాల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకుని క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు.

    ***


మాతామహుండైన మనశూరుఁ డున్నాడె?-

  మంగళమే మనమాతులునకు?

మోదమే నలుగురు ముగురు మేనత్తల?-

  కానందమే వారి యాత్మజులకు?

నక్రూర కృతవర్మ లాయు స్సమేతులే?-

  జీవితుఁడే యుగ్రసేనవిభుఁడు?

కల్యాణయుక్తులే గద సారణాదులు-

  మాధవుతమ్ములు మానధనులు?

  ***

నందమే మనసత్యకనందనునకు?

భద్రమే శంబరాసురభంజనునకుఁ?

గుశలమే బాణదనుజేంద్రకూఁతుపతికి?

హర్షమే పార్థ! ముసలికి హలికి బలికి?

    ***

నాయనా అర్జునా, మన మాతామహుడైన శూరసేనుడు కుశలమే కదా, మన మేనమామ వసుదేవుడు సుఖంగా ఉన్నాడు కదా , మన మేనత్తలు ఏడుగురూ సంతోషంగా ఉన్నారు కదా, వారి కొడుకు లందరూ క్షేమమే కదా, అక్రూర కృతవర్మలకు ఆరోగ్యమే కదా, ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా, మానధనులూ వాసుదేవుని సోదరులూ అయిన గదుడు, సారణుడు మొదలైన వారంతా కుశలమేనా ,మన సాత్యకి క్షేమమేనా, ప్రద్యుమ్నుడు బాగా ఉన్నాడా, అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడా, మన పెద్దబావ బలరాముడు సుఖంగా ఉన్నాడా అంటూ ఆతృత‌తో అర్జునుడిని ధ‌ర్మ‌రాజు అడిగాడు.

య‌దువంశ వీరులంద‌రూ క్షేమంగా ఉన్నారా ,అని పేరు పేరునా వారి క్షేమ స‌మాచారాలు అడిగాడు

                     ***

.వైకుంఠవాసుల వడువున నెవ్వని-

     బలమున నానందభరితు లగుచు

వెఱవక యాదవ వీరులు వర్తింతు?-

  రమరులు గొలువుండు నట్టి కొలువు

చవికె నాకర్షించి చరణసేవకులైన-

  బంధుమిత్రాదుల పాదయుగము

నెవ్వడు ద్రొక్కించె నింద్రపీఠముమీఁద?-

  వజ్రంబు జళిపించి వ్రాలువాని


           ***

ప్రాణవల్లభ కెంగేలఁ బాదు సేసి

యమృతజలములఁ బోషింప నలరు పారి

జాత మెవ్వఁడు గొనివచ్చి సత్యభామ

కిచ్చె? నట్టి మహాత్మున కిపుడు శుభమె?

              ***

అర్జునా! ఏ మహానుభావుని అండదండలవల్ల వైకుంఠంలో నివసించే వారిలాగా, ద్వారకలో నివసించే యాదవవీరులు ఆనందసహితులై భయరహితులై ఉంటున్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మామంటపంలో తన భక్తులనూ బంధువులనూ మిత్రులనూ కూర్చుండ పెట్టాడో, ఏ మహానుభావుడు, వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తీర్చే ఇంద్రుని ప్రాణేశ్వరి అయిన శచిదేవి తన చేతులతో పాదుచేసి అమృతం పోసి పెంచిన పారిజాత వృక్షాన్ని, దివినుంచి భువికి తీసుకొని వచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహూకరించాడో- ఆమహానుభావుడు , వాసుదేవుడు క్షేమమేనా? అని కృష్ణ ప‌ర‌మాత్మ గురించి అడిగాడు

🏵️ పోత‌న ప‌ద్యం🏵️

🏵️బంధుప్రేమ‌కు నిలువుటద్దం🏵️

కామెంట్‌లు లేవు: