మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
ప్రతిభ..పరీక్ష..
"శ్రీ దత్తాత్రేయ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మానండీ..శ్రీ స్వామివారి కృప వల్ల నాకు ఈరోజే మేలు జరిగింది..మీరు రోజూ భక్తులు పొందిన అనుభవాలను పోస్ట్ చేస్తున్నారు కదా..నేను చదువుతూ ఉన్నానండీ..నాకూ కొన్ని అనుభవాలు కలిగాయి..నిజంగా మొగలిచెర్ల అవధూత దత్తాత్రేయుడే నాకు మేలు చేశాడండీ..మీతో చెప్పుకోవాలని అనిపించి మీకు ఫోన్ చేస్తున్నాను..ఈ అనుభవాన్ని కూడా మీరు తప్పకుండా వ్రాయండి.."
వరంగల్ లో లాయర్ గా పనిచేస్తున్న శ్రీమతి ప్రతిభ గారు నాకు ఫోన్ చేసి ఎంతో ఉద్వేగంతో చెప్పిన మాటలివి..ప్రతిభ గారు ఫోన్ చేసే క్షణం దాకా వారెవరో నాకు తెలీదు..నిజానికి ఈరోజు దాకా వారిని నేను కలుసుకోలేదు..ఆవిడ గారు తనను మొగలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారే దగ్గరుండి అన్నివిధాలా ఆదుకున్నారని త్రికరణ శుద్ధిగా నమ్మారు..
శ్రీమతి ప్రతిభ గారు వరంగల్ లో వుంటారు..ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు..వృత్తి పరమైన పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిసి..తాను కూడా ఆ పరీక్ష వ్రాయాలని సంకల్పించారు..దరఖాస్తు చేసుకున్నారు..కానీ ఆ పరీక్షకు ముందురోజు దాకా హాల్ టికెట్ రాలేదు..ప్రతిభ గారు పూర్తిగా ఆందోళన చెందారు..రాత్రి తొమ్మిది గంటల దాకా ఎదురు చూశారు..హాల్ టికెట్ రాలేదు..ప్రక్కరోజు ఉదయం పది గంటలకు హైదరాబాద్ లో పరీక్ష వ్రాయాలి..ఆవిడకు దిక్కు తోచలేదు..
"స్వామీ దత్తాత్రేయా..నువ్వే దిక్కు..నేను పరీక్ష వ్రాయడానికి మార్గం చూపించు తండ్రీ!.." అని మనసులో పదే పదే ప్రార్ధన చేసుకోవడం మొదలుపెట్టారు..
తెల్లవారింది..ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రతిభ గారు పరీక్ష గురించి ఆశ వదులుకున్నారు..కానీ చిత్రంగా ఆ సమయం లో హాల్ టికెట్ ఇంటర్నెట్ ద్వారా వచ్చింది..తన కళ్ళను తానే నమ్మలేక పోయారు..కానీ మరో సమస్య ఉన్నది.. ఇప్పటికిప్పుడు బైలుదేరినా.. పరీక్ష కు సమయానికి అందుకోవడం చాలా కష్టం..వరంగల్ నుంచి హైదరాబాద్ మూడు గంటల ప్రయాణం ఉన్నది..అయినా ప్రతిభ గారు..భారం అంతా శ్రీ స్వామివారి మీద వేసి..తాను తయారయ్యి..కారు మాట్లాడుకుని..ఉదయం ఎనిమిది గంటలప్పుడు హైదరాబాద్ బయలుదేరారు..ఆ మూడుగంటల ప్రయాణం లో ఆవిడ శ్రీ స్వామివారినే ధ్యానం చేస్తూ వున్నారు..పరీక్ష వ్రాసే చోటుకు చేరేసరికి..సుమారు పదకొండు గంటల సమయం అయింది..నిజానికి అంత ఆలస్యం అయితే..అధికారులు పరీక్ష వ్రాయడానికి ఒప్పుకోరు..ప్రతిభ గారు అధికారులను కలిసి..తాను వరంగల్ నుంచి వస్తున్నాననీ..హాల్ టికెట్ ఆలస్యంగా రావడం వలన..ఈ జాప్యం జరిగిందని తెలిపారు..అధికారులు ప్రతిభ గారిని పరీక్షకు అనుమతించారు..పరీక్ష వ్రాసి బైటకు వచ్చిన ప్రతిభ గారికి..శ్రీ స్వామివారు చూపిన దయ వల్లే..తనకు ఈరోజు ఇలా అన్నీ కలిసొచ్చాయని నమ్మి..శ్రీ స్వామివారికి మనసులోనే నమస్కారాలు చేసుకున్నారు..
పై విషయాన్ని స్వయంగా ప్రతిభ గారు ఫోన్ చేసి తెలుపుతూ..తనకు శ్రీ స్వామివారి విభూతి పంపమని కోరారు..పంపించాము..మళ్లీ ఒక పది రోజులకు ఫోన్ చేశారు..ఎన్నాళ్ల నుంచో తాము ఇంటి ఋణం గురించి ప్రయత్నాలు చేస్తున్నామనీ..bank అధికారులు మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నారని..శ్రీ స్వామివారిని శరణు వేడు కున్నాననీ..రెండురోజుల్లో ఆ ఋణం మంజూరు చేసినట్లు తెలిపారనీ..చెప్పారు..మొదటిరోజు ఎంత ఉద్వేగంతో మాట్లాడారో..అదే ఉద్వేగం..అదే సంతోషం..ఆవిడ మాటల్లో మళ్లీ వినిపించాయి..
ప్రతిభ గారు ఇంతవరకూ మొగలిచెర్ల రాలేదు..శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించనూ లేదు.. కేవలం శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మారు....ప్రస్తుతం ప్రతిభ గారికి మొగలిచెర్ల లో సిద్ధిపొందిన దత్తాత్రేయుడే సర్వస్వం..నమ్మకం తో కూడిన భక్తి ఎక్కడ ఉంటుందో..అక్కడ దైవం తప్పక ఉంటాడు..అది మరొక్కసారి ఋజువయింది..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి