24, జనవరి 2025, శుక్రవారం

పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


కూతురిని రైలెక్కించి... స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైలులోని మనవలు కనుమరుగయ్యే దాకా  చేయి ఊపి, అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై... నీరసంగా ఇంటికి వచ్చి, గత నాలుగు రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది... అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్దాయన.

          పిట్టలు రెక్కలొచ్చి ఎగిరి పోవడం సహజమే... దానికి ప్రకృతిలోని ఏ ప్రాణీ, ఇంతగా బాధపడటంలేదు కదా... మరి కాస్తోకూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము... అని ఆలోచనల్లోకి జారిపోయాడు ఆ పెద్దమనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది.

          కూతురి నెంబర్ చూసి చటుక్కున ఫోన్ ఎత్తిన అతనికి... అలవాటుగా అటునుంచి, కూతురు..."నాన్నా! ఇంటికి వెళ్ళిపోయారా? ఈ నాలుగు రోజులు తెగ తిరిగేసారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి. అవీ,ఇవీ అన్నీ సర్దేసి అలసిపోకండి. పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి, మేం వెళ్ళిన తరువాత ఇల్లంతా శుభ్రం చేసి, సర్దిపెట్టమని పురమాయించాను... ఈలోగా మీరు కిందామీదా పడిపోకండి, సరేనా... వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు"....అలా ఇంకా ఏదేదో చెబుతుండగానే... "అలాగేనమ్మా , నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త...ఇక ఉంటాను", అని ఫోన్ పెట్టేయబోతుంటే... "నాన్నా!  ఉండండి...మీ మనవరాలు మీకు వాట్సాప్ లో ఏదో సందేశం పంపించిందంట", అని  ముగించింది.  పదిహేడు సంవత్సరాల మనవరాలు  తనకు ఏ సందేశం పంపించి ఉంటుందా అని ఆత్రుతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా.

             "తాతయ్యా! మీతో ఉన్న ఈ నాలుగురోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరెంత సంతోషించారో.‌..అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాము. పండుగ రేపు మొదలవుతుంది అనగా మనింట్లో మీరు వండించిన పిండివంటల వాసనలు ఇంకా నా ముక్కుపుటాల పై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్ కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో! ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లంపాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. 

          భోగి పండుగ రోజు... తెల్లవారుఝామున నిద్రలేచి, తలస్నానం చేసి, ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరకు వెళ్లి...  మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి, అందులో పిడకల దండ వేసి, ఆ చలిలో  వెచ్చగా రెండు చేతులూ చాపి... చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే  నడుచుకుంటూ గుడికి వెళ్తుంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ..." మీ మనవలా అండి", అని పలకరిస్తుంటే... మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా ... "అవునండీ, పండక్కి వచ్చారు"... అని బదులిస్తుంటే, నాకు ఏనుగు అంబారీ ఎక్కినంత సంబరంగా అనిపించింది... ఎందుకంటే, మా నగరాల్లో మేమెవరమో మా పొరుగు వారికి తెలియదు, మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవరూ పలకరించరు.

           సంక్రాంతి పండుగ రోజున... గతించిన పెద్దలకు గారెలు , పరమాన్నం నివేదించి, పూజ చేసి,మేమందరం మీ కాళ్ళకి నమస్కరిస్తుంటే ... "దీర్ఘాయుష్మాన్ భవ", అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే..."మీవంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష" అని,  అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని... పిండివంటలు తింటూ...ఆ రోజంతా ఇంటికి వచ్చే పోయే వాళ్ళతో ఎంత సందడిగా గడిచిపోయిందో! పనమ్మాయికి, వాచ్మెన్ భార్యకు, పాలబ్బాయికి... మనం చేసుకున్న పిండివంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు, వాళ్ళు ఎంతో సంతోషంగా అవి తీసుకుని వెళ్తుంటే... పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఆరోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్యా. 

          కనుమ పండుగ రోజున మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్ళకి వెళ్లి అందరినీ కలిసి వస్తుంటే... మనకు ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్యా... ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కుమొక్కు లేకుండా బతుకుతున్నందుకు మామీద నాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా ...మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు "మన" అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్యా.

          తెల్లవారుఝామునే హరిదాసు సంకీర్తన, వాకిళ్ళ ముందు అందమైన ముగ్గులు... వాటి మధ్యలో పసుపు రంగు చామంతిలతో కూడిన గొబ్బెమ్మలు... పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం... బ్రతుకుతెరువుకై వలసపోయిన కుటుంబాలు, పండుగ కోసం సొంతూరుకి రావడం... పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు,అల్లుళ్ళతో కళకళలాడిన లోగిళ్ళు...అందంగా ముస్తాబైన పశువులు... బంధుమిత్రుల కోలాహలం... అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం...

ఇలా ఒకటా,రెండా...ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు... యాంత్రికత మోజులో మునిగితేలుతున్న మా నగర సమాజానికి ఆటవిడుపుగా, ఒకింత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా....

ఈ అనుభవాలని,అనుభూతులని మూటగట్టుకుని... మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడు వస్తుందా అని ఆశగా... తిరుగు ప్రయాణం అవుతున్నాము. మాకు  ఇంత ఘనంగా, చక్కగా పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్యా!".

          సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనై, అంతవరకూ తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ... ఇనుమడించిన ఉత్సాహంతో ...

"మీ తరానికి... మన సంస్కృతి, సాంప్రదాయాలు అందించాలనే తహతహ తోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాము తల్లీ...మా తరాలకి, రాబోయే భావి తరాలకు వారధిగా మీరు ఉండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకు ఉన్న అవకాశం తల్లీ. అందుకే ఎంత ప్రయాసపడైనా పండుగలకు సొంత ఊరికి రండి , మీ మూలాలు తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి...మాకు బలం అవ్వండి..‌నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా...  ", అని 

 తిరుగు సందేశం పంపాడు తాతగారు... మీసం సవరించుకుంటూ,కొండంత తృప్తితో.... 🌹🙏🌹

కామెంట్‌లు లేవు: