22, నవంబర్ 2020, ఆదివారం

సౌందర్య లహరి

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఇరవైయవ శ్లోక భాష్యం - ఏడవ భాగం


జ్ఞాని విషయమూ అంతే. కోరికలు అతనిలోనికి  ప్రవహిస్తాయి. అతడు కోరికలన్నీ లయమయిపోయే స్థితిని చేరుకొంటాడు. ఒక వస్తువును నీదిగా చేసుకొనేకంటే ఆ వస్తువునే నిన్నుగా చూడగలిగితే ఇక ఆ వస్తువు పై నీకు కోరిక అనే అవకాశమే ఉండదు కదా! ద్వైత ప్రపంచంలో ఒక వస్తువుని విడిగా చూసి దానిపై వ్యామోహం పెంచుకోవడాన్ని ఆంతరంగికంగా మలుచుకొని ఆ వస్తువు తన కంటే భిన్నం కాదని తనలోనికి తెచ్చుకోవడం వశీకరణం. ఒక స్త్రీనే కాదు ఈ విధంగా త్రిభువనములను తనలోనికి తెచ్చుకోవడం,  ఈ బ్రహ్మాండమంతా తనకు భిన్నం కాదు, తనలోని భాగమే అని తెలుసుకోవడం వశీకరణలోని అంతరార్థం. తానే మన్మథుడైపోతే మన్మథుడు కలిగించే కామ వికారాదులు మనకు ఉండవు. అదే కామ జయము.


అంబిక రెండు విధాలైన విధులను నిర్వహిస్తుంది. పరమే శ్వరుని సృష్టి కార్యోన్ముఖుని చేస్తుంది. మానవులను తిరిగి ముక్తులను చేస్తుంది. శ్రీ విద్యా సంప్రదాయంలో అంబిక ప్రకాశవంతమైన అరుణ వర్ణమని చెప్పుకొన్నాము. పార్వతి ఆకుపచ్చ - గౌరి పసుపు వర్ణంగా చెప్పబడినప్పటికి తెలుపు. కాళి నలుపు, దుర్గ నీలము. మన కామేశ్వరి సూర్యోదయా మాత్మునితో ఐక్య మొనరించడాన్ని సూచిస్తోంది. తెలుపు సూర్యకాంతి చేత విడదీయ బడినపుడు ఏడు వరము  లేర్పడుతున్నాయి. ఈ వర్ణముల మొదటి అక్షరములన్నీ, చేర్చి VIBGYOR అని చెబుతారు. చివరివర్ణంగా చెప్పబడే ఎరుపు తెలుపు ప్రక్కనే ఉంటుంది. తెలుపు వర్ణంగా గుర్తించబడదు. కాబట్టి ఎఱుపే మొదటి వర్ణము. ఊదారంగుకు ప్రక్కనును నలుపుకూడా వర్ణంగా గుర్తించబడదు. ఎందువలన? మనం  అనేక రంగులున్న వస్తువులను చూస్తూ ఉంటాము. ఒకటి  ఆకుపచ్చ, వేరొకటి నీలము - ఆకుపచ్చగా కనిపించే వస్తువు  మిగతా కాంతితరంగాలనన్నిటినీ లీనం చేసుకొంటుంది.  కాంతి తరంగాలు అంతటా నిండి ఉంటాయి. వాటి విషయం లో మనం రెండు లక్షణాలను గమనించవచ్చు. ఒక విధమైన  కాంతి తరంగము (వస్తువులపై) పరావర్తించబడుతుంది.  మిగతా అన్ని కాంతి తరంగములు (ఆ వస్తువుచే) లయము చేసుకొనబడతాయి. ఏ వర్ణపు కాంతి తరంగము పరావర్తనం కాబడుతోందో ఆ వస్తువుది ఆ వర్ణమని చెబుతున్నాము. ఈ పరావర్తన లయములనే లక్షణములలో తెలుపు రంగుకు చెందిన వస్తువులకు పరావర్తించే లక్షణం మాత్రమే ఉన్నది.  అలా ప్రతిబింబించబడిన వర్ణ తరంగములన్నీ చేరి తెలుపుగా  భాసిస్తాయి. నలుపు వస్తువులకు అన్ని కాంతి తరంగములను  తమలో లయం చేసుకొనే లక్షణము మాత్రమే ఉన్నది.


మనం త్రిగుణములగురించి చెప్పుకొంటాము. సత్త్వ రజస్ తమోగుణములు. తనలో తనకై ఏమీ ఉంచుకోక మొత్తం  బయటకు విడుదలచేసి స్వచ్ఛంగా, కాంతిమంతంగా తెల్లగా  ఉండేది సత్త్వం. ఇది పరబ్రహ్మ లేక జ్ఞానమునకు సంజ్ఞ. అంతటినీ తనలోనే ఉంచుకొనే నలుపు తమోగుణము లేక  అజ్ఞానమునకు సంజ్ఞ, ఎఱుపు రజోగుణమునకు సంజ్ఞ. క్రియాశక్తి-బ్రహ్మను జీవాత్మగానూ, జీవాత్మను తిరిగి బ్రహ్మ గానూ మార్చే క్రియ వెనుకనున్నది ఈ క్రియాశక్తే, చలన రహితము, శుద్ధసత్వము, తెల్లటి తెలుపుగానున్న జ్ఞాన తత్త్వమైన శివుడు ప్రకాశవంతమైన ఎఱుపువర్ణం గల కా శ్వరిగా ఆవిష్కరించబడడానికి పరాశక్తికి మూలమైనవాడు. దీనిని అనుగమించి తమస్సు వరకూ సమస్త సృష్టి జరిగింది VIBGYORలో ఉన్న సప్త వర్ణములు సృష్టిలోని వివిధ దశలకు వైవిధ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అన్ని రంగులు కలిసి తెలుపుగా అయినట్లు ఈ ప్రపంచం శుద్ధ ధవళ వర్ణం అయిన శుద్ద బ్రహ్మ నుంచి ఉద్భవించి తిరిగి తెల్లటి తెలుపుగా బ్రహ్మగా అయిపోయింది. ఈ సృష్టి లయములకు కారణం శుద్ధ బ్రహ్మమునుండి మొదటగా ఆవిర్భవించి, ఆ శుద్ధ బ్రహ్మకు చేరువగా ఉన్న సంస్థితి - అరుణారుణమైన కామేశ్వరి. అందు వలననే అరుణ మార్గానికి శ్రీవిద్యలో అంతటి ప్రాధాన్య మీయబడినది. పరిణామము పొంది తమస్సులో చేరుకొన్న మనం తిరోధానము చెంది తెల్లటి తెలుపు అయిన పరబ్రహ్మలో లయమవాలంటే దారిచూపవలసింది ఈ ఎఱ్ఱటి స్త్రీనే. 


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: