22, నవంబర్ 2020, ఆదివారం

ధార్మికగీత - 88*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 88*

                                      *****

        *శ్లో:-  అవిద్యా జీవనం శూన్యం ౹*

                *దిక్శూన్యా చే దబాన్ధవాః  ౹*

                 *పుత్రహీనం గృహం శూన్యం ౹*

                 *సర్వ శూన్యా దరిద్రతా ౹౹*

                                        *****

*భా:- లోకంలో "అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని" అని సామెత వింటుంటాము. మన కెన్నో సిరిసంపదలు , భోగభాగ్యాలు ఉన్నా,  కొన్ని లేకపోతే మన జీవితం శూన్యమై నిస్తేజంగా గోచరిస్తుంది. 1. "అవిద్య":- ధనమున్నా,రూపమున్నా "విద్య" అనే ఆభరణం లేకుంటే వాడు వింతపశువని శాస్త్రం చెబుతోంది. అతని జీవనం పూర్తిగా పరాధీనమై అంధకారమయమవుతుంది.    తిని, తిరగగలడేమో కాని, చైతన్యవంతంగా జీవనం చక్కదిద్దుకోలేడు. 2. "అబాంధవము":-  స్థిరచరాస్తులు, నిధినిక్షేపాలున్నా,  తనవైపు, భార్యవైపు చుట్టాలు, పక్కాలు, బంధువులు ,మిత్రులు, హితులు లేని జీవితం తలచుకొంటేనే భీతి కొల్పుతుంది. శుభాశుభ కార్యాలలో బంధువర్గానిదే పెద్దపీట. వారే కొండంత అండ. వారి ప్రమేయం లేనిదే జరిగే విధి వెలవెల పోవడం ఖాయం. 3."సంతు":- మడులున్నా, మాన్యాలున్నా , ధనధాన్యాలు అమేయంగా ఉన్నా, అనుభవించడానికి  పుత్రసంతతి లేని వాని జీవనం చంద్రుడు లేని ఆకాశంలా కళావిహీనమై నిస్సారమౌతుంది.పిల్లలతో కళ కళ లాడే ఇల్లే నిజమైన ఇల్లు.వారు లేకుంటే శ్మశానమే.   4. "దారిద్ర్యము":- అంగబలంతో,  సంతానబలంతో, వేడుకలసందడితో పరుగులు తీయించే సంసారానికి తోడు దరిద్రదేవత తాండవిస్తుంటే, అలాంటి వాడి జీవనం మూలిగే నక్క నెత్తిన తాటికాయ పడ్డ విధంగా దుర్భరమౌతుంది. మరణమే శరణమనిపిస్తుంది. బ్రతుకు భారమనిపిస్తుంది. ఈ నాలుగు సందర్భాలకు ఎదురీద వలసి వచ్చిన వానికి సర్వము   శూన్యముగా గోచరిస్తుందని సారాంశము.*

                                    *****

                    *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: