22, నవంబర్ 2020, ఆదివారం

ఆధ్యాత్మిక జీవనము*

 *ఆధ్యాత్మిక జీవనము*


యోగాలన్నింటికీ తప్పనిసరిగా కావలసింది *తపస్సు* (అంటే మనస్సును చక్కగా నియంత్రించి, స్వాధీనంలో ఉంచుకొని, ఆపై తీవ్రమైన వ్యాకులతతో చేసే సాధన). తపస్సు గురించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా వివరించాడు.


శారీరకమైన తపస్సు అంటే పరిశుభ్రత, ఋజువర్తనం, బ్రహ్మచర్యం, అహింస, అణకువ మొదలైన ధర్మాలను పాటించడం, సత్యవంతమూ, హితకరమూ, అనుద్వేగకరమూ (అనగా బాధపెట్టని) అయిన మాటలను చెప్పడం, శాస్త్రపఠనం, వీటిని వాక్ తపస్సు లేదా వాజ్ఞ్మయ తపస్సు అంటారు.


ఈ తపస్సు చేయాలంటే మన అలవాట్లను గమనించాలి. పనికిమాలిన, ఇతరులను బాధపెట్టే మాటలను పూర్తిగా వదలిపెట్టాలి. ప్రశాంతత, సాధుత్వం, మౌనం, సంయమనం, హృదయంలో పవిత్రత వీటిని కలిగి ఉండడాన్ని మానసికమైన తపస్సు అంటారు. వీటిని సంపూర్ణమైన విశ్వాసంతోనూ, తీవ్రతతోనూ ఆచరించాలి. అంతేకాక, విశాలదృక్పథాన్ని కలిగి ఉండాలి. 


ఆధ్యాత్మిక జీవనంలో శ్రీకృష్ణుడు చూపిన మార్గాన్ననుసరించి కర్మఫలాలను త్యాగం చేయడం, ఆత్మవిచారణ, భగవంతుని పట్ల ఉన్న మధురభక్తి ఈ మూడూ అవసరమే. మనలోని జీవాత్మ, పరమాత్మను సాక్షాత్కారం చేసుకునేందుకు ఇవన్నీ సోపానాలుగా ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికవేత్తలందరూ ఈ విషయాన్నే నొక్కి వక్కాణించారు.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: