24, జులై 2021, శనివారం

గురు పరంపర ..*

 .        *గురు పరంపర ..*


🔮🔮🔮🌸🌸🌸🔮🔮🔮


ఒక రాశిగా ఉన్న వేదములను సంకలనం చేసి విభాగించడం వల్ల వ్యాసుల వారిని వేదవ్యాస మహర్షి అని అంటారు. వారు వేదములను ఋగ్, యజ్, సామ, అథర్వణ మని నాలుగుగా విభాగం చేశారు. ఆ నాలుగింటిని సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అను నలుగురు శిష్యులకు బోధించారు. మంత్రములు శబ్ధతంరంగములై మన చుట్టూ ఆవహించి ఉంటాయి. వాటికి ఆది అంతములనేవి లేవు. ఎలాగైతే రేడియో సెట్టు లభ్యమయ్యే తరంగాలను లాక్కొని ప్రసారం చేస్తుందో అలాగే ఋషులు వారి యోగశక్తిచేత ప్రకృతిలో ఉన్న ఈ శబ్ధ తరంగాలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకున్నారు.


మంత్రాన్ని దర్శించివాడు అని ఋషి అను పదానికి అర్థం కూడా (రిషయోః మంత్రద్రష్టారః). ఎలాగైతే అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించాడో, అలాగే ఋషులు యోగశక్తి వల్ల జ్ఞాననేత్రంతో ఆ మంత్ర స్వరూపాలను దర్శించారు. ఆ వేదములు లిఖిత రూపంలో కాకుండా గురు శిష్య పరంపరగా మౌఖిక రూపంలో మనకు అందివచ్చాయి.


వ్యాసులు పదునెనిమిది పురాణాలను కూడా రచించి, జ్ఞానము భగవద్భక్తి కలిగిన సూతునకు ఇచ్చి వాటిని ప్రచారం చెయ్యమని చెప్పారు. తరువాత అనంతములైన వేదములను సంగ్రహంగా బ్రహ్మసూత్రాలుగా వ్రాశారు. ఆ బ్రహ్మ సూత్రాలకు గొప్ప గొప్ప ఆచార్యులు వ్యాఖ్యానాలు లేదా భాష్యాలు వ్రాసారు. అందులో శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజులు, శ్రీ మధ్వాచార్యులు రాసిన బ్రహ్మసూత్ర భాష్యాలు బహుళ ప్రాచుర్యం పొందాయి.


తరువాతి కాలంలో సిద్ధాంతాల పరంగా విభేదాలు వచ్చినప్పటికి వీటీకి మూలమైన బ్రహ్మసూత్రాలు వేదవ్యాస ప్రణీతమని మరువరాదు. మన ఆధ్యాత్మిక సంస్కృతి, ఆదిభౌతిక ఆలోచనా విధానం వల్లే మన దేశం ప్రపంచ దేశాల వందనములు స్వీకరిస్తోంది. మనకు వేదములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షులను పరంపరాగతంగా వీటిని మనకు అందిచిన ఋషులను గుర్తుపెట్టుకుని కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం మన అందరి కర్తవ్యం.


మనకు వేదములతో పాటు ధర్మసూత్రములు కూడా ఉన్నాయి. అవి మనము వేదములు చదివే అర్హతను పొందడానికి చెయ్యవలసిన చెయ్యకూడని విధులగురించి, మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాయి. వాటినే స్మృతులు అని కూడా అంటారు. అవి ఒక్కొక్క ఋషిపేరు మీద పరాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి, మనుస్మృతి మొదలుగునవిగా చెప్పబడ్డాయి.


ఈ స్మృతులను సంగ్రహంగా ధర్మ-శాస్త్ర-నిబంధనం అని తరువాతి రచయితలు వ్రాశారు. ఉత్తరాదిన కాశినాథ ఉపాధ్యాయ రచించినది, దక్షిణాన వైద్యనాథ దీక్షితర్ వ్రాసిన నిబంధనములు అత్యంత ప్రాచుర్యములు. వైద్యనాథ దీక్షితీయం వైష్ణవులకు శైవులకు ఇరువురికీ ఒక్కటే. అటువంటి వేదములు, ధర్మశాస్త్రాలు మన మతానికి పునాదులు.


మనధర్మానికి మూలపురుషులైన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడానికి వచ్చినదే ఈ వ్యాస పౌర్ణమి. ఆయన గురువుగా వేదాలను ధర్మసూత్రాలను శిష్యులద్వారా వ్యాప్తి చేశారు కాబట్టి దీనికి గురుపౌర్ణమి అని కూడా పేరు. ఈ జ్ఞాన భాండాగారాన్ని తరవాతి తరాలకు అందిస్తున్న గురువులు అందరు వ్యాస మహర్షి పరంపర లోని వారే..


వందే గురు పరంపరాం ...🙏


🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: