*వర్షం లో మ్రొక్కుబడి..*
"అసలే వర్షం పడుతోంది..ఈ మంటపం లో పడుకునే వీలు లేకుండా ఉంది..నా మాట విను..ఈ రాత్రికి మనం కందుకూరు వెళ్ళిపోయి అక్కడ ఒక రూము తీసుకొని పడుకుందాము..రేప్పొద్దున లేచి..తయారయ్యి ఇక్కడకు వచ్చి స్వామివారి సమాధి దర్శించుకొని వెళదాము..అంతేగానీ..ఇక్కడే వుందాము..ఇక్కడే పడుకుందాము అని మొండిగా వాదించవద్దు..నా మాట విను.." అని ఆ భర్త తన భార్యతో చెపుతున్నాడు..ఆమె మాత్రం "ఎక్కడికీ వెళ్లొద్దు..ఇక్కడే వుందాము..ఈ ఒక్కరాత్రికి సర్దుకుందాము..నేను స్వామివారి మందిరం లో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను..మొక్కుబడి చెల్లించుకోవాలి.." అని చెపుతున్నది.."సరే నీ ఇష్టం..ఈ మంటపం లోనే ఒక మూల ఏర్పాటు చేసుకుందాము.." అని అత్యంత అసహనంగా చెప్పాడు..
ఆరోజు వర్షం కారణంగా మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణం అంతా తడి గా ఉన్నది..ఆ సమయం లో ఆ భార్యా భర్త స్వామివారి మందిరానికి వచ్చారు..ఉదయం హైదరాబాద్ లో బయలుదేరి సాయంత్రానికి స్వామివారి మందిరానికి చేరారు..వాళ్ళు స్వామివారి మందిరానికి రావడం కూడా అదే మొదటిసారి..మందిరం లోకి రాగానే..ముందుగా స్వామివారి సమాధిని దర్శించుకొన్నారు..ఆ తరువాత..ఆ దంపతుల మధ్య ఈ సంభాషణ జరిగింది.."ఏమండీ ఇక్కడ మేము ఉండటానికి ఏదైనా ఒక రూము ఉన్నదా?.." అని ఆ భర్త నన్ను అడిగాడు.."ఉన్నది..మీరు కంగారు పడొద్దు..రాత్రికి ఆ రూము మీకు కేటాయిస్తాము..ఆవిడ తన మొక్కుబడి కోసం మంటపం లోనే పడుకోమని చెప్పండి..మీరు రూములో ఉండొచ్చు.." అన్నాను.."ఆ ఏర్పాటు చేయండి..మీకు కృతజ్ఞతలు.." అన్నాడు.."మీరెవరు?..ఈ స్వామివారికి మొక్కుబడి అన్నారు కదా?..ఎందుగురించి మొక్కుకున్నారు..? మీకు అభ్యంతరం లేకపోతే వివరిస్తారా?.." అని అడిగాను..
"మాది కృష్ణాజిల్లా అండీ..ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నాము..మాకొక ఫార్మా కంపెనీ ఉన్నదండీ..బాగానే ఉన్నాము..మాకు ఇద్దరు పిల్లలు..చదువుకుంటున్నారు..పోయిన సంవత్సరం ఈవిడకు కడుపులో నొప్పి వచ్చింది..డాక్టర్ కు చూపించాము..పరీక్షలు చేసి..లోపల ఇన్ఫెక్షన్ వచ్చింది..ఆపరేషన్ చేయాలని చెప్పారు..రెండు మూడు హాస్పిటల్స్ లో చూపించినా..దాదాపుగా అందరూ ఇదే మాట చెప్పారు..ఈవిడకు ఆపరేషన్ అంటే భయం పట్టుకుంది..నేను ఎంత నచ్చచెప్పినా వినలేదు..ఆ సమయం లో ఈవిడ స్నేహితురాలు ఈ క్షేత్రం గురించి చెప్పి..ఒకసారి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా మొక్కుకో..నీకు ధైర్యం వస్తుంది..వ్యాధి కూడా తగ్గిపోవొచ్చు.." అని చెప్పింది..స్వామివారి చరిత్ర పుస్తకాన్ని కూడా ఇచ్చింది..ఆవిడ ఏ ముహూర్తం లో స్వామివారి గురించి ఈవిడతో చెప్పిందో తెలీదు కానీ..ఆరోజే ఆ పుస్తకాన్ని పారాయణం చేయడం మొదలుపెట్టిందండీ..మూడు రోజుల్లో పూర్తి చేసింది..ఆ తరువాత మీకు ఫోన్ చేసి మా అడ్రెస్ ఇచ్చాము..మీరు స్వామివారి విభూతి గంధం పోస్టు లో పంపించారు..ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి..స్వామివారి కి నమస్కారం చేసుకొని..ఆ విభూతి గంధం నుదుటిన పెట్టుకోవడం చేసింది..పదిరోజులు చేసిందండీ..చిత్రంగా తన కడుపులో నొప్పి తగ్గినట్టు అనిపించింది..మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకున్నాము..డాక్టరు గారు ఇన్ఫెక్షన్ అంతగా లేదు..మందులు వాడి చూద్దాము..అన్నారు..నెల రోజుల తరువాత ఈవిడకు పూర్తి స్వస్థత చేకూరింది..తన ఆరోగ్యం బాగు పడితే..ఈ క్షేత్రానికి వచ్చి నిద్ర చేస్తానని మొక్కుకుంది..అందుకోసం వచ్చామండీ.." అన్నాడు..భర్త తన గురించి చెపుతున్నంత సేపూ ఆవిడ స్వామివారి పటానికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది..
ఆరోజు రాత్రి ఆ భార్యాభర్తలు మందిరం లోనే నిద్ర చేశారు..తెల్లవారి స్నానాదికాలు ముగించుకొని..స్వామివారి సమాధి ని దర్శించుకొని..ఇవతలికి వచ్చి.."ప్రసాద్ గారూ..రాత్రి వర్షం వచ్చిన కారణంగా మంటపం లోకి వర్షపు నీరు వచ్చి..అంతా నీళ్ల మయం అయింది..మా మొక్కుబడికి ఏమీ ఇబ్బంది కలుగలేదు..కానీ..ఈ మంటపానికి పడమర వైపు రేకులతో షెడ్ వేయగలిగితే..మావంటి ఇతర భక్తులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది..మా వంతుగా ఆ పని చేస్తాము.." అన్నారు.."మంచి ఆలోచన..అలానే చేద్దాము.." అన్నాను..
ఆ దంపతుల ఆరోగ్య సమస్యనూ..వాళ్ళద్వారా భక్తుల ఇబ్బందినీ..రెండింటినీ స్వామివారు సమాధిలో కూర్చునే తీర్చారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి