19, ఆగస్టు 2020, బుధవారం

కఠోపనిషత్‌ వివరణ

కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 31 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 20 🌻*

ఆచార్యుడు కానటువంటివాడు ఆత్మతత్త్వమును బోధించలేడు అని చెప్తున్నారు.

అంటే అర్ధం ఏమిటీ అంటే స్వయముగా తానే ఆచరించి తాను స్వయముగా ఆత్మనిష్ఠను పొందనటువంటివారు ఎవరైతే వున్నారో, వారు ఆత్మతత్త్వాన్ని బోధించడానికి అనర్హులు. ఒకవేళ అటువంటి వారిని నీవు ఆశ్రయించినచో, వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా, నీలో అవిద్యా శబలితమైనటువంటి అజ్ఞానప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి అవకాశం వుంది.

        కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రముగా గమనించవలసినటువంటి అవసరం వుంది. వారిని అనుసరించాలట. నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే ఒక సంవత్సరకాలం అనుగమించి ఉండాలి. అనుసరించి వుండాలి. అనేక సందర్భాలలో గురువుగారు ఎలా వున్నారు అనేటటువంటి పరీక్ష చేయాలి. నిజానికి మాట్లాడితే శిష్యుడే గురువుని పరీక్షించాలి. ఈయన నాకు తగునా. తగుపాటి గురువును అన్వేషించాలి. ఈ అన్వేషణ అత్యంత శ్రద్ధతో చేయాలి.

అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువుగారు నిరంతరాయంగా ఆత్మనిష్ఠ గురించే బోధిస్తున్నారా, లేక జనవాక్య హితమైనటువంటి ప్రేయోమార్గ పద్ధతిగా జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధ చేస్తున్నాడా అనేటటువంటిది గ్రహించాలి, గమనించాలి. ఎవరైతే స్వయముగా ఆత్మనిష్ఠులో వారు మాత్రము అతికుశలురై వుండుటచేత - ఈ అతికుశలత్వం అంటే అర్ధం ఏమిటంటే బుద్ధియొక్క కదలికలని కదలకముందే తెలుసుకొనుట. ఇది కౌశలము అంటే.

కౌశలము అంటే నిపుణత్వం. నైపుణ్యం ఎంత వుండాలయా అంటే “బుద్ధి కర్మానుసారిణీ”. బుద్ధి కర్మననుసరించే పనిచేస్తుంది. కర్మ అంటే ఏమిటీ అంటే మూడు గుణములతో కూడుకున్నది కర్మ. కర్తృత్వ భోక్తృత్వములతో కూడుకున్నది కర్మ.

 ద్వంద్వానుభూతితో కూడుకున్నటువంటిది కర్మ. వాసనలతో కూడుకున్నటువంటిది కర్మ. కాబట్టి గుణత్రయము, వాసనాత్రయమును, దేహత్రయమును, శరీరత్రయమును, అవస్థాత్రయము వంటి త్రిపుటులన్నీ ఇందులో వున్నాయి.

మరి వాటియందు ఏ రకమైనటువంటి కదలిక ఏర్పడినా, ఏరకమైన ప్రలోభం ఏర్పడినా, ఏరకమైన ప్రభావం ఏర్పడినా, ఏరకమైన ప్రతిబంధకం ఏర్పడబోతున్నా, అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి కాబట్టి, బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకొన్నవాడై బుద్ధిని ఆత్మయందు, సాక్షిత్వమందు, చైతన్యమందు నిలిపివుంచి ఈ ప్రలోభములకు గురి కాకుండా చేయగలగడం కౌశలం. ఇదీ కౌశలం అంటే అర్ధం. కుశలత్వం అంటే అర్ధం ఇది. ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయా నువ్వు? ప్రపంచంలో చాలా నైపుణ్యాలు వున్నాయి. అనేక నైపుణ్యాలు.

 ఒక గోడకి మేకు కొట్టాలన్నా నైపుణ్యంతో కొట్టాలి; లేకపోతే వేలు బద్దలవుతుంది. ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి. ఒక సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా నైపుణ్యం కావాలి. ఒక వంట చేయాలన్నా కూడా, వంకాయ కూర చేయాలన్నా కూడా సరిగ్గా జాగ్రత్తగా చేయకపోతే వేలు తెగుతాయి వంకాయ తెగేబదులు.

 కాబట్టి ప్రతిపనిలోనూ - కర్మ అంటేనే కౌశలం. కర్మ అంటేనే కౌశలం అని అర్ధం. “కర్మసుకౌశలం” అంటే అర్ధం ఏమిటంటే చాలా నైపుణ్యంతో చేయబడేటటువంటి కర్మ అనే అర్ధం చెప్పకూడదు.

సశేషం....
****************

కామెంట్‌లు లేవు: