19, ఆగస్టు 2020, బుధవారం

*అన్నమయ్య సంకీర్తన*
రేకు: 61-3
సంపుటము: 1-312
రాగము: ధన్నాసి.


నందనందన వేణునాదవినోద ము-
కుంద కుందదంతహాస గోవర్ధనధరా!!


రామ రామగోవింద రవిచంద్రలోచన
కామ కామకలుష వికారవిదూరా
ధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-
ర్ధూమధామ కరణచతుర భవభంజనా!!


కమల కమలవాస కమలరమణ దేవో-
త్తమ తమో గుణసతతవిదూర
ప్రమదత్ర్పమదానుభవభావకరణ
సుముఖ సుధానంద శుభరంజనా!!


పరమ పరాత్పర పరమేశ్వరా
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వర
నరహరి నామ పన్నగశయనా!!

🕉🌞🌏🌙🌟🚩

భావము :--

     ఓ నందనందనా! వేణుగాన వినోదా! ఓ ముకుందా! మొల్ల మొగ్గ వంటి లేత చిరునవ్వుగల మనోహరా! గోవర్ధన పర్వతము నెత్తిన మహానుభావా! (నీకు వందనములు).


1. ఓ పరశురామా! రఘురామా! గోవిందా! సూర్యచంద్రులు నేత్రములైన ప్రభూ! మాయొక్క కామనలను, కామనలవలన జనించిన దోషములను పరిహరించువాడా! మోక్షమునకు స్థానమై ముక్తి వైభవము యొక్క ప్రతాపము రూపుదాల్చినవాడా రక్కసి మూకను సమూలముగా కంపింపజేయువాడా! నేర్పరితనము ద్యోతక మగునట్లు భవబంధములను సడలించు
మహానుభావా! నీకు వందనములు.


2. కమల(బ్రహ్మ)కు ఆవాసమైన (స్థానమైన) కమలము (నాభియందు) గలదేవా! లక్ష్మీవల్లభా! దేవతలందరిలో శ్రేష్ఠుడా! ఎల్లప్పుడూ తమోగుణమును నిరసించి నిర్మూలించువాడా!
ప్రమదానుభవమును (బ్రహ్మానందమును),
ఆనందస్వరూపిణియైన లక్ష్మిని చేపట్టిన భావస్వరూపా! ప్రసన్నత చేకూర్చు మోక్షానందము కలిగించే శుభరంజనుడా! (నీకు అనేక వందనములు).


3. ఓ సర్వోత్తమా! పరాత్నరా! (సర్వ శ్రేష్ఠా!) ఓ పరమేశ్వరా!వరములనొసంగు దేవదేవా! ఓ వరదామల! (నిర్మల లక్ష్మీనివాసా!) వాసుదేవా! శాశ్వతుడా! నిరంతరం వేంకటాద్రి ఆలయముగా గల వేంకటేశ్వరా! నరహరి నామముతో శేషతల్ప శాయియైన దేవాది దేవా! (నాకు శరణాగతియే ఆధారము తండ్రీ! నన్ను రక్షింపుము.)

🕉🌞🌏🌙🌟🚩
*******************

కామెంట్‌లు లేవు: