24, ఏప్రిల్ 2023, సోమవారం

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర

 

*గ్రంథం*: శ్రీ అవధూత బోధామృతం, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి జీవిత చరిత్ర 

*రచన* : శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్


*మనసుకి ఆహారం - సద్గురు లీలాచింతన*


ఎప్పుడైతే సద్గురులీలా చింతన 

నిరంతరం మనసుకు ఆహారమవుతుందో ఆ శుభ సమయంలో గురువు ప్రసన్నుడై *నేను నీతోనే ఉన్నాను, నీవు చేసే పనులన్నీ అనుక్షణం గమనిస్తూనే ఉన్నాను* అని తెలిపే దివ్య నిదర్శనాలు ప్రసాదిస్తాడు. అట్టి దివ్య అనుభవాలు కలిగాక కాలక్షేపానికి కబుర్లు, టీవీలు, సినిమాల అవసరమే ఉండదు. పొమ్మన్న మనసటుపోదు. సద్గురు లీలా చింతనలో తన్మయమైన మనసు మన ప్రయత్నం లేకుండానే ఏకాగ్రమై నిలిచి ధ్యానస్తమవుతుంది.


 అట్టి శుభ సమయంలో సద్గురు కృపవలన మనలోని దుర్గుణాలు దూరమవుతాయి. ఒకవేళ ఆ విధంగా దుర్గుణాలను వీడలేనప్పుడు కన్నీటితో సద్గురుని సహాయం అర్ధించాలి. పరమ కారుణ్యమూర్తి అయినా సద్గురువు ప్రసన్నుడై తన యోగశక్తితో మన దుర్గుణాలను హతమారుస్తాడు. ఆ విధంగా దుర్గుణాలనే ముళ్ళు అన్నీ నశించాక ఆనంద పదవికి పూల బాట సిద్ధమైనదన్నమాట.


🙏 *ఓం నారాయణ -  ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీ సాయిమాస్టర్ స్మృతులు*

       *సంకలనకర్త :- లక్ష్మీ నరసమ్మ*

                   *టాపిక్ :- 23*

                 *సర్వసమర్ధుడు*

                               శ్రీ రఘురామ్ రాజ్


ఏదైనా ఒక చెడు అలవాటును మాన్పించడానికి మాస్టారుగారు అనుసరించే విధానము చాలా విచిత్రంగా వుంటుంది. ఉదాహరణకి నేను డిగ్రీలో వుండగా సినిమాలు ఎక్కువగా చూస్తూండేవాణ్ణి, ఆయన ఏ రోజు సినిమాలు చూడకూడదు, మానెయ్యమని చెప్పేవారు కాదు. కానీ దైవం మీద భక్తి స్థిరపడే కొద్దీ వాటంతట అవే పోతాయి అనేవారు. నా విషయంలో అది నిజమయింది. ఈ రోజు నాకు సినిమా చూడలంటేనే వినుగు పుడుతుంది. చెడును బలవంతంగా తీసివెయ్యాలనుకుంటే అది అవకాశము వచ్చినప్పుడు రెండింతల శక్తితో విజృంభిస్తుందని, అలాగాక మంచిని ఆచరిస్తూంటే, చెడు దానంతట అదే తొలగి పోతుందని మాస్టారు గారు చెబుతూండేవారు. ఇంకొక ఉదాహరణ ఒకసారి సాధన కోసమని 'మటన్' ని మానేశాను. అందువల్ల నా బాడీ వీక్ అయ్యింది. అప్పుడు మాస్టార్ గారు "వద్దు అలా మానేయవద్దు సహజంగా ఆ పరిస్థితి నీకు నిజంగా కలిగినప్పుడు ఆ అలవాటుదానంతటదే పోతుంది. నీ బాడీలో ప్రతి నరము వీక్ అయినది. కాబట్టి మటన్ తీసుకో " అన్నారు. ఏదన్నా వివరించి చెప్పవల్సి వస్తే శాస్త్రాల్లోని వాక్యాలను కోట్ చేసి ఉదాహరణలతో మనస్సుకు హత్తుకునేలాగా చెప్పేవారు. ఆయన ప్రసంగంలో మన ప్రశ్నలకు సమాధానం మనం అడగకుండానే ఖచ్చితంగా వచ్చేది. మాస్టారుగారి కెప్పుడూ నేను చెప్పలేదు కానీ ఒకరోజు నేను మాస్టారుగారి దగ్గర కెళ్ళాను. నన్ను చూడగానే "మనిషి కావాలంటే ఎంత గొప్పవాడయినా కావచ్చు సాధన చెయ్యాలే గాని” అని అన్నారు. ఆయన సర్వజ్ఞులు.


                          🙏జై సాయిమాస్టర్🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


🔥సాయి వచనం:-


*'ఇది బ్రాహ్మణ మసీదు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గాన నడిపించి చివరికంటా గమ్యం చేరుస్తాడు.'*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*గ్రంథం:-నేను దర్శించిన మహాత్ములు*

*శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర*

*రచన:-*

*శ్రీఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు*


  ఆ గురువారం నాడు సాయిని ప్రార్థించుకొని అమ్మ సన్నిధి చేరేసరికి రోజు కంటే 10 ని॥లు ఆలస్యమైంది. నేను చేరుకున్న కొద్దిసేపటికే అమ్మ వేదిక పైనుండి లేచి దూరానున్న కుటీరం వైపుకు నడవసాగారు. ఎలాగైనా ఆ రోజు ఆమె దర్శనం పొంది శిరిడీ వెళ్ళిపోవాలని నాకు తొందర గలిగింది. అప్రయత్నంగానే నేను గూడా అమ్మను అనుసరించాను. కానీ రెండవ రోజులాగ ఆ రోజు నన్ను ఎవరూ ఆటంకపరచలేదు. అమ్మ తిన్నగా కుటీరంలోకి వెళ్ళిపోయారు. నేను గూడ ఆమె వెనుకనే కుటీరంలోకి ప్రవేశించాను. అమ్మ అకస్మాత్తుగా వెనక్కు తిరిగి అక్కడవున్న ఒక్క బ్రహ్మచారిణితో వాకిలి తలుపు మూయమని చెప్పారు. గాని నేనక్కడ వున్నట్లు ఆమె గుర్తించినట్లేలేరు. ఆమె తిన్నగా వెళ్ళి అక్కడవున్న ఒక మంచం మీద ఒక ప్రక్కకు తిరిగి కళ్ళు మూసుకొని కూర్చున్నారు. నాకేం చేయాలో తెలియలేదు. ఆమెను పలకరించి నమస్కరిస్తే నన్ను బయటకు పొమ్మంటుందేమోనన్న భయం. అలాని ఊరుకుంటే నేనక్కడ కూర్చోవచ్చోలేదో తెలియలేదు. ఆ విషయమే అడగటానికి అక్కడ ఇంకెవరూ లేరు. 5 ని॥లు అలాగే నిలబడి, తర్వాత అక్కడే నేలపై కూర్చున్నాను.

   

********************************

ఆన్లైన్ లో చదువుటకు ఈ లింక్ ను ఉపయోగించుకోగలరు.


https://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Aanandamai-Amma-Charitra&page=1

కామెంట్‌లు లేవు: