24, ఏప్రిల్ 2023, సోమవారం

ఆదిశంకరాచార్యులు

  ఆదిశంకరాచార్యుల జన్మదినోత్సవం .

కావున  వారి గురించి కొంత తెలుసుకుందాం.


సృష్టిలో ఏ లోపమూ లేదు. ఉన్నదంతా నీ చూపులోనే వుంది. కాబట్టి నీ చూపును సరిచేసుకో' అని అతి సులభమైన రీతిలో వేదాంత భావనను బోధించినవారు ఆదిశంకరాచార్యులు. లోకంలో ధర్మనిరతి తగ్గుతున్న తరుణంలో దాన్ని సుప్రతిష్ఠితం చేయడానికి ఆవిర్భవించిన అవతార పురుషుడు శంకరాచార్యులు. ఆయన జన్మ తిథి వైశాఖ శుద్ధ పంచమి.


శంకరుడు పుట్టిన నాటి నుంచి అసమాన ప్రతిభాశాలి. ఏడాది వయసుకే మాతృభాష, లిపి నేర్చుకుని రెండేళ్లకే చదివేవాడు. మూడో ఏట పురాణాలు అర్థంచేసుకునే జ్ఞానం లభించిందంటారు. ఈ పరంపరలో ఎనిమిదేళ్ల వయసు వచ్చేనాటికి వేదవాంగ్మయం, తర్కం, సాంఖ్యం, యోగం, మీమాంస, నిరుక్తం మొదలైన శాస్త్రాలు ఆకళింపు చేసుకుని సకల విద్యా పారంగతుడయ్యాడని తెలుస్తోంది. తాను నేర్చుకున్న విద్యకు సార్థకత లోకోపకారమేనని, దానికి అనువైనది సన్యాసమేనని భావించాడు. అతికష్టం మీద తల్లిని ఒప్పించాకే సన్యాసం స్వీకరించాడు. ఉత్తరముఖంగా సాగిపోయి గోవింద భగవత్పాదుని అండచేరి.. శిష్యుడిగా చేసుకొమ్మని కోరాడు. 

శంకరుడు సామాన్యుడు కాడని, ఇలాంటి శిష్యుడి వల్లనే తన జీవితానికి ఏర్పడుతుందని భావించారాయన. అందుకే అడగడమే మహా ప్రసాదం అన్నట్టు శిష్యుడిగా చేర్చుకొన్నారు.

ఆయన దగ్గర విద్య పూర్తి చేసుకున్న తరువాత, కాశీ చేరుకున్నారు. అక్కడ దారిలో ఎదురైన మనిషిని తప్పుకొమ్మ న్నారు. 'తప్పుకోమన్నది నన్నా, నాలోని శివుడినా?' అని అతడు అడిగిన ప్రశ్నతో 'ప్రతివారూ భగవత్స్వరూపులే' గ్రహించి 'సత్యవేది' అయ్యారు. ఆ అనుభవంతో ‘మనీషా పంచకం' రచించారు. ఆపై బదరీనాథ్ వెళ్లి తన గురువుకు గురువైన గౌడపాదుని శిష్యరికం చేశారు. ఆయన ఆదేశానుసారం బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. 'ప్రపంచాన్ని జయించిన వాడు విజేత కాడు. తనను తాను జయించినవాడే నిజమైన విజేత' అని చెబుతూ- అటువంటి విజేత కావడానికి మార్గదర్శి అయ్యారు. దానికి గాను కనకధారా స్తవం, సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, భజగోవిందం లాంటి స్తోత్రాలు, కావ్యాలు రచించారు. ఎన్నో గ్రంథాలకు భాష్యాలను రచించి లోకుల జీవితాల్లో ఆధ్యాత్మిక కాంతిని ప్రసరింపజేశారు.


ఆ నాటికి ప్రబలి ఉన్న అనేక మతాల్లో ఎన్నెన్నో వాదాలు. అవి విశ్వకల్యాణ భావనను మాని తమ ఉనికి, ఉన్నతుల కోసం అకృత్యాలు, అరాచకాలు చేయడానికి సైతం వెనకాడని సమయమది. ఆ భావజాలం ప్రబలిన వారందరినీ ఏకతాటి మీదకు తెచ్చి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి ఒప్పించారు. ఆ తత్వాన్ని లోకమంతటా వ్యాప్తి చేయడానికి అనువుగా దేశం నలుదిక్కులలో నాలుగు శక్తి పీఠాలను స్థాపించారు. అవి... తూర్పున గోవర్ధన పీఠం (పూరీ), పడమరన కాళికాపీఠం(ద్వారక), ఉత్తరాన జ్యోతి పీఠం(బదరీనాథ్), దక్షిణాన శారదా పీఠం(శృంగేరి). ఆయా పీఠాల నిర్వహణకు గాను ఆధిపతులను నియమించారు.


ఏమీ తెలియనివాడు లోకానికి లోబడి ఉంటాడు. అన్నీ తెలిసిన వాడు లోకాన్ని లోబరచుకుని ఉంటాడు. కాబట్టి అన్నీ తెలిసిన వాడివి కమ్మని, తద్వారా ఆత్మోన్నతుడివి కమ్మని బోధించిన శంకరులు భౌతికంగా జీవించింది ముప్ఫైరెండు సంవత్సరాలే. 'నీలో ఉన్న దివ్యుడిని నీ అంతట నీవే దర్శించాలి. తద్వారా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఆ అనుభవమే నీకు నిజమైన గురువు అవుతుంది' లాంటి ప్రబోధాత్మక వాక్యాలు, ఆధ్యాత్మిక వ్యాఖ్యల ఆచంద్రతారార్కం జీవించి ఉంటారు ఆయన.


సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం.👏

కామెంట్‌లు లేవు: