22, జనవరి 2025, బుధవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(26వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*పుడమిని బెదిరించిన పృథు చక్రవర్తి*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ప్రజాక్షేమాన్ని ఆశించే రాజు కోసం, ధర్మం నెలకొల్పే రాజు కోసం మునులు వేనుని బాహువులు మథించగా అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడూ ఉద్భవించారు. ఇద్దరూ భగవదంశతో జన్మించిన వారే! ఆ పురుషుడే పృథువు. శ్రీమన్నారాయుణుని అంశతో జన్మించిన పృథువు, సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో జన్మించిన స్త్రీని, ‘అర్చి’ని వివాహమాడాడు. ఆనాడు ఆ వివాహం మునులకూ, దేవతలకూ, సర్వులకూ కనుల పండువయింది. సంతోషించారంతా.*


*పుడమికి రాజయినాడు పృథువు. మునీశ్వరులు అతన్ని అభిషేకించారు. అష్టదిక్పాలకులూ అతనికి అద్భుతమయిన కానుకలు అందజేశారు. కానుకల రూపేణా పృథువుకి దివ్యమయిన ఆయుధాలు లభించాయి.*


*భూలోకంలో అఖండమయిన కీర్తిని ఆర్జించిన వారిలో ప్రథముడు పృథువు. ధరాన్ని ప్రతిష్ఠించాడతను. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు.పృథువు రాజ్యాన్ని చేపట్టే నాటికి లోకంలో ప్రజలంతా చెప్పలేనన్ని ఈతి బాధలు అనువిభవిస్తూ ఉన్నారు. అన్నం లేక అలమటిస్తూ ఉన్నారు.‘‘మహారాజా! మాకింత అన్నం పెట్టి, మమ్మల్ని కాపాడు.’’ పృథు చక్రవర్తిని వేడుకున్నారు ప్రజలు. పిడికెడు మెతుకులు దొరకని ఈ కరువేమిటి? ఎందుకొచ్చి పడిందని ఆలోచించాడు పృథువు. సమస్త ఓషధులనూ భూమి హరించి వేయడంతోనే ఈ అవస్థ వచ్చి పడిందని అర్థం చేసుకున్నాడతను. పట్టరాని కోపం కలిగింది. భూమిని సంహరించడానికి ధనుర్బాణాలు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడో లేదో భూదేవి గో రూపం ధరించి, భయంతో పరుగందుకుంది. ఆమె వెంటపడ్డాడు పృథువు. భూదేవి సమస్తలోకాలూ తిరిగింది. రక్షించమని ఎందరినో వేడుకుంది. ఎవరూ రక్షించలేకపోయారామెను.

వెంటపడి తరుముకు వస్తూన్న పృథువుని అడ్డగించలేకపోయారు. చేసేది లేక ప్రాణభిక్ష పెట్టమని పృథువుని ప్రార్థించింది భూదేవి.‘*


*‘ఓషధులన్నీ గర్భంలో దాచుకుని, ధాన్యాదులు ఇవ్వకుండా కరువు తెచ్చిపెట్టావు. ఇప్పటికయినా మించిపోయింది లేదు, నా ప్రజలందరికీ జీవనాధారం చూపించు. కాదన్నావా, నిన్ను సంహరించి తీరుతాను. హరిహరాదులు కూడా నిన్ను కాపాడలేరు.’’ గర్జించాడు పృథువు.*


*చావు నుంచి తప్పించుకునేందుకు భూదేవి రకరకాలుగా పృథువుని స్తుతించింది. పట్టించుకోలేదతను. పట్టిన పట్టు వీడలేదు. అప్పుడిలా అంది భూదేవి.‘*


*‘మహారాజా! నీ ముందు రాజులు నన్ను అలక్ష్యం చేశారు. జీవనాధారమయిన ఓషధులన్నీ దుర్మార్గుల పరం చేశారు. దానిని నేను తట్టుకోలేకపోయాను. దుర్మార్గుల చేతికి చిక్కకుండా ఓషధులన్నిటినీ నేనే స్వీకరించాను. వాటిని నా గర్భంలో దాచి పెట్టాను. అయితే ఇది జరిగి చాలా రోజులయిన కారణంగా, ఇప్పుడు ఆ ఓషధులు నాలో క్షీణించాయి.’*


*’‘‘అబద్ధం’’ గర్జించాడు పృథువు.*


*‘‘లేదు మహారాజా, నిజమే చెబుతున్నాను. కోపించకు. ఇప్పుడు నీకు ఆ ఓషధులు కావాలంటే నేను ఓ ఉపాయం చెబుతాను, విను.’’*


*‘చెప్పు’’*


*‘‘నేనిప్పుడు గోరూపంలో ఉన్నాను కదా, నాకు ఓ దూడనూ, పాలపాత్రనూ, పాలు పితికేవాణ్ణీ సృష్టించు. పాల రూపంలో సమస్త ఓషధులనూ నీకు అందజేస్తాను. అలాగే పర్వతాదులతో హెచ్చు తగ్గులుగా ఉన్న నన్ను చక్కగా చదును చెయ్యి. అలా చేస్తే వర్షం నీరు వృథాపోదు, సమతలంగా ఉన్న నాలోనే నీరంతా ఉంటుంది. ఏమంటావు?’’ అడిగింది భూదేవి.*


*ఆవేశపడకుండా ఆలోచించాడు పృథువు. భూదేవి చెప్పినట్టుగా చేసేందుకు సిద్ధమయ్యాడు. స్వయంభువ మనువును దూడగా మార్చాడు. తన చేతుల్నే పాలపాత్రగా మర్చాడు. తానే పాలను పితికేవాడై, భూదేవి పొదుగు నుండి పాలను పితకాడు. పాత్ర నిండుగా పాలు పితికాడు. సమస్త ఓషధులతో నిండిన ఆ పాలను, భూమి అంతటా జల్లాడు. అంతలో దేవతలూ, మునులూ వచ్చారక్కడకి.*


*భూదేవి నుండీ తామూ తమకు కావాల్సినవి పితుక్కుంటామన్నారు. అభ్యంతరం చెప్పలేదు పృథువు. అంగీకరించాడందుకు. వశిష్ఠాది మునులంతా బృహస్పతిని దూడగా చేసి, ఇంద్రియాలను పాత్రను చేసి చంధోమయమైన పాలను పితికారు.*


*దేవతలు ఇంద్రుని దూడను చేసి, బంగారు కలశంలో అమృతాన్ని పితుక్కున్నారు. దానవులు ప్రహ్లాదుని దూడను చేసి, ఇనుప పాత్రలో గౌడి, పైష్ఠి, మాధ్వి అని మూడు రకాల మద్యాన్ని పితుక్కున్నారు. గంధర్వులు విశ్వావసును దూడను చేసి, పద్మాన్ని పాత్ర చేసి, అందులో వాంగ్మాధుర్యాన్ని పాలగా పితికారు. పితృదేవతలు సూర్యుణ్ణి దూడను చేసి, మట్టిపాత్రలో అన్నాన్ని పితుక్కున్నారు. కపిలుని గోవుగా చేసి, ఆకాశాన్ని పాత్రను చేసి, సిద్ధులు అణిమాదిసిద్ధులు పితుక్కున్నారు. విద్యాధరులు ఆకాశగమనం మొదలయిన విద్యలను పితుక్కున్నారు. మయుని దూడను చేసి మాయావులు ఇంద్రజాలాది విద్యలను పితుక్కున్నారు. యక్ష రాక్షస భూత పిశాచాదులు రుద్రుని దూడను చేసి, కపాలాన్ని పాత్రను చేసి, మద్యంలాంటి మత్తు కలిగించే రక్తాన్ని పితుక్కున్నారు. సర్పాలు తక్షకుణ్ణి దూడను చేసి, రంధ్రాలనే పాత్రలో విషతుల్యమయిన పాలను పితుక్కున్నారు. పశువులు శివుని వాహనం నందిని దూడను చేసి, అరణ్యం పాత్రలో తృణాదులను పితుక్కున్నారు. హిమవంతుని దూడను చేసి, సానువులను పాత్ర చేసి, పర్వతాలు గౌరవాది ధాతువుల్ని పితుక్కున్నాయి. ఇలా పదిమందీ పదిరకాలుగా భూదేవిని పిండి వారికి కావాల్సినవి అందుకున్నారు.*


*నిష్క్రమించారక్కణ్ణుంచి. అప్పటి నుంచీ భూదేవిని కన్నకూతురులా ప్రేమగా చూడసాగాడు పృథువు. ఎగుడు దిగుళ్ళన్నీ సమం చేశాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*


*ఓం నమో.భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: