☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(24వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ధ్రువ నక్షత్రం*, *పృథు చక్రవర్తి కథనం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*ధ్రువుడికి యుక్తవయసు రాగానే అతనికి రాజ్యాన్ని అప్పగించి, తపోవనాలకు తరలిపోయాడు తండ్రి. ద్రువుడు భ్రమిని వివాహమాడాడు. ఆమె శిశుమారుడు కుమార్తె. వాయుపుత్రి ఇలను కూడా వివాహమాడాడతను*.
*ఉత్తముడు, హిమవత్పర్వత ప్రాంతానికి వేటకి వెళ్ళి, అక్కడ యక్షులతో పోరాడి మరణించాడు.*
*ఎంతకీ తిరిగి రాని కుమారుణ్ణి వెదుకుతూ సురుచి బయల్దేరింది. కుమారుణ్ణి వెదుకుతూ వెదుకుతూ మరణించిందామె.*
*సవతితల్లీ, తమ్ముడూ మరణించడంతో అందుకు కారణమయిన యక్షుల మీద కోపగించాడు ద్రువుడు. వారి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఒకొక్కరినీ సంహరించసాగాడు. తరిగిపోతున్న యక్ష సంతతి మీద జాలి చెందాడు స్వాయంభువమనువు. తాతగా అతను ద్రువుణ్ణి వారించాడు. హింస తగదని, యుద్ధం మానమన్నాడు.*
*మానాడు ద్రువుడు. కుబేరుడితో స్నేహం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు.*
*అరవై ఆరువేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. రాజభోగాలన్నీ అనుభవించాడు. మరిక భౌతికంగా అనుభవించేదీ ఆశించేదీ లేక రాజ్యాన్ని త్యజించాడు ద్రువుడు. బదరీవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ మందాకినిలో స్నానం చేసి, హరిని ధ్యానిస్తూ సమాధివిష్టుడయినాడు. కొన్నాళ్ళు గడిచింది. భౌతికదేహాన్ని త్యజించే సమయం ఆసన్నమయింది.*
*విష్ణుదూతలు దివ్య విమానాన్ని వెంటబెట్టుకుని రావడంతో భౌతికదేహాన్ని త్యజించి, జ్యోతిర్మయమయిన దివ్య రూపాన్ని ధరించాడు ద్రువుడు. విమానాన్ని అధిరోహించాడు. సమస్త దేవతలూ, మునులూ కీర్తించగా ముల్లోకాలనూ, గ్రహమండలాన్నీ, సప్తర్షుల స్థానాన్నీ అతిక్రమించి, ఉత్తర దిక్కున అన్నిటికంటే ఎత్తున ఉండే సత్యమూ నిత్యమయిన ద్రువపదం చేరుకున్నాడు.*
*స్వయం ప్రకాశిగా వెలుగొందుతూ అక్కడే స్థిరనివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ క్షణం దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వగానం వినిపించింది.*
*ఆసరికే అతని తల్లి సునీతి స్వర్గాన్ని అలంకరించింది.*
*ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి ఎగువున మహోన్నత స్థానంలో ద్రువనక్షత్రం అందరికీ కనిపిస్తూ నేటికీ కను విందు చేస్తున్న సంగతి తెలిసిందే! శుభప్రదమయిన ఈ నక్షత్రాన్ని నూతన వధూవరులకు చూపడం సంప్రదాయంగా వస్తోంది. అయితే గొప్ప కీడు మూడునున్నవాడికీ, అంత్యకాలం సమీపించేవాడికీ ద్రువనక్షత్రం కనిపించదంటారు ఆర్యులు.*
*పృథు చక్రవర్తి చరిత్ర*
*ద్రువుని అనంతరం ఆ వంశంలో చెప్పుకోదగినవాడు పృథు చక్రవర్తి. ఆయన చరిత్ర తెలుసుకుందాం.*
*ధ్రువుని వంశంలో జన్మించిన ‘అంగుడు’ అనే పేరుగల రాజుకు చాలా కాలం వరకు సంతతి కలగలేదు. యజ్ఞ పురుషుడైన వెన్ను (విష్ణువు)ని ఆరాధించగా ఆ రాజచంద్రునికి ‘వేనుడు’ అనే కుమారుడు కలిగాడు. కాని వాడు అన్ని విధాల అత్యంత హీనుడయ్యాడు*
*ఆ వేనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ప్రజలు అనేక విధాల బాధలు అనుభవించారు. మునులనూ, బ్రాహ్మణులనూ నానా విధాల వేధించాడు వేనుడు. యజ్ఞ యాగాదులు లేకుండా చేశాడు. దానధర్మాల జోలికి పోలేదు. దాంతో భూమి మీద అన్యాయం, అధర్మం ప్రబలిపోయాయి. రాజ్యం అతలాకుతలమయింది. అది తట్టుకోలేని మునులంతా వేనుణ్ణి సమీపించారు. ధర్మాని ఉద్ధరించమని ప్రార్థించారు. వారి ప్రార్థనను పట్టించుకోలేదు వేనుడు. పెడ చెవిన పెట్టాడు. మునులకు కోపం వచ్చింది. శపించారతన్ని. శాపకారణంగా వేనుడు మృతి చెందాడు. అతనికి పుత్రసంతానం లేని కారణంగా రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. రాజు లేని రాజ్యంలో ధర్మాలన్నీ మరింతగా తలకిందులయ్యాయి. వాటిని అరికట్టేందుకు రాజుని సృజించాలనుకున్నారు మునులు.*
*వేనుడి మృతదేహాన్ని తీసుకుని, అతని తొడని మథించారు. అప్పుడు అందులోంచి బాహుకుడు పుట్టుకొచ్చాడు. చాలా వికృతంగా కనిపించాడతను. రాజయ్యే లక్షణాలు లేవతనిలో. నిషాదులకు మూల పురుషుడుగా మిగిలిపోయాడు.*
*ఈసారి వేనుని బాహువులు మథించారు మునులు. అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడూ ఉద్భవించారు. ఇద్దరూ భగవదంశతో జన్మించిన వారే! ఆ పురుషుడే పృథువు.*
*శ్రీమన్నారాయుణుని అంశతో జన్మించిన పృథువు, సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో జన్మించిన స్త్రీని, ‘అర్చి’ని వివాహమాడాడు.*
*ఆనాడు ఆ వివాహం మునులకూ, దేవతలకూ, సర్వులకూ కనుల పండువయింది. సంతోషించారంతా.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి