☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(27వ రోజు)*
*(నిన్నటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*సప్త సముద్రాల సృష్టికర్త ప్రియవతుడు*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*వర్షాలు కురిశాయి. పంటలు పండాయి. గ్రామాలు, పట్టణాలూ కళకళ్ళాడాయి. ఏ కొరతా లేకపోయింది ప్రజలకి. ధర్మపాలన చేశాడు పృథువు. సరస్వతినది గల బ్రహ్మవర్తం అనే సిద్ధక్షేత్రంలో నూరు అశ్వమేధయాగాలు చేసేందుకు సిద్ధపడ్డాడు పృథువు. తొంభైతొమ్మిది జయప్రదంగా ముగించాడు. సమస్త దేవతలనూ తృప్తిపరిచాడు.*
*నూరవయాగం చేస్తుండగా దేవేంద్రునికి భయం పట్టుకుంది. నూరవయాగం పూర్తయితే పృథువు తనని మించిపోతాడనీ, స్వర్గాధిపత్యం పొందుతాడనీ తెలుసుకుని, ఆ యాగాన్ని విఘ్నం చేసేందుకు ప్రయత్నించాడు. యాగాశ్వాన్ని అపహరించాడు. కనిపెట్టారది అత్రి మొదలయిన మహామునులు. పృథు చక్రవర్తి చేత అభిచార హోమం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ హోమం చేస్తే యాగాశ్వంతో పాటుగా ఇంద్రుడు బయటపడక తప్పదు. అప్పుడతనికి శిక్ష తప్పదు.*
*దాన్ని వారించేందుకు బ్రహ్మ కల్పించుకున్నాడు. హోమాన్ని మాన్పించాడు. పృథు చక్రవర్తికి హితబోధ చేశాడిలా. ‘‘మహారాజా! నువ్విప్పటికి తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేశావు, చాలు. నూరవయాగం చేయనవసరం లేదు, అది చేయకుండానే ఇంద్రుడంతటి వాడవయ్యావు.’’*
*విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. పృథువుకి తత్త్వబోధ చేశాడు. మహామునులు సనకాదులు ప్రత్యక్షమయ్యారు. మోక్షప్రాప్తికి కావాల్సిన తత్త్వాన్ని ఉపదేశించారు.*
*వెళ్ళిపోయారక్కణ్ణుంచి. మునులు, బ్రహ్మ,విష్ణువు ఉపదేశించిన మార్గాలలో ప్రయాణిస్తూ పృథువు చాలా సంవత్సరాలు ప్రజలకు ఎలాంటి కొరతా లేకుండా ధర్మపాలన చేశాడు. తర్వాత రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసి భగవంతునిలో ఐక్యం అయ్యాడు. అతని భార్య అర్చి, అగ్నిప్రవేశం చేసి భర్తని చేరుకుంది.*
*ప్రియవ్రతుడు :~*
*పృథు చక్రవర్తి తర్వాత అతనిలా పేరు ప్రఖ్యాతులు పొందిన వాడు ప్రియవ్రతుడు. ఇతను స్వయంభువ మనువు కుమారుడు. ఉత్తానపాదుని సోదరుడు. నారదమహాముని ఉపదేశంతో ఆత్మజ్ఞానాన్ని పొంది, అడవులను ఆశ్రయించాడు ప్రియవ్రతుడు. తపస్సు చేసుకుని తనువు చాలిద్దామనుకున్నాడు. అందుకు బ్రహ్మ ఒప్పుకోలేదు. గృహస్థాశ్రమం స్వీకరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాబద్ధుడై ప్రియవ్రతుడు వెనక్కి తిరిగి వచ్చాడు. చాలా సంవత్సరాలు భూమిని పాలించాడు. భగవంతుని అంశతో జన్మించిన ప్రియవ్రతుడు, విశ్వకర్ముని కుమార్తె బర్హిష్మతిని పెళ్ళాడాడు. వారిద్దరికీ ఆగ్నీఽద్రుడు, కవి, మేధాతిథి మొదలయిన పదిమంది కుమారులు జన్మించారు. ఊర్జస్వతి అని కుమార్తె కూడా కలిగింది. కుమారులలో ముగ్గురు చిన్నతనంలోనే సన్యసించి, జ్ఞానులయినారు.*
*శుక్రుణ్ణి పెళ్ళాడింది ఊర్జస్వతి. వారి కుమార్తె దేవయాని. మరొక భార్య వల్ల ప్రియవ్రతుడికి ఉత్తముడు, తామసుడు, రైవతుడు జన్మించారు. ఈ ముగ్గురూ మన్వంతరాధిపతులయినారు.*
*భగవంతుని ఉపాసించి, ప్రియవ్రతుడు గొప్ప శక్తిసామర్థ్యాలు సాధించాడు. అద్భుతమయిన సిద్ధులు కూడా పొందాడు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉన్న కారణంగా భూమండలం సగభాగం వెలుతురు తోనూ, మిగిలిన సగభాగం చీకటితోనూ ఉంటూ వచ్చాయి. పగలూ రాత్రీ ఆ విధంగా ఏర్పడ్డాయి. సూర్యప్రకాశం లేని భూభాగంలో కూడా వెలుతురు వచ్చేటట్టు చేయాలని సంకల్పించుకున్నాడు ప్రియవ్రతుడు.*
*సూర్యరథంలో సమానమయిన రథాన్ని సంపాదించాడు. ఆ రథాన్ని అధిరోహించి, సూర్యునిలా వెలిగిపోతూ, సూర్యుడు మేరు పర్వతానికి ఉత్తరాన ఉన్నప్పుడు తాను దక్షిణాన ఉంటూ, సూర్యుడు దక్షిణాన ఉన్నప్పుడు తాను ఉత్తరాన ఉంటూ అంతటా వెలుతురు నింపాడు. సూర్యుని అనుసరించి ఏడుసార్లు తిరిగాడలా. అప్పుడు అతని రథచక్రాల తాకిడితో ఏడు సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ ఏడు సముద్రాల కారణంగానే భూమి జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కరము అని ఏడు ద్వీపాలయింది. ఈ ఏడు ద్వీపాలకూ తన ఏడుగురు కుమారులనూ రాజుల్ని చేశాడు ప్రియవ్రతుడు.*
*భరతవర్షం జంబూద్వీపంలో ఉంది. నదులు, పర్వతాలు, అరణ్యాలు మొదలయిన వాటివల్ల సాంకర్యం కలుగకుండా ప్రతి ద్వీపంలోనూ భూమిని విభాగించి, ఎల్లలు ఏర్పరిచాడు ప్రియవ్రతడు. పదకొండు కోట్ల సంవత్సరాలు పాలించాడు. తర్వాత బ్రహ్మ ఆజ్ఞతో గంధమాదనపర్వతంపై తపస్సు చేసి, తనువు చాలించాడు. భగవంతునిలో ఐక్యం చెందాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం)*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి