22, జనవరి 2025, బుధవారం

మహాభారతం

 🙏మహాభారతం - శాంతి పర్వం 🙏

                   ఆరవ భాగం 

అందరు దయచేసి శాంతి పర్వం చదవాలి. చిత్త శాంతి లభించాలంటే శాంతి పర్వం మించినది లేదు కథా విషయంలోకి వెడదాము.

వ్యాసుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. " ధర్మజా ! పూర్వం సేనజిత్తు మహారాజుకు పుత్రశోకం కలిగింది. అయినా శోకించలేదు. అతడు నీమాదిరి శోకించక తనకు తానే ఆశోకమును పోగొట్టుకున్నాడు. అతడు పలికిన పలికులు విను " ఈ లోకంలో కొందరు ఇతరులను బాధపెడతారు. మరి కొందరు ఇతరుల చేత బాధను అనుభవిస్తారు. ఇవన్నీ పూర్వజన్మ కర్మలఫలితం కాలమహిమ అనుకోవాలి కాని ఎవరో మనలను బాధిస్తున్నారని చింతించి వాటివలన సుఖం, దుఃఖం పొంద కూడదు. ధనం, భార్య, బంధువులు పోయారని చింతించుట అవివేకం. మనం దుఃఖించినందున బాధలు తొలిగి పోతాయా ! మనకు కలిగే శోకముకు భయముకు ఎన్నో కారణాలు ఉంటాయి. అన్నీ తెలిసిన వాడు శోకముకు భయముకు తలవంచడు. మూర్ఖుడైన వాడు వాటిని తలచుకుని దుఃఖిస్తుంటాడు. సుఖదుఃఖాలు శాశ్వతములు కావు కనుక వాటిని చూసి పొంగుట, కుంగుట తగదు. ఏమీ తెలియని వాడు, అన్నీ తెలిసిన వాడు సుఖ దుఃఖములకు చింతించడు. తెలిసీతెలియని వాడు మాత్రమే సుఖములకు పొంగి దుఃఖములకు కుంగి పోతాడు " అని చెప్పాడు సేన జిత్తు మహారాజు. ఆ మాటలు నీకూ వర్తించి నీ దుఃఖాన్ని పోగొడతాయి ధర్మరాజా ! వర్ణాశ్రమ ధర్మములు ఆచరించి దండనీతిని అమలు చేస్తూరాజ్యమును పాలించుట క్షత్రియ ధర్మం. చనిపోయిన తరువాత కూడా ఎవరిని గురించి ప్రజలు తలచుకుంటారో వాడే సత్పురుషుడు. కనుక క్షత్రియ ధర్మమైన రాజ్యపాలన క్షత్రియుడవైన నీవు చేపట్టు " అని పలికాడు.


వ్యాసుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు వికల మనస్కుడై " మహర్షీ ! ఎన్ని చెప్పినా ద్రౌపదేయులనూ, అభిమన్యుడిని, కర్ణుడిని, విరాటుడిని, ధృష్టకేతుని మరువలేకున్నాను. నాకు మనశ్శాంతి లేకున్నది. మునీంద్రా ! నేను ఎంతటి పాపాత్ముడనంటే చిన్నతనంలో మమ్ము చేరదీసి, ఆదరించి, తొడమీద కూర్చుండ చేసి అన్నం తినిపించిన తాత భీష్ముడిని చంపాను, అర్జునుడు వేసిన బాణములు శరీరం అంతా గుచ్చుకుంటూ ఉంటే భీష్ముడు శిఖండి వైపు చూసిన చూపు నేను మరువ లేకున్నాను. పరశురాముని శిష్యుని అంతటి మహాత్ముడిని ఈ తుచ్ఛరాజ్యము కొరకు ఇలాంటి దుర్మరణం పాలు చెయ్యడం నాకు కడుదుఃఖాన్ని కలిగిస్తుంది. విద్య చెప్పిన గురువు నేను అసత్యం పలకనని నమ్మి నన్ను అడిగినపుడు అసత్యం పలికి అతడి మరణానికి కారకుడిని అయ్యాను. గురువు నమ్మకాన్ని వమ్ము చేసి నేను గురుద్రోహిని అయ్యాను. నేను ఎంతటి పాపాత్ముడను గురువును చంపిన వాడికి ఏమి శిక్ష విధించాలో నాకు మీరే చెప్పాలి మహాత్మా ! నా అన్నయ్య కర్ణుడు స్వంత అన్నను చంపి రాజ్యమును నేను ఎలా ఏలగలను. అది నాకు ఎటుల ఆనందాన్ని ఇవ్వగలదు. భగభగ మండే అగ్నివంటి పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన నేను ఎంతటి క్రూరాత్ముడను. సుభద్రార్జునులు కనుక నా కౄరత్వాన్ని సహించారు. ఇంకొకరెవరైనా నన్ను నరికిపారవేయరా ! పసివాడిని అగ్నిగుండలో వేసినవాడికి రాజ్యం పాలించే అర్హత ఎక్కడిది? కడుపున పుట్టిన అయిదుగురు పుత్రులను పోగొట్టుకున్న ద్రౌపది దుఃఖాన్ని నేను ఎట్లు పోగొట్టగలను ? దీనికంతట్కీ కారణమైన నన్ను ప్రాయోపవేశం చేసి మరణం కొరకు ఎదురు చూడనివ్వండి " అన్నాడు.


ధర్మజుడు మాటలు విని వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియుడవైన నీకు ఈ బేలతనం తగదయ్యా ! ఎన్ని చెప్పినా నీ శోకం తీరలేదు. ఈ సారి నీవు నీ బాధలు మరచి మనసుపెట్టి నా మాటలు విను. ఈ లోకమంతా ద్వంద్వములతో నిండి ఉన్నది వృద్ధి చెందడం నశించడంకొరకే, పుట్టడం మరణించడానికే, పెరగడం తరగడం కొరకే పుట్టడం చావడం కొరకే సుఖం వెటనే దుఃఖం ఉంటుంది. మితృలంతా మంచి చేస్తారని, శత్రువులు మాత్రమే కీడు చేస్తారని, మంచి వారికే ధనం ప్రాప్తిస్తుందని, ధనంతోనే సౌఖ్యం వస్తుందని అను కోవడం పొరబాటు. అలా అనుకోవడం బ్రహ్మరాతను ధిక్కరించడమే ఔతుంది. విధాత నిన్ను ఎందుకు పుట్టించాడో నీవు ఆ కర్మను నిర్వర్తించాలి. నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తానని అనడం కుదరనిపని.


వ్యాసుడు పూర్వం తనమాటలను పొడిగిస్తూ " పూర్వం విదేహమహారాజుకు బంధువియోగం కలిగింది. అయనకు అప్పటికి పరిపూర్ణజ్ఞానం కలుగలేదు. అందువలన ఆయన అత్యంతశోఖం అనుభవించి ఇల్లువిడిచి పోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతడివద్దకు అశ్మకుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. జనకుడు అతడికి అతిధిసత్కారాలు చేసి " విప్రోత్తమా ! మానవునకు సంపద కలిగినప్పుడు బంధువులు ఉన్నప్పుడు కలిగే ఆనందం, అహంకారం, మదము సంపద పోయినప్పుడు కలిగే దుఃఖముకు కారణమేమిటి ? " అని ఆడిగాడు అందుకు ఆ బ్రాహ్మణుడు " ఈ విధంగా చెప్పాడు " జనకమహారాజా ! సంసారం అన్న తరువాత సుఖందుఃఖం సహజం. అవి మానవుడి మనస్సును చెదరగొడతాయి. ఈ లోకంలో ఎక్కువ సుఖంకాని ఎక్కువ దుఃఖంకానీ ఎవరికీ ఉండదు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ భూమిసమస్తం ఏలే చక్రవర్తికి కూడా వార్ధక్యం, మరణం సహజమే వాటిని ఎవరికీ ఆపకలిగే శక్తి లేదు. జీవితంలో ఏదిజరిగినా బుద్ధి చెదరనీయక అది తన ప్రాప్తమని అనుకోవడం విజ్ఞులలక్షణం. కాలం వలన ప్రతిమనిషికీ ఆహారం, భోగములు, మంచి పడక, మంచి ఆసనములు అన్నీ కాలగమనం వలన కలుగుతుంటాయి తిరిగి పోతుంటాయి. కనుక ఉన్నప్పుడు పొంగడం లేనప్పుడు కుంగడం విజ్ఞులలక్షణం కాదు. కనుక వాటియందు విపరీతకాంక్ష పెంచుకోవడం తగదు. వైద్యులు చక్కగా అభ్యసించి రోగికి మందులు ఎన్నిచ్చినా అన్నీ రోగములు తగ్గవు కదా ! వైద్యులకూ రోగములు రావడం సహజమే ! కనుక అంతా విధిరాతప్రకారం జరుగుతుంది. మానవప్రయత్నం చేయడం మన విద్యుక్ధర్మం. ధనవంతుల ఇంట పుట్టడం, యోగుల ఇంట పుట్టడం, అందచందాలు కలిగి ఉండడం, బలవంతులు అవడం, అదృష్టవంతులు అవడం, భోగాలు అనుభవించడం అన్ని పూర్వ జన్మ పుణ్యఫలం. పూటగడవని దరిద్రుడికి తామరతంపరగా పిల్లలు పుడతారు. కాని అత్యంత ధనవంతునికి ఎన్ని వ్రతాలు చేసినా సంతానభాగ్యం కలుగదు. పేదవాడు ఏదితిన్నా అరాయించుకుంటాడు. ధనవంతుడికి పట్టెడన్నంకూడా అరగదు. పరస్త్రీవ్యామోహం, జూదం, సురాపానం, జంతువులను వేటాడడం పెద్దలు నిర్ణయించారు. కాని లోకులనేకులు ఆ మార్గమున పోయి భ్రష్టులవడం దైవసంకల్పములే కాని మరేది కాదు. ఇష్టం అయిష్టములకు కారణం కనుక్కోవడం కష్టం. భార్యాబిడ్డలు నదిలో కొట్టుకు పోతున్న కట్టెలమాదిరి కలిసి విడిపోతూ ఉంటాయి. మానవులు తాను ఎన్నో జన్మలు ఎత్తి ఎందరో తల్లులను, తండ్రులను, పుత్రులను, పుత్రికలను, బందువులను, మిత్రులను పొందుతాడు. ఇన్నివేల మందిలో మానవుడు ఎవరికొరకు ఏడవగలడు ! ఈ జీవితం శాశ్వతం కాదని తెలుసుకొనుట వివేకులలక్షణం. నిరంతర కాలప్రవాహం ఒక సముద్రంలాంటిది. అందు మొసళ్ళు సంచరిస్తుంటాయి కనుక చావు పుట్టులకు అనివార్యం. అని తెలుసుకొని శోకం వదలాలి. జనక మహారాజా ! ఈ శరీరమే మనం అప్పు తెచ్చుకున్నాము. ఇంక దారాసుతులు, బంధుమిత్రులు శాశ్వతమా ! ఎంత ఏడ్చినా చచ్చినవాడు తిరిగి రాడు కదా ! వారికొరకు శోకించిన తీరనిబాధ అనుభవించడం తప్ప మిగిలేది ఏమిటి ? కనుక జనకమహారాజా ! బంధుమిత్రుల శోకమును వదిలి నీ విద్యుక్ధర్మమైన రాజ్యపాలన చేసి కీర్తి ప్రతిష్టలు పొందు " అన్నాడు. అశ్మకుడి మాటలతో జనకునికి జ్ఞానోదయం కలిగింది. ఆయన ఇల్లువదిలి పోవాలన్న భావనను వదిలి రాజ్యపాలన చేపట్టాడు. కనుక ధర్మరాజా ! నీవు కూడా క్షత్రియధర్మంగా రాజ్యపాలన చెయ్యి " అన్నాడు.

చెప్పిన మాటలకు ధర్మరాజు బదులు చెప్పకపోవడం చూసిన అర్జునుడు పక్కనే ఉన్న శ్రీకృష్ణుడితో " కృష్ణా ! అనేకంగా బంధువులను, కుమారులు, అన్నదమ్ములు ఒకేసారి యుద్ధంలోమరణించడంవలన ధర్మజుడి మనసు వికలమైఉంది. నీ అమృతవచనములతో అతడికి ఊరటకలిగించు " అని అర్ధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దకు పోయి అతడి చేతులు పట్టుకుని అనునయిస్తూ " బావా ధర్మజా ! నీ కెందుకయ్యా ఈ మనోవేదన. నీ బంధుమిత్రులు అవక్రపరాక్రమంతో పారాడి మరణించి వీరస్వర్గం అలంకరించారు. రాజరికం ఒకకల. రాజులు మాత్రం కాదు ఏ ఒక్కరూ పూర్ణాయుర్ధాయంతో ఉండరు. పూర్వం సంవర్తనుడు అనే మహాముని ఉండే వాడు. అతడికి దేవగురువు బృహస్పతి అంటే అసూయ ఎక్కువ. అతడు హిమాలయ పర్వతప్రాంతంలో ఉన్న మరుత్తు చేత ఎన్నో యజ్ఞ యాగాదులు చేయించాడు. కాని ఆ మరుత్తు కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. సుహోత్రుడు అనే మహారాజు అశ్వమేధము మున్నగు అనేక యజ్ఞములు చేసాడు. కాని అతడు కూడా కాలగర్భంలో కలిసి పోయాడు. అలాగే అనేక దానధర్మాలు చేసిన అంగుడు ఎందరికో వివాహాది సత్కార్యములు చేసి కూడా కాలధర్మం చేయక తప్పలేదు. ఏడు ద్వీపములలో తన రథమును నడిపించిన శిబిచక్రవర్తి కూడా మరణించి ఉత్తమ గతులుపొందక తప్పలేదు. అదే విధంగా దశరథపుత్రుడైన శ్రీరాముడు, భగీరధుడు , దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతి దేవుడు, భరతుడు, పృధుచక్రవర్తి వీరందరూ ఈ భూమిని ఏలిన చక్రవర్తులు. ఎన్నో యజ్ఞ యాదులు చేసిన వీరంతా శాశ్వతంగా జీవించ లేదు. అదే విధంగా 21 మార్లు దండ యాత్రర చేసి రాజులనుసంహరించి ఆ భూమిని అంతటినీ కశ్యపప్రజాపతికి దానంగా ఇచ్చిన జమదగ్ని పుత్రుడైన పరశురాముడు ఈ భూమి మీద శాశ్వతత్వం పొందలేదు. ఇవన్నీ నీవు అభిమన్యుడి మరణ సమయంలో శోకతప్తుడవై ఉన్నప్పుఇడు నారదుడి వలన విన్నావు. కాని అవివేకమును మానలేక ఉన్నావు " అన్నాడు.

               సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: