మహానుభావుల బాట - శ్రీ చాగంటి వారి మాట
శ్రీ రామదాసు గారు
ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి అన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...
పూజ్య గురువులు అనేక ప్రవచనములలో శ్రీ రామదాసు గారి యొక్క భక్తి గురించి ప్రస్తుతించిన విశేషములు...శ్రీ రామదాసు గారి జయంతి సందర్భముగా...
మహానుభావుడు పరమ భాగవతోత్తముడు కంచర్ల గోపన్నగారు. ఆయనను రామదాసు గారు అంటూ ఉంటాము. ఆయన జీవితములో చాలా గొప్ప విశేషము - కష్టము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము సుఖము వచ్చినా ఈశ్వరుడుతోనే చెప్పుకోవడము. ఏది వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము. లౌకికముగా పైకి మాట్లాడరు. ఏదైనా మాట్లాడటము ఏదైనా సంతోషము వస్తే చెప్పుకోవడము బాధ వస్తే మాట్లాడటము అన్నీ సర్వేశ్వరుడికే చెప్పుకోవడము. జ్వరము వచ్చినా ఏమిటో ఈశ్వరా! జ్వరముగా ఉన్నది, కాలు చాలా నెప్పిగా ఉన్నది అని ఏదైనా ఈశ్వరుడుకి చెప్పడము అలవాటు అయితే ప్రాణోత్క్రమణము అవుతున్నా ఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటు అవుతుంది. ఊపిరి అందటము లేదు అని ఈశ్వరునికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన ఏది చెప్పుకున్నా రామచంద్ర ప్రభువుకే చెప్పుకున్నారు. ఒకరోజు ఆయన ఏడుస్తూ పాడుకున్నారు -
నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జననీ జానకమ్మా
ఆయన ఆ బాధలు ఓర్వలేక సీతమ్మ తల్లిని అమ్మా ఇంత కష్ట పడుతున్నాను కాపాడమని చెప్పమ్మా అంటే తట్టుకోలేక పోయింది. ఆవిడ వెళ్ళి - అంత భక్తి తత్పరుడు కష్టపడి ఆలయము కట్టించాడు అటువంటి వాడిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు, ఆయన చేసిన అపరాధము ఏమీ లేదని, రామదాసు గారిని ఎందుకు రక్షించి బయటికి తీసుకుని రారు అని శ్రీ రాముడిని అడిగింది. రాముడు - సీతా నాకు కూడా రామదాసు కష్టములు చూసి గుండెలు అవిసి పోతున్నాయి. కానీ లోకములో వేదము చెప్పిన శాసనము ఒకటి ఉన్నది. గతజన్మలో ఉండగా ఒక చిలుకను తీసుకుని వెళ్ళి తొమ్మిది సం|| పాటు పంజరములో పెట్టి బాధ పెట్టాడు. పంజరములో ఆ చిలుక ఎన్ని బాధలు పడిందో అవి ఈ జన్మలో శరీరముతో తీర్చేసుకోవాలి. ఎప్పుడు పూర్తి అవుతుందా కనపడదామని నేను కూడా అగ్గగ్గ లాడిపోతున్నాను. కానీ రామదాసు గారి కన్నా ముందుగా నాదర్శనమును ముందుగా తానీషా పొందుతాడు అంటే, అదేమిటి? మిమ్ములను ఇంతగా సేవించి పూజించి గుడి కట్టిన వాడు రామదాసు. ఆయనని బంధించిన వాడు తానీషా. అటువంటి తానీషాకు రామదాసుకన్నా ముందు దర్శనమా? ఎందుకు ఇస్తారు అని అడిగింది.
రామచంద్రమూర్తి దానికి కారణము చెపుతూ గత జన్మలో పరమ శివ భక్తుడైన ఒక వ్యక్తి శివా! నిన్ను సాకారముగా చూడాలని ఉన్నది. పరమ నియమముతో నిన్ను 365 రోజులు రుద్రమును స్వరము తప్పకుండా చెపుతూ గంగా జలములతో అభిషేకము చేస్తాను. నువ్వు దర్శనము ఇవ్వమని అడిగాడు. రోజులు తప్పు లెక్క పెట్టుకుని సం|| నకు ఒక రోజు తక్కువ పూజ చేసి దర్శనము అవలేదని కోపము వచ్చి బిందె తీసి శివలింగమునకు వేసి కొట్టి శివలింగమును బద్దలు కొట్టాడు. అప్పుడు నువ్వు నియమము తప్పి, నన్ను నింద చేసి బిందె పెట్టి కొట్టావు కాబట్టి వచ్చే జన్మలో వేద ప్రమాణము అంగీకరి0చని సిద్ధాంతము ఉన్నచోట జన్మించెదవు కాక అన్నాను. అతను నన్ను ప్రార్ధన చేసాడు శివా ! ఇంత కష్టపడి 364 రోజులు అభిషేకము చేసాను. ఒక్క రోజు తక్కువ అయినందుకు ఇంత శిక్షా అంటే, నువ్వు చేసిన అభిషేకమునకు కూడా ఫలితము ఉంటుంది. శివుడనైన నేను రామభక్తుడైన రామదాసు కన్నా రాముడిగా మొదటి దర్శనము నీకే ఇస్తాను అని వరమిచ్చాను. అందుకని మొదటి దర్శనము తానీషాకి ఇవ్వాలి. ఆయన కోటకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రభువు అంత ఎత్తులో కూర్చుని కనపడుతూనే ఉంటాడు. ఎవరైనా ఆయనకి ఆపద కలిగించాలి అనుకుని ధనస్సుకి బాణము సంధించి విడచి పెట్టినా, కత్తి విసిరినా ఆయనక తగలదు. మధ్యలో దేనికో తగిలి పడిపోతుంది. ఎందుకనగా అది వెళ్ళడానికి వీలు లేకుండా ప్రాకారములు అడ్డు ఉంటాయి. ఆ రోజులలో అంత చిత్ర విచిత్రమైన శిల్పకళా నైపుణ్యముతో కట్టారు. తానీషా రాత్రి నిద్రపోతే పన్నెండు ప్రహారములు దాటితే తప్ప ఆయన నిద్రపోతున్న గదిలోకి వెళ్ళడము సాధ్యము కాదు. ఆయన భార్యతో కలసి ఏకశయ్యా గతుడై గాఢ నిద్రలో ఉండగా రామచంద్రమూర్తి భక్తుడైన రామదాసు గారిని రక్షించుకోవాలి అనుకున్నారు. ఆయన తలచుకుంటే కష్టము ఏమి ఉన్నది? రాజకుమారుల వేషము వేసుకుని గుఱ్ఱముల మీద ప్రహరాలు దాటి తానీషా పడుకున్నగదిలోకి వెళ్ళారు. తానీషా ఉలిక్కి పడి లేచాడు. భద్రాచల వృత్తాంతములో ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అనగా నిద్ర లేచిన ప్రభువు ఎవరు నువ్వు? అనలేదు. ఎవరక్కడ? అని గంట కొట్టలేదు. ఎదురుగా ఉన్న రాజకుమారుల అందమును చూసి ఏమి అందము ఎవరు వీళ్ళు అని చూస్తూ అలా ఉండిపోయాడు. అది పరమేశ్వరుని దర్శనము అంటే ! ఆ స్థితిలో కన్నుల నీరే కానీ నోట మాట ఉండదు. రాముడే మాట్లాడారు. మేము రామదాసు గారి దాసులము, ఆయన సేవకులము అన్నారు.. అది భద్రాచల క్షేత్రము యొక్క వైభవము. భద్రాచలములో రామదాసు గారు అంటాము. రామదాసు గారు రాముడికి దాసుడు కాదు, రాముడు రామదాసుగారికి దాసుడు! భగవంతుడిని నమ్ముకున్నవాడికి ఆయన ఎంత దాసుడైపోతాడో భద్రాచల క్షేత్రము చూపిస్తుంది.
మేము రామదాసుగారి సేవకులము ఆయన ఏ ద్రవ్యమును ఉపయోగించి ఆలయము కట్టాడని అభియోగము చేసారో ఆ వరహాలు పట్టుకుని వచ్చాము. తీసుకుని రశీదు ఇవ్వండి. రామదాసు గారిని విడిపించుకుంటాము అని అన్నారు.
ప్రభువు ఇంత రాత్రివేళ డబ్బు పట్టుకుని తిన్నగా నాదగ్గరకు రావడమేమిటి? రశీదు ఇమ్మని అనడము ఏమిటి? నిర్దానుడై చేతిలో రూపాయ కాసు లేకపోతే కదా కారాగారములో పెట్టాము. అటువంటి రామదాసు గారికి ఇన్ని లక్షల వరహాలు ఎలా వచ్చాయి. కారాగారములో ఉన్నవాడి కోసము మీరు ఇంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారు? అని తానీషా అడగ లేదు రామ దర్శనముతో అలా ఉండిపోయాడు. రామ లక్ష్మణుల దర్శనము పొందడము మాటలు కాదు. ఆనంద పారవశ్యములో ఉండిపోయి డబ్బు పుచ్చుకున్నాడు. డబ్బు ముట్టినది విడచి పెట్టమని తానీషా రశీదు వ్రాసి ఇచ్చేసాడు. రాముడు ఉన్నాడని అనడానికి రామచంద్రమూర్తి ఇచ్చిన డబ్బే సాక్ష్యము. ఆ రశీదు పట్టుకుని రామదాసు గారిని విడిపించారు. నాకు సేవకులు ఎవరు? దాసులు ఎవరు? వాళ్ళు ఇన్ని లక్షల వరహాలు పట్టుకుని వచ్చి నన్ను విడిపించడము ఏమిటి? అని ఆయన తెల్లబోయారు. వెంటనే నేను నమ్ముకున్న రామచంద్రమూర్తి వచ్చి ఉంటారు అనుకున్నారు. వారు తమ పేర్లు దాచలేదు. రామోజీ, లక్ష్మోజీ అని చెప్పారు. ఇద్దరూ రామదాసు గారిని విడిపించి తీసుకుని వచ్చారు. ప్రభువు కూడా అనేక రకములైన ఈనాములు కానుకలు ఇచ్చి దివ్యస్నానము చేయించి పట్టుబట్టలు కట్టి పల్లకీలో తీసుకుని వచ్చి భద్రాచలమునకు తాహసీల్దారు పదవిని ఇచ్చాడు. ఆయన వాడిన ఆరు లక్షల వరహాలు కూడా ఇచ్చాడు. ఆ డబ్బంతా పెట్టి రామచంద్రమూర్తికి నగలూ పాత్రలూ వైభవాలూ ఉత్సవాలు ఎన్నో చేయించారు.
వృద్దాప్యములోకి వచ్చిన తరవాత ఆయనకి శరీరము బడలిపోయి కొండ ఎక్కలేక పూజామందిరములో కూర్చుని రామా! ఎప్పటికి నిన్ను చేరుకుంటాను? ఇందులో ఉండలేక పోతున్నాను, డొల్ల బారిపోయింది అని ప్రార్ధన చేస్తే భద్రాచలమునకు శ్రీ వైకుంఠము నుంచి దివ్య విమానము వచ్చి రామదాసు గారి ఇంటి ముందు దిగింది. అందులో నించి విష్ణు పార్శదులు దిగి, లోపలి వచ్చి, అయ్యా గోపరాజు గారూ శ్రీమన్నారాయణుడు మీకోసము విమానము పంపించారు. మిమ్ములను సశరీరముగా విమానము అధిరోహించి రమ్మన్నారు అంటే విని ఆయన సంతోషముగా బయటికి వెళుతూ భార్య కమలాంబని పిలిచి కమలా వైకుంఠము నుంచి విమానము వచ్చింది వెళ్ళిపోతున్నాను నువ్వూ వస్తావా? అన్నారు. ఎప్పుడూ రామనామము చెపుతూ విమానము వచ్చింది నారాయణుడు వచ్చాడు అని అనడము అలవాటు అయినా కమలాంబ గారు ఏదో పలవరిస్తున్నారు అనుకుని అలాగే నేను పనిలో ఉన్నాను మీరు బయలుదేరండి నేను తరవాత వస్తాను అంటే మహానుభావుడు బయటికి వచ్చి విమానము ఎక్కి అందరి వంకా చూసి భద్రాచల క్షేత్రములో అందరితో రామనామము చెప్పించారు.
భండన భీముడార్త జనబాంధవుడుజ్జ్వల బాణతూణ కో
దండకలాప్రచండభుజతాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవసాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
డాండ డడాండ దాండ నినదంబులజాండము నిండ మత్తవే
దండమునెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ !
రాముడున్నాడని నాకు ఎంత నమ్మకమో తెలుసా? ఉన్నాడని చెప్పడము కాదు, నాలుగు వీధుల కూడలిలో నాలుగు స్తంభములు పాతి, మధ్యలో పెద్ద భేరి కట్టి, ఏనుగు ఎక్కి, వచ్చి ఢామ్ ఢామ్ అని భేరి మ్రోగిస్తే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎందుకు అలా మ్రోగిస్తున్నారు అని అడిగితే, నా రాముడు సాటి దైవము ఇంక లేడు! ఆయన యొక్క భుజములు శత్రువులను మర్దనము చేసేటప్పుడు తాండవము చేస్తాయి! ఎప్పుడు ధనుస్సు పట్టుకుంటాడో, ఎప్పుడు బాణము తీసి వింటి నారికి సంధిస్తాడో, ఎప్పుడు విడచి పెడతాడో తెలియదు! అటువంటి వాడు రాముడు! అని చెప్పుకున్న మహానుభావుడు రామదాసు గారు.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి