4, మే 2023, గురువారం

నృసింహావిర్భావం

 *వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున "నృసింహావిర్భావం"*

నరసింహ ఉపాసన శ్రీవేంకటేశ్వర పదసేవకు సోపానం

నరసింహ అవతారం తక్కిన అవతారాల కన్నా చాలా విశిష్టమైనది. తాను ఆర్తత్రాణపరాయణుడు, భక్త జన పరిపాలకుడు అని నిరూపించే అత్యంత అరుదైన అవతారం. తన భక్తుడు ఏవైపైతే వేలు చూపడం ఆపాడో అక్కడనుండి అవతరించి తన భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు. క్షణాలలో క్రోధాన్ని ఆవహింప చేసుకుని తమోగుణప్రధాన రూపమై తానే రుద్రుడై వచ్చాడు శ్రీహరి నరసింహస్వామీయై. అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపము. ప్రదోషకాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే కేవలం నరసింహ స్వామికి కూడా జరుగుతాయి. శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది. అటువంటి నృసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో..

ఆది శంకరులు పలుమార్లు నృసింహ స్మరణ మాత్రం చేత కాపాడబడ్డారు. ఆయన పరకాయ ప్రవేశం చేసి తిరిగి తన శరీరంలో వెళ్ళబోవు సమయంలో ఆ రాజభటులు ఆ శరీరానికి నిప్పు పెట్టి ఆహుతి చేయ్యబోగా కరావలంబ స్తోత్రం చేసి కాపాడబడ్డారు. ఒకసారి ఒక వ్యాధుడు ఆయన శిరస్సును కోరి ఆయన ధ్యానమగ్నులైనప్పుడు తల నరకబోగా ఆయన శిష్యుడు చేసిన నృసింహ స్తోత్రానికి ప్రత్యక్షమై వారిని రక్షించారు. కాశ్మీరంలో ఆయన మీద విషప్రయోగం చెయ్యగా దాన్ని విరిచి మరొక సారి కాపాడారు. ఇలా కోరిన వెంటనే రక్షించిన స్వామీ నరసింహుడు. మనకు తెలిసిన ఎందరో భక్తాగ్రేసరులు అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో ముందుగా నృసింహ ఉపాసకులై తద్వారా వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు. అన్నమయ్య ఆయన రాసిన 32 వేల సంకీర్తనలలో శ్రీ వేంకటేశుని తరువాత అంత ఆర్ద్రంగా రాసిన కీర్తనలు నృసింహుని పైనే. అసలు ఇంత అభేధ్యం వారికి ఎలా నిరూపించారో మనం శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే అర్ధమవుతుంది.

శ్రీనివాసుడు దేవతలను అందరినీ ఆయన కళ్యాణానికి పిలిచి వారందరికీ తగిన ఏర్పాట్లు చెయ్యడానికి కుబేరుని దగ్గర 14లక్షల రామముద్ర గల సువర్ణనాణములు చతుర్ముఖుడు, రుద్రుడు, అశ్వత్థవృక్ష సాక్షిగా ఋణం తీసుకుంటాడు. ఒకొక్క తీర్ధ, సరోవరాలలో వంటలు వందబడ్డాయి. బ్రహ్మదేవుడు ముందుగా దేవునికి నివేదన చెయ్యకుండా మిగిలిన వారికి ఎలా వడ్డించేది అని అడుగుతాడు శ్రీనివాసుని. కనుక ముందు నీవు ఆరగింపమని ప్రార్ధిస్తాడు. నా ఇంటి శుభకార్యానికి వచ్చిన వీరంతా అతిధులు కావున వారికి భోజనం పెట్టకుండా నేను భుజించడం ధర్మ విరుద్ధం అంటాడు. కానీ నివేదన చెయ్యని భోజనం దేవతల్, ముని, ఋషి బ్రాహ్మణులు తినరే ఎలా అని బ్రహ్మ వ్యాకుల పడగా శ్రీనివాసుడు, నేను మరొక రూపంలో నరసింహునిగా అహోబిలంలో ఉన్నాను. కనుక ముందు అక్కడ నివేదన చెయ్యమని చెబుతాడు శ్రీనివాసుడు. ఆ తరువాతే అందరికీ ఆ నైవేద్యం వడ్డించబడింది. అందుకే తిరుమలలో కూడా యోగముద్రలో ఉన్న యోగ నృసింహుడు ఆ గుడి ప్రాంగణంలో స్వామికి అభేదంగా ఉంటారు. యోగులు ఆ యోగ నృసిమ్హుని ముందు కూర్చుని ధ్యానిస్తే ఆనందనిలయంలో ఉన్న ప్రత్యక్ష శ్రీనివాసుని దర్శనం అవుతుందని పెద్దలు చెబుతారు.

అందుకే శ్రీ వేంకటేశ్వరపాదసేవలో నృసిమ్హునికి అంత ప్రాముఖ్యం. స్వామీ నైవేద్యం పుచ్చుకునేటప్పుడు భక్తులు ఈ శ్లోకం చెప్పుకోవడం కద్దు. 

“రమాబ్రహ్మాద యోదేవాః సనకాద్యాఃశుకాదయ: !

శ్రీనృసింహప్రసాదోయం సర్వే గృహ్ణ౦తు వైష్ణవా: !! “

మాతా నృసింహశ్చ పితానృసింహ:

సఖానృసింహశ్చ భ్రాతా నృసింహ

విద్యానృసింహో ద్రవిణం నృసింహ:

స్వామి నృసింహ సకలం నృసింహ


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవాక్కు

*శ్రీ నృసింహుని మహా మృత్యుంజయ మంత్రం*

ఉగ్రం వీరం మహావిష్ణుం 

జ్వలంతం సర్వతోముఖమ్‌

నృసింహం భీషణం భద్రం 

మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

కామెంట్‌లు లేవు: