4, మే 2023, గురువారం

ఆధ్యాత్మికం

 ఆధ్యాత్మికం ప్రత్యేకం..  శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం ---- కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకి 380 కిలోమీటర్ల దూరంలో కొప్పల్ సమీపంలో ఉన్న కనకగిరి పై వెలసిన ప్రసిద్ధ శిల్పకళా ఆలయం ఇది.  భగవంతుడు సర్వాంతర్యామి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ నరసింహావతారం.  హిరణ్యకశిపుని సంహారం అనంతరం నృసింహుడు సంచరించిన పలు ప్రదేశాల్లో సాకారమైన ఆలయాలలో  శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం ఒకటి.  కనక మహాముని తపస్సునకు విష్ణుమూర్తి నృసింహ అవతారంతో అనుగ్రహించి సాకారమై కొండపై వెలసిన ఆలయం కావడం వలన కనకగిరి అని, శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం అని స్థలపురాణం చెబుతోంది.  16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో యీ ఆలయం పునర్నిర్మాణం జరిగి ఎంతో కళా వైభవాన్ని  సంతరించుకుంది.  తరువాత వచ్చిన పాలకులందరూ ఈ స్వామిని పూజించి తరించారు.    మూడు రాజగోపురాలతో, పంచముఖ ద్వారాలతో శోభాయమానంగా వెలుగొందుతున్న ఆలయం ఇది.  మొత్తం ఆలయం ద్రవిడ నిర్మాణ శైలిలో శిల్పాకళా కాంతులతో అలరారుతోంది.  ఈ స్వామిని దర్శించుకుంటే అనారోగ్య సమస్యలు, ఋణ బాధల నుంచి విముక్తులవుతారని భక్తులు విశ్వసిస్తారు.  నృసింహ స్వామి ఆలయం కావడంతో మహాలక్ష్మి అమ్మవారు క్షేత్రపాలకులుగా ఉన్నారు.  నృసింహుడు, చతుర్ముఖ బ్రహ్మ, మహాశివుడు కొలువై ఉన్న ఆలయం కావడంతో త్రిమూర్తి ఆలయం అని కూడా అంటారు.  అటవీ క్షేత్రంలో వెలసిన ఈ వైష్ణవ ధామం ఆధ్యాత్మిక పెన్నిధిగా చెప్పవచ్చు.  ఆలయంలో వర్ణ రంజిత చిత్రాలు కనువిందు చేస్తాయి.  ప్రతి కట్టడంలో శిల్పకళా వైభవం చూపరులను ఆకర్షిస్తుంది.  ఏటా ఫాల్గుణ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలను చూడటానికి లక్షలాది భక్తులు తరలివస్తారు.  అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  వైశాఖ మాసంలో నృసింహ స్వామి జయంతి సందర్భంగా కూడా (రేపు.. మేం 04 - 2023) ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటారు.  కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ కనకగిరి శ్రీ కనకాచలపతి లక్ష్మీ నృసింహ ఆలయం విరాజిల్లుతోంది.  ఆ దివ్య తేజోమూర్తి సందర్శనం ఫలప్రదం క్షేమదాయకం.  ----- స్వామి (నాని)..

కామెంట్‌లు లేవు: