4, మే 2023, గురువారం

ఆర్య చాణక్య*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹


*🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 50*


"అంటే....." రాక్షసుడు వికృతంగా నొసలు ముడిచి "ఒక్క మశకావతిలోనే కాదు. సంగాల, సౌభూతి, భాగేల ఇలా అన్నిచోట్లా ఒకే రకమైన పథకం అమలు అయింది. కొంచెం అటూ ఇటుగా ఒకేi రకమైన మహత్తులు ప్రదర్శించిన యోగులు... అన్ని చోట్లా తిరుగుబాట్లు, యవనుల వూచకోత... ఒక రాజ్యంలో తిరుగుబాటు జరిగితే మరో రాజ్యం నుంచి సైన్య సహాయం వెళ్ళేది. అలాంటి అవకాశం లేకుండా, ఏకకాలంలో, అనూహ్యరీతిలో యవనుల మీద దాడి జరిగింది. ప్రతిచోటా ఒక యోగో లేదా సిద్ధుడో కనిపిస్తున్నా అందరూ ఒకే రకంగా ప్రవర్తించారు అంటే.... అందరూ కూడబలుక్కున్నట్టు తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించారంటే... వాళ్ళ వెనక... ఆ వ్యూహం వెనక... ఎవడో... ఎవడో ... ఒక మహామేధావి ఉన్నాడు. ఈ కుట్ర ... పథకం... ఆచరణ అంతా అతని మంత్రాంగమే..." అన్నాడు ధీరగంభీర స్వరంతో సాలోచనగా. 


సుకల్పనందుడు బెదిరిపోతే "ఒక్కడేనా....? మహామేధావా ? ఎవరైవుంటారు అమాత్యా....?" అని అడిగాడు బెరుకుగా. 


రాక్షసుడు తల అడ్డంగా తిప్పి "ఏమో.... ఇంకా కచ్చితంగా నా ఊహకి అందడం లేదు. కానీ... అలెగ్జాండర్ జైత్రయాత్రను విశ్లేషిస్తే ఒక్క నెత్తురు బొట్టుకూడా నేల చిందని రాజ్యం తక్షశిల.... తక్షశిలా విశ్వవిద్యాలయం మహామేధావులకు నిలయం.... ఆ విశ్వవిద్యాలయం మీద అలెగ్జాండర్ కన్ను పడింది కూడా ... కానీ ఏమైంది ? రాత్రికి రాత్రే ఆ 'మహాగ్రంథాలయం'లోని వేలాది అమూల్యమైన తాళపత్ర గ్రంధాలన్నీ రెక్కలొచ్చి ఎగిరినట్లు మాయమైపోయాయట. ఆ మాయకి కారకుడైన మహానుభావుడొకడి పేరు కర్ణాకర్ణిగా నాకు వినిపించింది. కానీ, అతడు ఆ విశ్వవిద్యాలయంలో అదే రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో మాడి మసైపోయాడని మరొక వార్త వచ్చింది. కాదూ, అతడు సజీవుడేననీ, కాశీనగరంలో అజ్ఞాత జీవితం సాగిస్తున్నాడని ఇంకొక వార్త... ఇన్ని తికమకల మధ్య వాస్తవాన్ని నేను నిర్ధారించుకోలేకపోతున్నాను" అన్నాడు సాలోచనగా. 


"ఇంత తెలిసిన మీకు ఆ మేధావి పేరు తెలియలేదా, అమాత్యా....? అడిగాడు సుబంధులవారు. రాక్షసుడు తల పంకించి ఏదో చెప్పబోయాడు. అంతలో చారుడొకడు లోపలికి వచ్చి.... 


"ప్రభువులకు ప్రణామాలు ! అమాత్యులవారికీ, రాజగురువుల వారికి వందనాలు" అంటూ నమస్కారాలు చేశాడు. 


రాక్షసుడు సాభిప్రాయంగా తలూపి "ఏం చేస్తున్నాడు, ఆ బౌద్ధ క్షిపణుడు....?" అని ప్రశ్నించాడు, సుబంధుల వారి ప్రశ్నకు సమాధానాన్ని వాయిదా వేసి. 


"అబ్బో ! ఏమి జనం ! ఏమి జనం ! ఏం మహత్తు ! ఆరేళ్లుగా పక్షవాతంతో కాళ్లుపడిపోయి మంచంలో పడున్నవాడిని మంచంతో సహా మోసుకొచ్చారు. గురువు మంత్రజలం చల్లాడు అంతే. ఆరేళ్లుగా పడున్న అరవైయేళ్ల ముసలాడు చటుక్కున లేచి చెంగున లేడిలా పరిగెత్తాడు" చెప్పాడు చారుడు ఉత్సాహంగా. 


సుకల్పనందుడు ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ... "ఆ .... !" అన్నాడు. 


"ఆ ! ఓ కుర్రాడు... పాపం పుట్టుకతో మూగ. తల్లిదండ్రులు వాడిని తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేశారు. ఆయన గాలిలో గిరగిరా చేయి తిప్పి విభూతి సృష్టించి ఆ కుర్రాడి నోట్లో వేశాడు. విభూది కోసం ' ఆ ' అని నోరు తెర్చిన ఆ కుర్రాడు 'అమ్మా.... నాన్నా....' అంటూ ఎగిరి గంతులేశాడు" ఉద్విగ్నితతో చెప్పాడు చారుడు. 


"అయితే ఆయన గొప్ప గొప్ప మహిమలు గల మహానుభావుడంటావ్ ?" హేళనగా ప్రశ్నించాడు సుబంధులవారు. 


చారుడు ఆయనవైపు చురచుర చూసి "ఆహా ! ఆయనకి భూత భవిష్యవర్తమానాలు కూడా తెలుసు. దివ్యదృష్టి ఉంది. తాను నివసిస్తున్న ఆ ఆశ్రమం ఒకప్పుడు గురుకులాశ్రమం అని చెప్పాడు" అంటుంటే ధర్మానందుడు కల్పించుకొని "అందులో విశేషమేముంది ? మన ప్రజల్లో ఎవరిని అడిగినా ఆ ఆశ్రమం ఎవరిదో చెప్తారు" అనేశాడు తేలిగ్గా. 


చారుడు ఓరగా సుబంధుల వారి వైపు చూస్తూ "అది కాదు అసలు విశేషం. ఆ రాజగురువు తండ్రికి ఎంతకాలానికీ సంతానం లేకపోతే, ఒక శూద్రస్త్రీతో సంగమించి ఆమె ద్వారా కొడుకుని కన్నాడట.... అదీ అసలు విశేషం...." అని చెప్పాడు. 


ఆ విధంగా తన జన్మ రహస్యం బట్టబయలైందని తెలియగానే రాజుగురువు సుబంధులవారి మొహం అవమానంతో నల్లబడిపోయింది. 


రాక్షసామాత్యుడు తలపంకిస్తూ "మహానందుల వారి కాలంలో రహస్యంగా జరిగిన విశేషాన్ని బయటపెట్టారంటే, ఆ బౌద్ద క్షిపణకుడు మహిమాన్వితుడే..." అంటూ ప్రశంసించాడు. 


చారుడు తలవూపి "అంతేకాదు అమాత్యా ! అతడు బ్రాహ్మణ ద్వేషి..." అని చెప్పాడు. రాక్షసుడు ఉలిక్కిపడ్డాడు. 


"అయితే మరీ మంచిది. ఆ బౌద్ధ సన్యాసిని దర్శించుకుందాం. పదండి." అంటూ తక్షణం బయలుదేరాడు. నందులతో పాటు రాక్షసామాత్యుడు, వారితో పాటు విధిలేక సుబంధులవారు బయలుదేరారు. 

(ఇంకా ఉంది)...🙏

సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

కామెంట్‌లు లేవు: