*సుఖ దుఃఖాలు- పాపపుణ్యములు*
పెద్దలు అన్నారు - సుఖ దుఃఖాలు కావడి కుండలని. అది మన అనుభవంలో సత్యంలాగ తోస్తున్నది. ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్క మనుష్యుడు సుఖ-దుఃఖాల్ని చవిచూస్తూ ఉంటాడు. ఎవ్వడూగూడ జీవితంలో కేవలం దుఃఖాన్ని గాని, కేవలం సుఖాన్ని గాని అనుభవించటం లేదు. అది దుర్లభం. రెంటినీ అనుభవిస్తూనే ఉన్నాడు. ఉండాలి కూడా. అందుకనే మహాకవి కాళిదాసు ఇలా అన్నాడు
*कस्यात्यंतं सुखमुपनतं* *दुःखमेकस्ततोवा |*
*नीचैर्गच्छत्युपरिचदशा* *चक्रनेमिक्रमेण||*
ఐతే ఇపుడు మనము ఇక్కడ విచారించదలచిన అంశం ప్రతి ఒక్కడూ ఏ సుఖదుఃఖాల్ని తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడో, అవి నిర్హేతుకములా, లేక సహేతుకములా? అంటే, ఈ సుఖ-దుఃఖాలు వాటంతట అవే, కారణం లేకుండా వచ్చి పడుచున్నవా? లేక వాటికి కారణమేమైనా ఉందా?అన్నది.
లోకంలో ఏ ఒక్క వస్తువు కారణం లేకుండగా, తనంతటతానే పుట్టటం లేదు. ఐతే ఆ కారణం ఏమిటో, కొన్నిటి విషయంలో మనకు తెలియకపోవచ్చు. మనకు తెలియనంత మాత్రాన, కారణం లేదు అనటం సాహసమే ఔతుంది. పైన, కిందా మనం చూడని లోకాలు ఎన్నో ఉన్నాయి. అంత మాత్రాన, వాటిని మనం లేవు అని అనగలమా! అంటే మనం పిచ్చివాళ్లం అని పిలిపించుకొనవలసి వస్తుంది.
ప్రతి పదార్ధము యొక్క పుట్టుకకు, దాని కారణం ఉండి తీరవలసినదే, అని అన్నపుడు, మనకు కలిగే సుఖదుఃఖాలకు కూడా ఒక కారణం ఉండాలి కదా! అది ఏమి అయి ఉంటుందనే జిజ్ఞాస కల్గుతుంది. శాస్త్రం చెప్తుంది... మన సుఖదుఃఖాలకు కారణం మనం చేసిన ధర్మాధర్మములే అని. మనం అధర్మం చేసి ఉంటే దాని ఫలితంగా దుఃఖాన్ని అనుభవిస్తాం. ఈ ధర్మాధర్మములే పాపపుణ్యములని చెప్పబడినాయి.
*पुण्योवै पुण्येन कर्मणा भवति,* *पापःपापेन*
అని శాస్త్రం వచనం. అంటే పుణ్యకర్మల నాచరించేవాడు తత్ఫలమైన సుఖాన్ని, పాపకర్మలు ఆచరించేవాడు తత్ఫలమైన దుఃఖాన్ని అనుభవిస్తాడని ఆ శ్రుతి తాత్పర్యము.
మనమంతా శాస్త్రాన్ని ప్రమాణంగా అంగీకరించే ఆస్తికులమే గాని, శాస్త్రం ప్రమాణం కాదు, మా బుద్దే ప్రమాణం,మాకు అన్నీ తెలుసు, మాకు తెలిసిందే సత్యం.. అనే నాస్తికుల కోవకు చెందిన వారము కాదు. ఆస్తికుడంటే పరలోకమును, ఈశ్వరుని పుణ్యపాపములను, స్వర్గ -నరకములను నమ్మేవాడు. ఎవనికి ఏ విధమైన విశ్వాసం లేదో వారు నాస్తికులు. మన శాస్త్రం ఈ విధంగా చెప్తున్నది. మనం ఇక్కడ అనుభవించే సుఖదుఃఖాలు, మనం పూర్వ జన్మలలో చేసిన పాపపుణ్యములు, లేక ధర్మాధర్మముల ఫలితములై యున్నవి.వాటినుంచీ ఎవ్వడూ తప్పించలేడు. అందుకే పుణ్యకర్మలు, దానధర్మాలు చేసి పుణ్యప్రాప్తి పొందుదురు గాక.
హరనమః పార్వతీ పతయే
హర హర మహాదేవ
*జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ* *మహాస్వామివారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి