2, మే 2022, సోమవారం

నేనొక శ్రామికుడిని

 "మేడే"...


నేనొక శ్రామికుడిని

వెలుగు నింపే దివిటీని


నేనొక కర్షకుడిని

పంట పండించే రైతుని


నేనొక కార్మికుడిని

ఉత్పాదక సామార్థ్యాన్ని


నేనొక శ్రమజీవిని

చెమట చిందించే మనిషిని


పని గంటలు ఎరుగని

మానవ యంత్రాన్ని..


చెమట చుక్కలు వెల్లువతో

సమాజానికి అంకితం చేస్తా

అలుపెరుగని యోధుడిగా

నిరంతరం యుద్దం చేస్తా.


గొడ్డలి చేసిన గాయాలెన్నో

పలుగు చేతిన వ్రణాలెన్నో

పనిలో పడిన బాధలెన్నో

తెగిపడిన అవయవాలెన్నో.


చిందే నా స్వేదంతో కట్టడాలు నిర్మించా...

చిమ్మచీకటి తరిమేందుకు

నా దేహం రగిలించా..

ప్రపంచానికి నేనొక సమిధనై కాలిపోతున్నా..



ఐనా! 

నేనంటే ఎందుకో అలుసు.


ఎందుకంటే నా పనికి విలువ కడతారే గాని

నా పనితనం విలువ కానరాక పోవడమే..


తాజ్ మహల్ కట్టినా

సాగర్ డ్యామ్ కట్టినా

రాళ్ళెత్తిన కూలీల మాట ఊసులేదు...

కేవలం కాసుల ఖర్చుల లెక్కలు తప్పా!.


పనిగంటలు ఎరుగని మానవ యంత్రాన్ని కావడమే నేనంటే అంత చులకనేమో!.


రాజ్యనికి వారధి నిర్మించినా

ఓటు వేసే సామాన్యులకు 

రాజ్యం ఇచ్చే పూజ్యం

"కూలీ బతుకులు".


మేము అన్నింటా ఉన్నాం

భద్రతా లేని మనుషులం

కార్మిక, కర్షక, రైతాంగం

వెలుగు చూడని జీవులం.


మనిషిలో మార్పు కోసం పోరాడుతున్నాం..


హక్కుల కోసం ఎర్రజెండా సాక్షిగా పిడికిలి బిగించి..


పోరాడితే పోయేది 

ఏమి లేదు 

బానిస సంకెళ్ళు తప్పా!

 

కష్ట జీవుల కోసం పుట్టిన రోజు "మేడే".


శుభాభినందనలు.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575.

కామెంట్‌లు లేవు: