ఈ సందేహానికి సమాధానంగా వ్యాస భగవానుడు పురాణాల గురించి ఈ విధంగా తెలియజేసాడు. సంసార బంధాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సులువైన మార్గంలో ముక్తిని ప్రసాదించ గలిగేవే ఈ పురాణములు.
వేదాధ్యయనం చేయలేని వారికి సులువైన సాధనా మార్గాన్ని ఉపదేశించేవి ఈ పురాణాలు. అజ్ఞానమనే అంధకారంలో అలమటిస్తున్న వారికి జ్ఞాన దీపాలు. భవరోగులకు మంచి ఔషధాలు , సకల సంపదలను కలుగజేసేవి ఈ పురాణాలు. నిత్య పురాణ శ్రవణం చేసేవారు సాక్షాత్తూ దేవతా స్వరుపులే. పురాణాలలోని కధలను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో అలంటి వారు " కర్మ " అనుబడే సముద్రం నుండి బయటపడి భగవంతుని సన్నిధిని పొందగలరు. నిత్యం పురాణ శ్రవణం చేయలేని బలహీనులు కనీసం ఆయా పుణ్య తిధులలో నైనా ఆ ప్రయత్నం చేయాలి. సర్వ యజ్ఞ ఫలము , సర్వ దాన ఫలము పురాణ శ్రవణం ద్వారా కలుగుతుంది. ఈ కలియుగంలో పురాణ శ్రవణం కంటే పవిత్రమైన ధర్మం మరొకటి లేదు . ఈ పురాణాలు సకల పాపాలను నివారిస్తాయి . పురాణాలను చెప్పగలిగిన వారెవరైనా సరే వారు తప్పనిసరిగా పూజనీయులు . పురాణ పాఠకులు పవిత్రాత్ములై ఉండాలి . దానము , శాంతము , దయ , అసూయా లేకుండుట మొదలైన గుణాలు వారిలో పుష్కలంగా ఉండాలి . మంచి మనుషులున్న చోట , నదీ తీరం , దేవాలయం మొదలైన పవిత్ర ప్రదేశాలలో మాత్రమే పురాణ పఠనం చేయాలి . పురాణ శ్రవణం సమయంలో మధ్యలో వెళ్ళిపోవటం , తలపాగా ధరించడం , తాంబూలం సేవిస్తూ ఉండటం మొదలైనవి చేయరాదు . పాపాలను హరించగలిగిన కధలను అపహాస్యంగా చూసేవారు నీచమైన జన్మలను పొందగలరు . ఎంతో వినయంతో పూజ్య భావంతో శ్రవణం చేయాలని , ఈ విధంగా పురాణ శ్రవణ మహిమను స్కాంద పురాణంలో తెలియజేసారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి