3, జులై 2020, శుక్రవారం

స్త్రీ

"మన అమ్మ పలురకాల చీరలు కట్టినా మనం అమ్మను ఒకేవిధంగా చూస్తాము . అమ్మకూడా తన బాధ్యతలరీత్యా ఒకరికి కూతురుగా ఒకరికి భార్యగా ,మనకు అమ్మగా, బాబాయిలకు వదినగా నానమ్మకు కోడలుగా బహురూపాలుగా విధులునిర్వర్తిస్తున్నా అమ్మమాత్రం ఒకటే." (మన బ్లాగు మిత్రులొకరు తమకు స్త్రీ మీదున్న గౌరవాన్ని ఇలా ప్రకటించారు..)

ఈ జాతిలో పుట్టిన ఏ వ్యక్తికైనా ప్రతి స్త్రీ అమ్మయే. అలా ఎలా అండీ, అందరినీ తల్లి అనుక్కున్నా భార్య భార్యే కదా తల్లి ఎలా అవుతుందీ అని అంటారా... శాస్త్రం అలానే చెప్పింది. పెళ్ళినాటి మంత్రాలలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని అడిగే కోరిక అదే. నీకు గంపెడు మంది పిల్లలు పుట్టినా నీకు చివరి కొడుకును నేనే అవ్వాలి అని. కారణం బయట ఉద్యోగం ,వ్యవసాయం చేసి పిల్లల్ని సాకి పెద్ద చేయడం వల్లనూ, అలసట వల్లనో, అహంకారం వల్లనో, ముసలివాడినయ్యాక అలిగినా, బుంగ మూతి పెట్టుకున్నా, ఓపిక లేకున్నా, నీకు గంపెడు మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసిన అనుభవమున్న కారణాన ఆ వయసులో ఏమిటీ చాదస్తం వెర్రి వేషాలు అనుక్కోక అప్పటికి ముసలివాణ్ణయిన నన్నూ నీ చిన్న కొడుకులాగా ప్రేమగా చూసుకో అని ప్రమాణ పూర్తిగా, పెద్దలముందు అడుగుతాడు. అదీ నాజాతి ’స్త్రీ మూర్తి’ కిచ్చిన గౌరవం. ఊరికే పక్క దేశాలనుంచి అరువు తెచ్చుకున్న ఎరుపుదనం, నల్లతనం, అవతలి వేపు నుంచి తెచ్చుకున్న విచ్చలవిడి స్వాతంత్ర్యంతో నోటికొచ్చినట్లు పొల్లు మాట్లాడిన జాతి కాదు నా జాతి.

’మాతృదేవోభవ’ అని చెప్పి స్త్రీ మూర్తికి మొట్టమొదటి పెద్ద పీటవేసిన వాజ్ఞ్మయం మా సొత్తు. యత్రనార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని నొక్కి వక్కాణించే ధర్మం మాది. విచ్చలవిడితనం, విశృంఖలత్వం హెచ్చు మీరిపోయి, ఇండివిడ్యుయాలిటీ పేర పెద్దలమాట వినకపోవడం, ఎదురుతిరగడం, తప్పు చేయడం గొప్ప అని చెప్పుకోవడం వంటివి ప్రచారం జరిగి నేటి యువతని వక్రమార్గాలలో నడిపిస్తున్నవి ఆవైదిక విధానాలే. మానుండి, మా పిల్లలనుండి మా సంస్కృతిని దూరం చేసి మా ధర్మం మీద కత్తిగట్టిన వారు చేస్తున్న దురాగతం.

అందరూ కలిసిమెలసి జీవించడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, కలిసి ఆడడం, కలిసి పని చేయడం, కలిసి భోజనం చేయడం, ప్రసాద బుద్ధితో జీవించడం, ఒకరికొకరు తోడు నిలవడం, బండికి ఒక చక్రం తండ్రైతే ఇంకో చక్రం తల్లిగా మెలిగే కుటుంబ నేపథ్యం మా సొత్తు. అందరిలోనూ దేవుడున్నాడు, దేవుడు లేడు, ధర్మం లేదు అనేవాళ్ళలో కూడా మూర్ఖనారాయణుడున్నాడు అని చాటి చెప్పిన 'శ్రీ రామకృష్ణ పరమహంసాదులు' మా ధర్మ వనంలో పూసిన పూలు. వారు మాకు ఆదర్శం. క్షమ, ఓపిక, ఔదార్యం మా ఆస్థులు. మాలో ధీరులెందరో ఉన్నారు, అవసరార్థం ధర్మంపై జరుగుతున్న కుయుద్ధంలో అవైదిక వాదనలనీ, కుట్రలనీ, కుతంత్రాలనీ .... ధర్మ పరంగానూ, చట్ట పరంగానూ ఎద్రుర్కొనే వీరులుగా మారగలరు.

సనాతన ధర్మంలో స్త్రీ మూర్తి వైభవాలు..

కామెంట్‌లు లేవు: