సమయము లేదు మిత్రమా శరణమా, రణమా అని ప్రేక్షకులను ఉత్తేజితుల్ని చేసిన డైలాగు దాదాపు అందరు తెలుగు వారికి జ్ఞ్యాపకము ఉండే ఉంటుంది. అది ఏ నటుడు, ఏ సందర్భంలో చెప్పారు అనేది కాదు ప్రస్తుత అంశం. ఆ వాక్యం మాత్రం సాధకులను తేజోవంతుల్ని చేసి జిజ్ఞాసువులుగా మారుస్తుంది అన్నది మాత్రం నిజం. ఇప్పుడు ఆ వాక్యాన్ని కూలంకుషంగా పరిశీలిద్దాము.
ఈ వాక్యాన్ని మూడు భాగాలుగా విభజిస్తే మొదటిది సమయము లేదు మిత్రమా దీనిని ఒక సాధకుడు ఇంకొక సాధకుని ఉద్దేశించి పలుకుతున్నట్లుగా తీసుకోవచ్చు. మిత్రమా ఇంకా సమయం లేదు ఎందుకంటె ఈ దేహాన్ని కాలుడు ఏ క్షణంలోనయినా కబళించ వచ్చు కాబట్టి జాప్యం చేయవద్దని ప్రబోధిస్తున్నది. మరి ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే విషయంలో రెండు ఎంపికలను సూచిస్తున్నాడు. ఒకటి శరణము అనగా ఆ దేవదేవుడైన ఈశ్వరుని శరణుచొచ్చటము దానివలన ఉపయోగము ఏమిటి అంటే నిరంతర బ్రహ్మ్మనందంతో కైవల్యపధాన్ని చేరుకోవటం. మానవ జీవిత లక్ష్యం అదే. దానిని ప్రతి సాధకుడు తెలుసుకొని తన జీవితాన్ని తరిమ్పచేసుకోవాలి. అది కేవలం నియమ నిష్టలతో, క్రమపద్ధతిలో జీవనాన్ని సాగించి సాధారణ జీవనం చేస్తూ నిత్యం జిగ్న్యాసపరుడై ముముక్షుకత్వం పొందటానికి ప్రయత్నించటం. మనకు ఎన్నో జన్మల తరువాత అనితర సాధ్యమైన మానవ జన్మ లభించింది. ఈ జన్మలో మనం అరిషడ్వార్గానికి బానిసలం కాకుండా నిరంతర ధ్యానంతో మోక్షపదాన్ని చేరుకోవాలి.
ఇక రెండవ ఎంపిక రణం. మానవుని జీవితం నిత్యము ఒక రణమే కామ క్రోధాదులకు లోబడి నిత్యం మనస్సు అది కావాలి, ఇది కావలి అని పరుగులు పెట్టిస్తూవుంటుంది. లేనిది దొరికితే సుఖం కలుగుతుందని మనుషులు లేనిదానిని పొందటానికి వెంపర్లాడుతూ వుంటారు కానీ ఏది లేదని ముందనుకున్నాడో తరువాత అది లభించిన తరువాత కలిగే సుఖం తాత్కాలికం మరియు కేవలము క్షణికం. తరువాత తాను పొందిన దానికన్నా ఇంకా మెరుగైనది పొందాలనే అపేక్ష మనిషిని క్షణం కూడా నిలువనీయదు. ఉదాహరణకు నీకు ఒక మోటారుసైకిలు ఉంటె బాగుండును అని ఆశ కలిగి శ్రమదమాలకు ఓర్చి ఒక దానిని కొంటె కొంత కాలం దానివల్ల సంతోషం కలిగినా తరువాత కారు కావాలని మనస్సు ప్రాకులాడుతుంది. అది సమకూర్చుకుంటే ఇంకొకటి ఇంకొకటి అని నిత్యము లేనివానికై పరుగులు తీస్తూ కొంత కాలం తరువాత జీవితం ఒక పాఠం చెపుతుంది అదేమిటంటే నీవు బౌతికంగా కోరుకునేవి ఏవి కూడా శాశ్విత ఆనందాన్ని ఇవ్వవు అంతేకాక అవి తరువాత మున్ముందు నీకు దుఃఖ కారకాలుగా మారుతాయి. ఏవి కలిగితే సంతోషం కలుగుతుందో అవి విడివడుతే దుఃఖం కలుగుతుంది. అప్పుడు నీ పయనం శాశ్వితం, నిత్యము అయిన ఆనందం ఏమిటనే వైపుకు మళ్లుతుంది. కానీ అప్పటికే జీవితంలో చాలా సమయం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మేల్కొని ఆ అనంతునివైపు నీ పయనాన్ని కొనసాగించు.
ఓం తత్సత్
ఓం శాంతి శాంతి శాంతిహి
మీ భార్గవ శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి