*కడ దాకా స్వామితోనే...*
"మా మనవరాలికి సంబంధం కుదిరింది..వివాహం వచ్చే నెలలో చేయాలని అనుకుంటున్నాము..ఇక్కడే ..ఈ స్వామివారి సన్నిధిలోనే చేయాలని కూడా అనుకున్నాము..ముహూర్తం బుధవారం నాడు..ఆరోజుకు మాకు రెండు రూములు కేటాయించండి..ఉదయం పది గంటలకు ముహూర్తం సమయం..మధ్యాహ్నం భోజనాలు పెట్టుకొని వెళ్లిపోతాము..ఆరోజు ఇక్కడ వుండే భక్తులకు కూడా మా దగ్గరే భోజనం చేయమని మీరు చెప్పండి.." అని ఆ దంపతులు నాతో చెప్పారు..కొన్ని దశాబ్దాలుగా ఆ దంపతులు మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వస్తూనే వున్నారు..
ఆ దంపతులకు స్వామివారితో నేరుగా పరిచయం ఉంది..శ్రీ స్వామివారు మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో..వీళ్లిద్దరి వివాహం మాలకొండలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో జరిగింది..ఆరోజుల్లో మాలకొండలో ప్రత్యేక కళ్యాణ మంటపం లేదు..నరసింహ స్వామివారి మందిరం వద్ద ఉన్న మంటపం లోనే వివాహాలు జరిగేవి..అక్కడ వివాహం చేసుకొని..గర్భాలయం లోకి వెళ్లి శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని..ఆపై కొండమీద ఉన్న లక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని రావడం కొత్తగా పెళ్ళైన దంపతులకు ఒక ఆనవాయితీగా ఉండేది..వీళ్లిద్దరి వివాహం జరిగిన శనివారం రోజు మాలకొండకు పెద్దగా భక్తులు రాలేదు..వచ్చిన కొద్దిమంది కూడా మధ్యాహ్నమే తిరిగి వెళ్లిపోయారు..ఈ కొత్త దంపతులు లక్ష్మీ అమ్మవారిని చూసి..కొండదిగి వస్తూ..కొండకింద ఉన్న శివాలయం వైపు వెళ్లారు..ఆ సమయానికే శ్రీ దత్తాత్రేయ స్వామివారు శివాలయం లోని శివలింగం ముందువైపు పద్మాసనం వేసుకొని ధ్యానం లో వున్నారు..వీళ్ళిద్దరూ శివాలయం లోకి అడుగుపెట్టేసరికి..స్వామివారు ధ్యానం లోంచి లేచి..వీళ్ళను చూసారు..ఇద్దరూ అప్రయత్నంగా స్వామివారికి నమస్కారం చేశారు..స్వామివారు ఆశీర్వదించారు..అలా మొదటిసారి స్వామివారిని దర్శించుకున్నారు..ఆ తరువాత స్వామివారు మొగిలిచెర్ల చేరి ఆశ్రమం నిర్మించుకున్న తరువాత ఒకటి రెండు సార్లు కలిశారు..స్వామివారి మీద అపరిమిత భక్తి విశ్వాసం కలిగాయి..స్వామివారు సిద్ధిపొందిన తరువాత కూడా తరచూ మొగిలిచెర్ల వచ్చేవారు..తమ కుమారుడి వివాహం కూడా మొగిలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరం వద్దే చేశారు..తమ మనుమరాలి వివాహం జరిపించే క్రమం లో ఇక్కడకు వచ్చారు..
"స్వామివారిని మొదటిసారిగా చూసిన రోజు నుంచీ..మా భార్యాభర్తలకిద్దరికీ ఆయన మీద గురి కుదిరింది..ఆరోజే మా పెళ్లి జరిగింది..అదేమి చిత్రమో గానీ..రెండేళ్ల తరువాత మేమిద్దరమూ మాలకొండకు వెళ్ళాము..ఆరోజు కూడా స్వామివారు శివాలయం లోనే మాకు దర్శనం ఇచ్చాడు..మాతో ఒక్క మాట మాట్లాడలేదు..చెయ్యెత్తి ఆశీర్వదించాడు..మేమూ నమస్కారం చేసుకొని వచ్చేసాము..స్వామివారు మొగిలిచెర్ల వచ్చిన తరువాత..మేమిద్దరం మొగిలిచెర్ల వచ్చాము..మీ అమ్మా నాన్న గార్లను కలిసాము..స్వామివారిని చూద్దామని వచ్చాము అని చెప్పాము..మేము కూడా ఆయన దగ్గరకే వెళుతున్నాము..మాతో రండి..అని మీ తల్లిదండ్రులు చెప్పారు..అందరమూ ఈ స్థలానికి వచ్చాము..అప్పటికి స్వామికి గది కూడా లేదు..పూరిపాకలో వున్నాడు..మమ్మల్ని చూడగానే..నవ్వి.."శ్రీధరరావు గారూ మీతో పాటు వీళ్ళను కూడా తీసుకొచ్చారా..? " అన్నాడు..మేమిద్దరం నమస్కారం చేయగానే..ఆశీర్వదించారు..కొద్దిసేపు కూర్చుని మేము తిరిగి వచ్చేసాము..ఇప్పటిదాకా ఈస్వామినే నమ్ముకొని ఉన్నాము..ఇద్దరు బిడ్డలు పుట్టారు..అబ్బాయి పెళ్లి ఇక్కడే చేసాము..కూతురు పెళ్లి కూడా ఇక్కడే చేసాము..ఆ స్వామిదయవల్ల మా బిడ్డలు కూడా ఈ స్వామినే కొలుస్తారు..ఇంతవరకూ మా జీవితం లో ఏ లోటూ లేదయ్యా..ఆయన చల్లటి చూపు మామీద వున్నదని అనుకుంటున్నాము..ఇట్లా కాలూ చెయ్యీ ఆడుతున్నప్పుడే..మమ్మల్ని తీసుకెళ్లు స్వామీ అని వేడుకున్నాము..అదొక్కటే కోరిక.." అన్నారు..
ఆ దంపతులు ధన్యజీవులు అనిపించింది..అనుకున్న విధంగానే వారి మనుమరాలి వివాహం మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దే జరిగింది..స్వామివారి సమాధి ని దర్శించుకున్న తరువాత.."అయ్యా..ఈసారి మేము మళ్లీ స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు..అన్నదానం జరిపించు..ఆ ఖర్చు మేమే భరిస్తాము.." అని చెప్పాడు..అలాగే అన్నాను..కానీ మరో రెండు నెలల లోపే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి..హాస్పిటల్ లో చేర్చే లోపలే కన్నుమూసాడు..ఒక్కరోజు కూడ ఆ మందులు వాడలేదు..మంచాన పడలేదు..ఒక రకంగా సుఖమైన మరణమే అది..ఆయన కోరుకున్నది కూడా అదే..
"ప్రతి సంవత్సరం మా నాన్న గారి జ్ఞాపకార్ధం ఈ స్వామివారి సన్నిధిలో ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం జరిపించాలని అనుకుంటున్నాను..ఆ అవకాశం ఇవ్వండి.." అని వాళ్ళ కుమారుడు అడిగాడు..సరే అన్నాను..గత ఆరేళ్లుగా అతను క్రమం తప్పకుండా అన్నదానం చేస్తున్నాడు..తండ్రి మరణించిన సంవత్సరం లోపే తల్లి కూడా మరణించింది.."స్వామివారు మా తల్లిదండ్రులను చల్లంగా చూసాడు..ఏ బాధా పడకుండా ఇద్దరూ కాలం చేశారు.." అని అంటూవుంటాడు వాళ్ళ కుమారుడు..
నిజమే..త్రికరణ శుద్ధిగా స్వామివారిని నమ్మిన వారికి ఏ ఇబ్బందీ రాకుండా ఆయనే వేయి చేతులతో కాపాడుతూ ఉంటాడు.. ప్రతిసారీ మేము ఈ నిజాన్ని పలురకాలుగా గ్రహిస్తూ ఉంటాము..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి