అభినవ వికటకవి
(నేడు జరుక్ శాస్త్రి జయంతి)
తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడిగా జలసూత్రాన్ని చెప్పుకుంటారు.
జరుక్ శాస్త్రి గా పేరొందిన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి 1914, సెప్టెంబర్ 7న బందరులో జన్మించారు. ఆయన పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకి పరిచయం ఉంది. ఈయన కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక, వాణి - వంటి పత్రికల్లో తరుచుగా వ్యాసాలు వ్రాస్తూ ఉండేవారు.ఆంధ్రపత్రిక, వాణి పత్రికల్లో సంపాదకవర్గ సభ్యులుగా కూడా పనిచేసారు. తెనాలి రామకృష్ణుని తరువాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి, వికటకవి - శ్రీ జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని అంటారు. ఆయన రచనల్లో కొన్ని - "జరుక్ శాస్త్రి పేరడీలు" పేరుతోనూ, కథలు కొన్ని "శరత్ పూర్ణిమ" పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు. ఆయన 1968 జులై20న హృద్రోగంతో కన్నుమూసారు.
జరుక్ శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరు చిట్టి గూడురు సంస్కృత కళాశాలలో ఉభయభాషా ప్రవీణులయ్యారు. ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు. మదరాసు, విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్టు రైటర్ గా పనిచేశారు. నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు. పేరడీ శాస్త్రిగా మంచి పేరు. దేవయ్య స్వీయచరిత్ర (నవల) ప్రచురించారు. ఆనంద వాణిలో ' తనలో తాను ' శీర్షిక నిర్వహించారు. సమకాలీన కవుల రచనలకు పేరడీలు వ్రాసి మెప్పు పొందారు.
దేవయ్య స్వీయచరిత్ర (నవల),శబరి (నాటకం),
కన్యకాపరమేశ్వరి (నాటకం)
అక్షింతలు (పేరడీ) వంటి రచనలు చేశారు.
ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం అంటూ తన పేరడీలతో సాహితీ పరిమళాలను వెదజల్లారు.ఇక శ్రీశ్రీ ‘నేను సైతా’నికి వచ్చిన పేరడీలు లెక్కకు లేవు.
జరూక్ శాస్త్రి శ్రీశ్రీ కవితలలో ప్రసిధ్ది చెందిన పంక్తులకుచెప్పిన పేరడీలు గమనిస్తే,
నేను సైతం కిళ్ళీకొట్లో పాతబాకీ లెగర గొట్టాను
నేను సైతం జనాభాలో సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను
ఇంకా,
ఏ కాకి చరిత్ర చూచిన ఏమున్నది గర్వకారణం
ప్రపంచ మొక సర్కస్ డేరా (ప్రపంచమొక పద్మవ్యూహం)
కవిత్వమొక వర్కర్ బూరా (కవిత్వమొక తీరని దాహం)
ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడిలెన్నీ... మొదలైనవి..,
మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి తదితరులు తమ రచనలతో నవ్వులు పూయించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి