8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఈశ్వర స్తవము

 ఈశ్వర స్తవము 


శ్రీకైలాసనివాసా !

లోకేశ్వర ! నిగమవినుత !లోకపవిత్రా !

భీకరవిషకంఠేశ్వర !

చేకూర్చుము ముక్తి  నాకు శ్రీ పరమేశా ! 01


అక్కజముగ విషమును గని

దిక్కుల పరువెత్తుచుండ దేవత లెల్లన్

మక్కువ తోడను దానిని

గ్రక్కున గ్రహియించినావె  ఘనముగ యీశా !02


ఒడ లెల్లశ్రీవిభూతిని

కడు మక్కువ తోడ దాల్చి కన్పించు హరా !

ఇడుముల నుండెడి భక్తుల

కడు సంపద లిత్తు వకట  ఘనముగ యీశా ! 03


ద్వారమునందున బాలుని

దారుణ శూలంబు తోడ తరిగియు శిరమున్

కారుణ్యముతో పిమ్మట

వారణశిర ముంచినట్టి వందిత యీశా !    04


బాలుడు మార్కండేయుని

కాలుడు గొంపోవగాంచి కడు కుపితుడవై

శూలము బెట్టితి వడ్డుగ

లీలలు తెలియంగ లేము నిక్కము  యీశా.   05


✍️గోపాలుని మధుసూదన రావు. 🙏

కామెంట్‌లు లేవు: