8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

రామాయణమ్ -318

 రామాయణమ్ -318

...

హనుమ స్వామి వారి వెంట తిరుగుతున్నాడు రహస్యభూగృహాలను చూశాడు ,చిత్రవిచిత్రమైన విమానాలు చూశాడు బాగా తీర్చిదిద్దిన చతుష్పథాలనూ చూశాడు మార్గాలన్నిటినీ నిశితంగా పరిశీలించాడు.

.

రాక్షసులు స్వామిని చూపెడుతూ ఇతడొక గూఢచారి,బాగా చూడండిఇతడికి ఏమి శాస్తి అయ్యిందో అని చెపుతూ నడిపించారు.పురజనులంతా బయటకు వచ్చి కుతూహలంతో ఆ హనుమంతుడిని తిలకించారు.

.

ఈ సంగతి ఆ నోట ఈ నోట బడి సీతమ్మదాకా చేరింది.ఒక్కసారిగా దుఃఖతప్తురాలై ఆవిడ అగ్నిని జ్వలింపచేసి ఉపాసించింది.

.

హనుమంతుడి క్షేమముకోరుతూ ఆ మహా తల్లి ఈ విధంగా ప్రార్ధన చేసింది.

.

యద్యస్తి పతి శుశ్రూషా యద్యస్తి చరితం తపః 

యది చాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః

.

అగ్నిదేవా నేను పతి సేవ చేసినదాననే అయితే ,నేనేదైన తపస్సు చేసి ఉన్నట్లయితే ,నాకు పాతివ్రత్యమే ఉన్నట్లయితే ,హనుమంతుని విషయమున చల్లగా ఉండుము.

.

సీతమ్మ తల్లి చేసిన ప్రార్ధనకు మెచ్చి వరమిచ్చినాడన్నట్లుగా ఆవిడ జ్వలింప చేసిన మంట ప్రదక్షిణముగా తిరుగుతున్న జ్వాలాగ్రములతో ప్రకాశించింది.

.

తన స్నేహితుడి పుత్రుడు,రామబంటు అయిన హనుమంతుని విషయములో అగ్ని దేవుడు తన సహజప్రకృతిని ఉపసంహరించుకొని ఆయన వాలాగ్రమందు చల్లగా ఉండెను.

.

ఆశ్చర్యము ! నన్ను ఈ అగ్ని ఎందుకు దహించి వేయుట లేదు ?

.

ఓహో తెలిసినది మహాపతివ్రతాశిరోమణి సీతమ్మతల్లి చలువ ఇది .అందుకే నా తోక చివర మంచుపెట్టినట్లుగా ఉన్నది.

.

ఇక ఆలోచించదలుచుకోలేదు ,ఆలస్యము చేయదలచ లేదు కాయము పెంచి తన బంధనాలు తెంచుకొని సర్రున గగన వీధిలోకి  దూసుకొని పోయినాడు.

.

కోటగోడలమీదకు ఎగిరి ప్రధాన ద్వారము వద్దనుండి పెద్ద పరిఘను ఊడబెరికి కావలివాండ్లను చావమోది సింహగర్జన చేసి తనను కాపాడుతున్న అగ్నిదేవుడికి సంతర్పణ చేయవలెనని సంకల్పించి ఎగిరి దూకుతూ లంకలోనిఇళ్ళకు నిప్పంటించడము మొదలు పెట్టినాడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: