రైల్వే , భరోసా
రాజమండ్రికి చెందిన వెంకటేశ్వరరావు దంపతులు విజయవాడలో ఉంటున్న తన కూతురి దగ్గరకు వెళ్లి ఆమె బాగోగులు చూసి విజయవాడ నుంచి బిలాస్‌పూర్‌కు మరో రైల్లో బయలుదేరారు. విజయవాడలోని వెంకటేశ్వరరావు కుమార్తె మూడుగంటల తర్వాత తల్లిదండ్రుల క్షేమ సమాచారం కోసం ఫోన్‌చేయగా ఫోన్ రింగవుతున్నా కాల్ లిఫ్టు చేయలేదు. వెంటనే ఆమె రైల్వే హెల్ప్‌లైన్ 182కు ఫోన్‌చేసి విషయం చెప్పి తన తల్లిదండ్రుల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని కోరింది. వెంటనే రైల్వే అధికారులు సంబంధిత సిబ్బందికి వెంకటేశ్వరరావు వెళ్లే రైలు సమాచారాన్ని తెలపగా ఖాజీపేటలో రైల్వే అధికారులు ఆయన దగ్గరకు వెళ్లి వారితో ఫోన్‌లో విజయవాడలోని ఆయన కుమార్తెతో మాట్లాడించారు. దీంతో కుమార్తెకు వూరట లభించింది.
హౌరా-యశ్వంత్‌పూర్ రైల్లో విజయవాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న ఓ విద్యార్థిని హిజ్రాలు ఏడిపించసాగారు. విద్యార్థి హిజ్రాల వేధింపులు భరించలేకపోవడాన్ని సాటి ప్రయాణికుడు గమనించాడు. వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్‌చేసి సమాచారాన్ని అందించాడు. రైలు ఏలూరు వెళ్లగానే ఆర్‌పీఎఫ్ సిబ్బంది హిజ్రాలుండే బోగి ఎక్కి వారిని అదుపులోనికి తీసుకున్నారు.
మండవల్లి, న్యూస్‌టుడే
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 182 హెల్ప్‌లైన్ నంబరును ఏర్పాటు చేసింది. విపత్తులు, ఆపద సమయాల్లో ప్రయాణికులు ఈ నంబరుకు ఫోన్‌చేస్తే వెనువెంటనే సాయం అందుతుంది. ఇటీవల బెంగళూరు స్టేషన్‌లో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది తప్పిపోయిన సంఘటనలో సైతం ఇది ఎంతగానో ఉపయోగపడింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలోని రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్)కు అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికులు ఆ నంబరుకు కాల్ చేసిన వెంటనే అది ఏ డివిజన్‌లో ప్రయాణిస్తుందో, ఏ రైల్వే స్టేషన్‌లో నిలుస్తుందనే సమాచారం మొత్తం జీపీఎస్ ద్వారా తెలుస్తుంది. రైలు తరువాత నిలిచే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం వెళుతుంది. ఆర్పీఎఫ్ సిబ్బందికి వెళ్లే ఈ కాల్ రికార్డు కావడంతో ప్రతి కాల్‌కు ఎటువంటి పరిష్కారం చూపారనే విషయం సైతం సిబ్బంది నోట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది కాల్ వచ్చిన రైలు బోగీకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.
ఎలాంటి సమస్యకైనా పరిష్కారం..
మనం రిజర్వేషన్ చేసుకున్న సీట్లో వేరొకరు కూర్చున్నా వెంటనే 138 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బోగీల్లొ ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, మరుగుదొడ్లలో నీరు రాకున్నా, దుర్వాసన వస్తున్నా, ఫ్యాన్లు తిరగకపోయినా.. లైట్లు వెలుగకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. తోటి ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, హిజ్రాలు, ఆకతాయిల వేధింపుల ఎక్కువైనా ఫోన్‌చేసి తక్షణ పరిష్కారం పొందవచ్చు. రైల్లో మన లగేజీ మరచిపోయి.. దిగిపోయిన సందర్భంలో సైతం ఫోన్‌చేస్తే అవతలి స్టేషన్‌లో లగేజిని పొందవచ్చు.
ఏ సమయంలోనైనా.. ఎవరైనా..
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 182 ఉచిత హెల్‌లైన్ నంబరు 24గంటలు అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు ఏ సమయంలో అయినా ఫోన్‌చేసి సహాయాన్ని పొందవచ్చు. ఈ నంబరుకు రైల్లో ప్రయాణించే ప్రయాణికులతోపాటు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణంలో అనారోగ్యం సంభవించినా.. 182 ఫోన్‌చేసి సత్వర పరిష్కారం పొందవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి