3, ఆగస్టు 2021, మంగళవారం

పాదుకలు..ప్రకంపనలు..

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*పాదుకలు..ప్రకంపనలు..*


ఆరేడు సంవత్సరాల క్రిందట..ఒక ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల వేళ.. మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు..కారు లోంచి ఒక స్వామీజీ దిగి..మందిరం లోపలికి వచ్చారు..కాషాయ వస్త్రాలు ధరించి వున్నారు..వారితో పాటు మరో నలుగురు వెంట వచ్చారు..తాము గత రెండురోజుల నుంచీ భైరవకోన లో ఉన్నామని..అక్కడ హోమం చేసామనీ..తిరిగి వెళుతుండగా..దారిలో శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం అనే బోర్డ్ చూసి..ఈ మందిరాన్ని చూసి వెళదామని అనుకొని ఇలా వచ్చామని చెప్పారు..


ఆ వచ్చిన స్వామీ జీ వారు మౌనంగా అన్నీ పరీక్షగా చూస్తున్నారే కానీ..ఒక్క మాట కూడా మాట్లాడలేదు..ప్రక్కనున్న వాళ్లే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు..కుర్చీలు చూపించి..కూర్చోమన్నాను..అందరూ కూర్చున్నారు.."ఎక్కడినుంచి వచ్చారు?.." అని అడిగాను..


స్వామీజీ వారిది కృష్ణాజిల్లా అనీ..హిమాలయాల వద్ద వుంటారనీ..ప్రస్తుతం పర్యటన చేస్తూ..భైరవకోన కు వచ్చారని తెలిపారు..తాము వారికి అనుయాయులమనీ తెలిపారు..స్వామీజీ వారు మాత్రం మౌనంగానే వున్నారు..


"ఈ క్షేత్రం విశేషాలేమిటి?.." అని వచ్చిన వారిలో ఒకతను అడిగాడు..


శ్రీ దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో తపోసాధన చేసే రోజుల నుంచీ..మా తల్లిదండ్రుల కు పరిచయం కావడం..తరువాత మొగలిచెర్ల రావడం..ఇక్కడ ఆశ్రమం నిర్మాణం చేయించుకోవడం..ఇక్కడ సాధన..కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన దాకా..క్లుప్తంగా వివరించి చెప్పాను..విన్నారు..అంతా విన్న తరువాత.."మేము..స్వామివారి సమాధిని దర్శించుకోవచ్చా?.." అని అడిగారు.."దర్శనం చేసుకోండి.." అని చెప్పాను..


ముందుగా ఆ స్వామీజీ వారు లోపలికి వెళ్లారు..వెళ్లేముందు..తనతోపాటు నన్నూ లోపలికి రమ్మన్నారు..వెళ్ళాను..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు..శ్రీ స్వామివారి దేహాన్ని ఉత్తరాభిముఖంగా..పద్మాసనం ముద్రలో ఉంచి..సమాధి చేశామని తెలిపాను..అప్పటివరకూ మౌనంగా ఉన్న ఆ స్వామీజీ వారు..శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సమాధి ముందు నిలబడి.."స్వామీ!..దత్తాత్రేయా..నన్ను కరుణించు తండ్రీ..నా సాధన పూర్తి కావడానికి మార్గాన్ని చూపించు.." అంటూ మోకాళ్ళ మీద వంగి..సమాధికి తల ఆనించారు..అక్కడే పెట్టబడి ఉన్న శ్రీ స్వామివారి పాదుకలను రెండు చేతులతో ఎత్తి పట్టుకొని..తన శిరస్సుపై పెట్టుకున్నారు..అప్పటివరకూ ఎంతో గంభీరంగా ఉన్న ఆయన..కన్నీరు కారుస్తూ..ఆ సమాధి వద్దే ఓ ఐదు నిమిషాల పాటు నిలబడిపోయారు..మెల్లిగా ఆ సమాధి మందిరం బైటకు వచ్చి..శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహం వద్ద నిలబడ్డారు..అర్చక స్వామి ఇచ్చిన హారతిని కళ్లకద్దుకుని..ఆ మంటపం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..ఒక ప్రక్కగా నేల మీద కూర్చున్నారు..


"నేను చాలా సంవత్సరాల నుంచీ సాధన చేస్తున్నాను..హిమాలయాల లో సుమారు పదిపన్నెండేళ్ల పాటు వున్నాను..ఎందరో యోగులను.. సిద్ధులను..కలిశాను..వారి వద్ద యోగప్రక్రియ గురించి తెలుసుకున్నాను..కానీ ఏదో తెలియని ఆవేదన నన్ను వెంటాడుతోంది..పరిపూర్ణత రాలేదు..తిరుగుతున్నాను..దేశమంతా తిరిగాను..తెలుసుకోవాల్సింది బైట ఎక్కడో లేదు..నీలోనే ఉన్నది..నిన్ను నువ్వు శోధించుకో..అని ఈరోజు ఈ క్షేత్రం లో ఈ దత్తాత్రేయ స్వామివారు నాకు బోధ చేసారు.. నా తల మీద ఈ స్వామివారి పాదుకలు ఆనించుకున్న మరుక్షణమే..నా దేహం వశం తప్పింది..వళ్ళంతా ప్రకంపనలు వచ్చాయి..ఒక్కటిమాత్రం నిజం..ఆ దత్తాత్రేయుడి తపశ్శక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉన్నది.. నేను అనుభూతి చెందాను..మహిమాన్వితమైన క్షేత్రం నాయనా ఇది..శ్రీ స్వామివారి పాదుకలను జాగ్రత్తగా కాపాడండి.." అని అన్నారు..మరో అరగంట సేపు అక్కడే కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకున్నారు..లేచి వెళ్లేముందు మళ్లీ ఒక్కసారి శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి..తనతో పాటు వచ్చిన వారిని తీసుకొని..కారెక్కి వెళ్లిపోయారు..


"బోధ చేయాలంటే..నేను జీవించే ఉండాలా?..అలా అనుకుంటే..ఇంతకుముందు సిద్ధిపొందిన మహాత్ములందరూ జీవించే ఉండాలి కదా..వారి తపోశక్తి వలన వారు సమాధి చెందిన తరువాత కూడా మన సమస్యలకు సమాధానం దొరుకుతున్నది కదా!...అదేవిధంగా ఇక్కడ కూడా నా తదనంతరం కూడా నా సమాధి వద్ద మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.." అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలు అక్షరసత్యాలుగా అనిపించాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: