22, జూన్ 2022, బుధవారం

ఒక పద్యం

 నా భాగ్యవశమున, పోతనామాత్యులవారి "వీరభద్ర విజయము" కావ్యములోని ఒక పద్యం లభించినది. దానిని మిత్రులతో పంచుకోవాలని అనిపించినది. తత్ఫలితమే ఈ టపా!


సందర్భం తెలియదుకాని, పరమశివునితో పార్వతి వదనసౌందర్యమును గురించి వర్ణించి చెప్తున్నారు ఎవరో!


జలజాక్షి నెమ్మోముఁ జందురుఁ బోల్తమా! చందురునందున గందు గలదు!

కన్నియ వదనముఁ గమలంబుఁ బోల్తమా! కమలంబు పుట్టుచోఁ గసటు గలదు!

మోహనాంగి ముఖంబు ముకురంబుఁ బోల్తమా! ముకురంబునందున మృదువు లేదు!

మానిని వదనంబు మణిపంక్తిఁ బోల్తమా! మణులెల్ల ఱాలను మాట గలదు!


యింక నేమి బోల్త మింతి యాననముతో

సృష్టి నేమిపాటి సేయవచ్చు!

మగువ మొగము కాంతి, మలహర! నీయాన!

త్రిభువనంబులందు నభినవంబు!


భావము: "దేవా! ఆ పార్వతి ముఖసౌందర్యమును ఏమని చెప్పగలము!... ఆమె మోమును చంద్రబింబముతో పోలుస్తామంటే, చంద్రునిలోపల కళంకం ఉంది. ఆమె వదనమును పంకజము (పద్మము) తో సరిపోలుస్తామంటే, పంకజము యొక్క జన్మస్థానం పంకము (బురద) కదా! పోనీ, ఆమె ముఖమును దర్పణముతో పోలుస్తామంటే, అద్దమునకు మృదుత్వం అనేది లేదు. ఇక, ఆమె ఆననమును (ముఖమును) ప్రకాశవంతమైన మణిపంక్తితో పోలుస్తామంటే, ఎంత నవరత్నములైనా అవీ ఱాళ్ళే కదా! ఈ సృష్టిలో ఆమె వదనమునకు సాటిరాగల వస్తువేదీ కనిపించడంలేదు! ఓ మలహరా (దోషములను తొలగించువాడా)! నీమీద ఒట్టు! మూడులోకముల్లోనూ అత్యంత నూతనముగా ఉంది సుమా ఆమె ముఖకాంతి!"


ఇక్కడ "మలహరా" సంబోధన సాభిప్రాయం. "నీవు మలినములను (దోషములను) తొలగించు సమర్థుడవు కనుక, పై ఉపమానాల్లోని వైక్లబ్యములను పరిహరించగలిగితే, అప్పుడు ఆమె వదనమును వాటితో సరిపోల్చవచ్చు" అంటున్నాడు కవి.


కేవలం ముఖసౌందర్యవర్ణన కొరకు పద్యాల్లో సుదీర్ఘమైన సీసపద్యమును వాడిన పోతనగారికి నమోనమః.

కామెంట్‌లు లేవు: