🌹రామాయణానుభవం_1
ఎందరి జీవితాల్లో మార్పుతెచ్చిందో...?
ఎందరికి ఈ మార్గ దర్శనం...?
ఎంతమంది నిత్యం పారాయణ చేస్తున్నారో?
ఎన్ని విలువలు?
ఎన్ని ఆదర్శాలు?
ఎన్ని నిత్య ఆచరణ సత్యాలు?
ఎన్ని పతివ్రతా ధర్మాలు?
ఎంత సోదర ప్రేమ?
ఎన్ని తాత్విక విషయాలు?
ఎన్ని రాజ ధర్మాలు.?
ఎన్ని వేద ఉపనిషద్? ప్రతిపాదిత విషయాలు?
ఎన్ని ఎన్ని ఎన్ని అని ప్రతి ప్రశ్నలో సమాధానం ఇన్ని ఇన్ని ఇన్ని చెప్పసాధ్యం కాని అనంత మైనవి.
రాముని గుణాలు అనంతం.
రాముని సత్యవాక్యం అనంతమైనది.
రామాయణం లో ఆదర్శాలు అనంతమైనవి.
రామాయణం లో విలువలు ఆనంతమైనవి.
రామాయణం లో సోదర ప్రేమ అనంతం.
రామాయణం లో పతివ్రతాధర్మాలు అనంతం.
ఇలా అనంత మైన రాముని చరిత్రను అల్పం గా చెప్పుకోవడం కష్టతరం.
పైగా అది సీతమ్మవారి చరిత్ర కూడాను. ఎన్నో ఎన్నో విషయాలను వాల్మీకి చెప్పిన రామాయణం
తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం
జాతి మనుగడ ఉన్నంత వరకు రామాయణం తెలుసుకుంటూనే ఉండాలి.
ఈ భూమి పై కొండలెంతకాలం నిలచి వుండునో నదులెంత కాలం ప్రవహించునో అంతవరకు రామాయణ సంబంధిత చరిత్ర లోకంలో ప్రచారం లో ఉండును .
కొండలు అంటే భూభాగం.నీరు అంటే జీవనానికి ఉపయోగమైనది....భూభాగం నీరు అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు రామచరిత ప్రచారం జరుగుతూనే ఉంటుంది.
సృష్టి ప్రళయం అనంతం గా కొనసాగుతూ ఉంటుంది.
రామాయణము అనంతం....
రాముడు అనంతం.....
**
త్రేతాయుగం నడుస్తోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం. ప్రశాంత మైన వాతావరణం.
తపో భూమి.
వేదాధ్యయన తత్పరుడు, తపసంపన్నుడు అగు నారదమహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు.
ఆ మహర్షిని పూజ చేసి వాల్మీకి ఈ లోకం లో ఈ కాలం లో గుణవంతుడు ఎవడు.?
వీర్యవంతుడు ఎవడు?
ధర్మజ్ఞుడు,కృతజ్ఞుడు,సత్యవాక్యుడు,దృఢవ్రతుడును ఎవ్వడు?
చారిత్రము తో కూడుకొన్నవాడు ఎవడు?
సర్వభూతములయందు హితుడెవ్వడు?
విద్వాంసుడెవ్వడు?
సమర్థుడెవ్వడు.?
ఏకప్రియదర్శునుడుఎవడు?
ద్యుతిమంతుడు,అసూయలేనివాడు ఎవ్వడు?
కోపము వచ్చినచో దేవతలైనను భయపడుదురో అట్టి నరుడెవ్వడు?
అని 16 గుణాలను సంబంధించిన ప్రశ్నలను గూర్చి తెలిపి సమాధానము వినగోరుతున్నాను అని వాల్మీకి తెలిపెను.
సమాధానము గా నారదుడు ఓ మహర్షి..!
నీవు ప్రశ్నించిన గుణముల పరంపర అంతా ఒకే చోట వుండటం దుర్లభం ......కానీ ఇప్పుడు ఇక్ష్వాకు కులమున జన్మించిన వాడు రాముడు అను పేర జనుల చే పిలుచు కొనువాడు లో అన్ని గుణాలతో పాటు ఏ ఒక్క చెడు గుణము లేని వాడు గా ఉన్నాడు....
అనిచెబుతూ రామాయణ గాథను మొత్తం సంక్షిప్తం గా ,పొడి పొడి, గా ఉపదేశాత్మకం గా, నారదుడు అందించాడు.
*ఇదం పవిత్రం పాపఘ్నం*
*పుణ్యం వేదైశ్చ సమ్మితం ౹*
*యః పఠే ద్రామచరితం*
*సర్వపాపై: ప్రముచ్యతే౹౹*
పాపములను నశింపచేయునది, పుణ్యమైనది,వేదములతో సమానమైనది ఈ చరిత్ర, ఎవడు చదువుతాడో, తెలుసుకుంటాడో, అతడు సర్వపాపములనుండి విముక్తి చెందుతాడు
ఈ చరిత్ర ఆయుష్యకరమైనది, సత్యమైనది, నిత్యం చదువు మానవుడు పుత్రుడు పౌత్రులతోడ బంధు సమూహములతో కూడి జీవనం గడుపుతాడు, శరీరం పడిపోయినతరువాత పరమపదము చేరును అని తెలిపి
నారదుడు ప్రయాణమయ్యెను.
సంక్షిప్తం గా తెలిపిన ఈ రామచరిత్రను సంక్షిప్త రామాయణం గాను, బాల రామాయణం గానూ, మూల రామాయణం గాను, ప్రసిద్ధి.
నిత్యపారాయణ యోగ్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి