7, ఏప్రిల్ 2022, గురువారం

రామాయణానుభవం_2

 🌹రామాయణానుభవం_2


నారదమహర్షి చే ఉపదేశం పొందిన సంక్షేప రామాయణాన్ని మననం చేస్తూ మధ్యాహ్న సమయానికి తమసానది తీరమునకు తన శిష్యుడైన భరద్వాజుని తో కలసి వెళ్లెను వాల్మీకి మహర్షి.


నిరంతరం  రామకథాగానం చేయడం మూలన మనస్సు నిర్మలమైనది. ఆభావాలే ప్రకృతి లో కనపడ్డాయి....పక్కనే ఉన్న భారద్వాజుని తో నది లో ఉన్న నీటి ని చూస్తూ అనేశాడు కూడా...

ఓ భరద్వాజా బురద లేని స్వచ్ఛమైన నీటి ని చూసావా నిర్మలమైన  ఉత్తమ మనుజుని వలే ఉన్నది అని చెబుతున్న సమయం లో నే ఆశ్చర్యాన్ని కలిగించే ఓ దృశ్యం మహర్షి కంట పడింది.....


ఓ క్రౌంచ పక్షుల జంట...ప్రేమాతిశయముతో ఒకటిని విడచి మరొకటి ఉండని స్థితి....

ఆసమయంలో ఓ బోయవాడు ఆ జంటలో మగ పక్షిని బాణం తో కొట్టేసాడు.....ఆ ప్రదేశం అంతా ఆ పక్షి రక్తం తో నిండినది ఆడ పక్షి  తన రెక్కతో విసురుతూ విల విల లాడుతూ మగ పక్షి చుట్టూ తిరుగుతోంది.దీనం గా రోదిస్తోంది.

పక్కనే బోయ వాడు విల్లంబులతో నిలుచు కొని వున్నాడు.....


అత్యంత అల్ప సమయం లో జరిగిన ఈ దృగ్విషయాన్ని వాల్మీకి కన్నులతో కాక హృదయం తో చూసాడు....


అంత వరకు ప్రశాంతం గా ఉన్న మనసు లో ఒక్క సారి అలజడి చెలరేగింది.....ఒక్క సారి హృదయాంతరాలలో నుండి శోకం తో కూడిన మాటలు తన్నుకొని వచ్చాయి.....


శ్లో! మానిషాద! ప్రతిష్ఠాం త్వ! మగమః శాశ్వతీస్సమా: | 

యత్ క్రౌంచమిధు నాదేక మవధీఃకామమోహితమ్౹౹


ఓ కిరాతకుడా! నీవు కామవసా న  క్రౌంచపక్షుల జంటనుండి మగ పక్షి ని చంపినావు కనుక నీవు చాలాకాలం లోకం లో అప్రతిష్ఠితను పొందుదువు.


వాల్మీకి నోటి వెంబడి వచ్చిన మాటలు ఏదో శాపం గా కనుబడుతున్నాయి అని చింతిస్తున్నాడు....


పక్కన ఉన్న భరద్వాజుడు గురువాక్కు ను నిశితంగా చూస్తున్నాడు.

4 పాదాలుగా ఉన్నాయి....

 ఒక్కో పాదానికి 8 అక్షరాలున్నాయి....

ఒక క్రమబద్దం గా ఉన్నాయి....

గతం లో చదవని విధం గా కనబడుతున్నాయి అని ఆశ్చర్యానికి లోనవుతున్నాడు....

అవును ఈ శ్లోకం ఛందోబద్ద రచనకు మూలం. మొదటి శ్లోకరూప వాజ్ఞ్మయం....

ఆది కావ్యం రామాయణం,

ఆది కవి వాల్మీకి ......

వాల్మీ రామాయణ రచనకు పునాది.....


శ్లోకాన్ని పరిశీలిస్తే ఓ  శాపం గా కనపడుతుంది కానీ కావ్య ఆరంభము మంగళ వాక్యాలతో మొదలు కావాలి మరి ఇదేమిటి ఇలా ఉంది అని మన పెద్దలు విస్తుపోయారు .....

పరికించారు దివ్యదృష్టి తో దర్శించారు అప్పుడు  ఆ శ్లోకమే ఇలా అగుపించింది.


మా నిషాద-లక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా ! త్వమ్=నీవు, యత్ = ఏ కారణమువలన, క్రౌఇ్చమిథునాత్ =రాక్షసదంపతు లైన రావణమండోదరులనుండి కామమోహితమ్=కామపరవశ మగు, ఏకమ్=ఒక డైన రావణుని, అవధీః శాశ్వతీ:,స్థిరము లైన, సమాః సంవత్సరములయందు, ప్రతిష్టామ్=మాహాత్మ్య

మును, అగమః=పొందితివి.


. ఓ శ్రీనివాసుడా! రావణమండోదరు లను రాక్షసదంపతులవద్దకు వెళ్లి, వారిలో ఒకడును, మన్మథపరవశుడై 

సీతాదేవి నపహరించిన వాడును అగు రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి.


ఇలా చూస్తే ఓ మంగళకరమైన శ్లోకం గా కనిపిస్తుంది.


ఈ ఛందోబద్ధమైన శ్లోకాన్ని గురుశిష్యులు ఇద్దరూ స్మరణ చేస్తూ వికారానికి లోనైన మనసులతో ఆశ్రమం చేరారు.

వాల్మీకి మహర్షి ఆచమనం చేసి తదేకదృష్టితో   శ్లోకాన్ని స్మరణ చేయడం ప్రారంభించాడు.అపుడే ఆశ్రమానికి చతుర్ముఖ బ్రహ్మ గారు విచ్చేసారు.

**

వాల్మీకి ఆశ్రమం లో చతుర్ముఖ         బ్రహ్మ గారు జరిగిన సంఘటన  తెలుసుకొని, జరిగిన రామకథ అంతయు నీకు ప్రత్యక్ష సమానాకారముగా గోచరమగును అని వరమును ఇచ్చెను. నీవు రచించు ఈ కావ్యం లో ఒక్క మాటైన అసత్యము ఉండదు.రామ కథ పుణ్యమైనది.మనోహరమైనది.


యావత్ స్థాస్యన్తి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.


పర్వతములు,నదులు భూమి మీద ఉన్నంత వరకు రామకథ లోకములో వ్యాపించి ఉంటుంది.


తదుపగత సమాససన్ధియోగం

సమమధురోపనతార్థ

వాక్యబద్ధమ్, 

రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వమ్.


 ఈ రామచరితము రావణ వధ   వాక్యాలు మధురంగా అర్థభరితముగా ఉంటాయి 


ఈ కావ్యము సుమారు 24 వేల శ్లోకాలు,7 కాండలతో విరాజిల్లుతుంది.

వేదోపబృంహనార్థాయ....

వేదము యొక్క సమగ్ర వివరణ గాను, చదివినను,పాడినను మధురంగా ఉంటుంది.

ఇంకా ఆయుష్యం, పుష్టిజనకం, సర్వశ్రుతిమనోహరం....అని వరం ఇచ్చారు  బ్రహ్మగారు.


బ్రహ్మ గారి వరప్రభావం వలన జరిగిన రామచరిత్రను అంతా కళ్ళకు కట్టినట్టు కనపడింది


తదేక దృష్టితో రచన సాగించారు మహర్షి రామచరిత్రకు 3 పేర్లు సూచన చేశారు

1.రామాయణం

2.మహత్తుకలిగిన సీతమ్మ చరిత్ర

3.పౌలస్త్య వధ.


ఈ రాసిన గ్రంథం మొతాన్ని  ఆశ్రమమ లో ఉన్న రామచంద్రుని పుత్రులు కుశ లవుల కు నేర్పించాడు.వారు అయోధ్యలో గానం చేశారు

అక్కడ ఉన్న నగర పౌరులు బాగుందని ప్రశంసించారు,బహుమతులు బహుకరించారు.ఆ నోటా ఈ నోటా ప్రచారం చెంది రామచంద్రుని వరకు ఆ గాన ప్రవాహం చేరింది.

రాముడు కూడా అక్కడవున్నవారితో ఈ సీతాచరిత్ర నాకు కూడా ఊరట కలిగించింది. సావధాన చిత్తులై వినండి.

అని ఆదేశించారు.


🌹రామాయణానుభవం_3


అది అయోధ్యానగరం. సరయూ నది తీరం.మనుచక్రవర్తి స్వయంగా సంకల్పబలం చే నిర్మించినాడు. సంతుష్టులగు ప్రజలతో,ధనధాన్యాలతో నిండియుండి కోసల దేశం గా ప్రసిద్ధి చెందింది.అయోధ్యా నగరం 12 యోజన ముల పొడవు,3 యోజనముల వెడల్పు గలది.మంచి పుష్పాలతో నిండిన తోటలు,రాజమార్గాలు సుంగంధభరితమైన తోరణాలు,చక్కగా అమర్చినటువంటి వీధులతో గొప్ప పట్టణం గా విరాజిల్లుచుండెను.


మిక్కిలిఎత్తైన రాజభవనాలతోను,వాటిపై ఎగురుచున్న జెండాలతో ను,పెద్ద పెద్ద నర్తన శాలలతోను,పూదోట లతోను ఉన్న నగరం లోకి శత్రువులు ప్రవేశింపడానికి 

వీలుకాకుండా లోతైన ఆగడ్తలతోను అయోధ్యానగరం ప్రకాశించుచున్నది.ఏనుగులు,గుఱ్ఱములు,ఒంటెలు,అవులతోను,అధికంగా సామంతరాజులతోను ,దేశ విదేశ రాజులు,వ్యాపారస్తులతో క్రిక్కిరిసి ఉండెను.ఇలా పరిపూర్ణ హంగులతో ఉన్న ఆ నగరం దేవేంద్రుని అమరావతి తో సమానం గా ఉండెను.


తల్లిదండ్రులు,భార్యాపుత్రులుమనుమలు,బంధువులతో లేని ఇల్లు ఒక్కటైనను అయోధ్యలో కనపడదు.

చదువురానివారు కానీ,దుష్టుడు కానీ,దొంగ కానీ,నాస్తికుడు కానీ పట్టణం లో వెదికనను కనపడడు.

ఇట్టి మహా నగరాన్ని అజ మహారాజు పుత్రుడగు దశరథ మహారాజు పాలన చేస్తుండెడి వాడు.

(1 యోజనము =12కిలో మీటర్ల దూరం తో సమానం)

**

అయోధ్యా పురి చక్రవర్తి అయిన దశరథ మహారాజు వేదవేదాంతములను తెలిసిన వాడు. పౌరులకు మేలుకలిగించు అనేక యజ్ఞములు చేస్తుండెడి వాడు.

ఆ మహారాజు కొలువులో 8 మంది మంత్రులు. వారు దృష్టి, జయంతుడు,విజయుడు,సిద్ధార్థుడు,అర్థసాధకుడు,అశోకుడు,మంత్రపాలుడు,మరియు సుమంత్రుడు(అత్యంత ముఖ్య వ్యవహారాలను చూసే వాడు).

ఈ మంత్రి వర్గం ఇతర రాష్ట్రాలలో ఏమి జరుగుతున్నది ఎప్పటికప్పుడు రాజుకు తెలియజేసేవారు.తప్పుచేసిన తనబిడ్డలైనను శిక్షించ గల నిబద్ధత గల వారు. నిరపరాదులైన పగవారైనను క్రోధముతో శిక్షింపక సమబుద్ది కలవారు.త్రికరణ శుద్దిగా అందరూ ఏకతాటిపై రాజ్యవ్యవహారాలను చూసెడి వారు.


 వశిష్టుడు, వామదేవుడు అను మహర్షులు చాలాకాలము నుండి 

ఇక్ష్వాకువంశపురోహితులై, ఆ దశరధునికి హితులై ప్రాధాన్యము వహించి యుండిరి. ఇంకను జాబాలి మున్నగు ఋషులును ప్రధానులైయుండిరి. రాజ్యవ్యవహారము లందు వీరికిని ముందు పేర్కొన్న మంత్రులతో బాటు ప్రాముఖ్యముండెడిది. అందువలననే అయోధ్యానగరమునగాని కోసలదేశమునందుగాని ఎచ్చటను అసత్యము పలుకుటగాని, మోసముగాని, స్త్రీ వ్యామోహముగాని, అధర్మముగాని, అన్యాయముగాని మచ్చుకకైన కనిపించెడిదికాదు. నగరమునందు, దేశము నందు నివసించువారు మంచి వస్త్రములు ధరించి, చక్కని యలంకారములు దాల్చి మంచి నడవడికగలవారై తమరాజగు దశరథుని మేలుకొఱకై సదా నీతి యందు జాగురూకతతో ప్రవర్తించుచుండిరి.


తనయందు ప్రీతిగలవారును, బుద్ధికౌశలము గలవారును, రాజ్యకార్యాచరణ దక్షులును అగు మంత్రులచే పరివేష్టితుడై ప్రకాశవంతములగు కిరణములతో నొప్పు బాలభానునివలె ప్రకాశించుచు స్వర్గమును దేవేంద్రుడువలె నీ భూమండలము నంతను దశరథ మహారాజు పాలించుచుండెను.


ఇంతటి ప్రభావం కలిగిన దశరథ చక్రవర్తి కి చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వలన మనసులో చింతన ఏర్పడింది.

సంతానం కోసం మంత్రి,పురోహిత వర్గం తో సమావేశం ఏర్పాటు చేసి సమాలోచన చేసెను దశరథుడు.

కామెంట్‌లు లేవు: