🌹 *తల్లి ఋణం - తీర్చలేనిది..!!* 🌹
🌟 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, *అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది* అన్నాడు.
🌟 తల్లి నవ్వి ఊరుకుంది. కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో - తల్లి ఇలా అంది .. *బిడ్డా! నా రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, నీవు ఒకరోజు రాత్రిపూట పసి బిడ్డగా నా వద్ద పడుకో చాలు* అంది. ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు.
🌟 అతనికి నిద్ర రాగానే తల్లి లేపి *నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు* అంది. కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు. రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి *ఏమిటమ్మా ఇది?* అన్నాడు. *పొరపాటు అయిపోయింది నాయనా* అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.
🌟 అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి *బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు* అంది. *ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?* అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.
🌟 తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. కొడుకు కోపంతో
*అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా?* అన్నాడు. *నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది* అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. *అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా* అంటూ నీళ్ళు తీసుకువచ్చి *ఇదిగో తాగి చావు* అని అన్నాడు.
🌟 తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... *అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది ఇలా వేధించడానికేనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు* అంటూ ఆగ్రహంతో కేకలేశాడు.
🌟 అప్పుడు తల్లి ..... *బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.*
🌟 *నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు - నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు* అంది తల్లి.
🌟 ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని *అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు,ఆమె చేసే సేవలకు,ఆమె త్యాగాలకు, కష్టానికి, సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు* ’ అన్నాడు.
అందుకే తల్లిని *x* అన్నారు.
తల్లి దేవత.
తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.
నవమాసాలు తన బిడ్డను కడుపులో మోసి, ఎన్నో బాధలకు ఓర్చి, బిడ్డకు జన్మనిస్తుంది. ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తినట్లే.
🌹 *దయచేసి మీ పిల్లల చేత చదివించండి.* 🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి