3, మార్చి 2021, బుధవారం

మూడు‘గొప్ప’లున్న మనీషి*

 *మూడు‘గొప్ప’లున్న మనీషి*


(ముళ్లపూడి వెంకటరమణ వర్థంతి ఈరోజు - 28 జూన్ 1931 – 24 ఫిబ్రవరి 2011)


ముళ్లపూడి వెంకట రమణ గురించి చెప్పాలంటే మూడు ‘గొప్ప’లను చెప్పాలి. గొప్ప రచయిత, గొప్ప చిత్ర నిర్మాత, గొప్ప వ్యక్తి! ఆయన రచన శైలి ఎవరిదీ కాదు - ఆయనదే. ఎవరైనా ఆయన శైలిని అనుకరించవలసిందేగాని, ఆయన ఎవరినీ అనుకరించలేదు. కథ రాసినా, ఆత్మకథ రాసినా, నాలుగు వాక్యాలు రాసినా, సినిమా వార్తలు రాసినా, సినిమా సమీక్షలు రాసినా, సినిమా సంభాషణలు రాసినా - ఏది రాసినా ఆయన శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది అనితర సాధ్యం. ఆయనకి గురువులెవరూ లేరు. అంతా స్వానుభవమే, సృయంకృషే.


*నిక్కర్లతో పరిచయం..*

1948 ‘బాల’ పత్రికలో సీరయల్‌ కథ రాశారు రమణ. బాపు అప్పుడు ఆ సీరియల్‌కి బొమ్మలు వేశారో లేదోగాని, విడిగా ‘బాల’లో కార్టూన్‌లు వేసేవారు. నేనూ ‘బాల’లో ఏదో రాస్తూ ఉండేవాడిని. అప్పుడే వాళ్లంటే అభిమానం ఏర్పడింది. ఆ సంవత్సరంలోనే మద్రాసు వెళ్లినప్పుడు, ‘బాల’ ఆఫీసులో బాపు చిరునామా అడిగి, ఆయన ఇంటికి వెళ్తే ఇద్దరూ కలిశారు. అందరమూ నిక్కర్లతో ఉన్నవాళ్లమే. అదీ పరిచయం. తర్వాతే లేఖలు... 1953-54 సంవత్సరాల్లో బాలకృష్ణా రోడ్డులో ఉన్న మేడమీద గదుల్లోని ఒక గదిలో రమణ, అజంతా ఉండేవారు. ఒక చిన్న ‘కొట్టుగది’లో నేను. ఏదో డబ్బింగ్‌ సినిమాకి డైలాగులు కాపీ చేస్తూ కనిపించేవారు రమణ. నేనేదో నా ప్రయత్నాలు చేస్తుండేవాడిని. సిగరెట్లు కాలుస్తూ రెండో ఆట సినిమాలకి నడిచివెళ్లి, నడిచివస్తూ వుండేవాళ్లం. అనవసరపు మాట, వృథా ప్రసంగం ఏదీ ఉండేది కాదు. ఆయన ఆలోచనలు మాత్రం ఆలోచించదగ్గవిగా ఉండేవి. ‘టీ తాగుదామా’ అని అడిగితే - ‘నా దగ్గర అణాయే మిగిలింది, మీరు తాగండి’ అని అణా ఇచ్చి టీ తాగించిన ఔదార్యం అప్పట్నుంచే ఉంది - ఎప్పటికీ తగ్గలేదు సరికదా, పెరుగుతూ వచ్చింది. ఆఫీసు నుంచి ఇంటికి: 1956లో ‘ఆనందవాణి’లో నాకు ఉద్యోగం వచ్చింది. వాళ్ల ఆఫీసులోనే మకాం. పక్కనే ఆంధ్రపత్రిక ఆఫీసు. రమణ ఆంధ్రపత్రిక విక్లీలో ఉద్యోగం. అప్పటికే ఆయన ‘బోల్డు’ కథలు రాయకపోయినా, రాసినవి ముత్యాలు, రత్నాలూ. నా కథలు రెండు మూడు వీక్లీలో అచ్చుపడ్డాయి. ఉద్యోగంలో చేరిన మర్నాడే పత్రిక ఆఫీసుకు వెళ్లి రమణనీ, ఆయన ద్వారా నండూరి రామమోహనరావునీ (వీక్లీ ఇన్‌చార్జ్‌) కలిశాను. నా విషయం చెప్పాను. ఇద్దరం కిందికి దిగాం. కాఫీ తాగాం. నేను డబ్బులు తీస్తూ ‘నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వలగలను’’ అంటే ‘‘నేను ఇంకా ఇవ్వగలను’’ అని రమణే ఇచ్చేశారు. నాతోపాటు ‘ఆనందవాణి’కి వచ్చి ‘ఎక్కడ మీరుండడం?’ అని అడిగారు. ఆఫీసులోనే ఒక మూలువున్న పెట్టెబేడా చూపించాను. ‘‘ఏడిసినట్టుంది. ఎలా ఉంటారు? మా ఇంటికి వచ్చేయండి. మా అమ్మా వాళ్లెవరూ లేరు. ప్రస్తుతం, నేను మా తమ్ముడే వుంటున్నాం. వాళ్లూ వచ్చాక చూసుకుందాం పదండి’ అన్నారు. ఓడియన్‌ టాకీస్‌ పక్క వీధిలో ఉండేవారు రమణ. నా మకాం అక్కడికి మారింది. తమ్ముడు రామచంద్రుడు కూడా అలాంటివాడే. ‘ఈ పూట భోజనానికి హోటల్‌కి వెళ్లకండి. అన్నం కూడా పెట్టేస్తాను’ అనేవాడాయన. ఏ రాత్రికో రమణ వచ్చేవారు. కథల మీద, రచనల మీద సినిమాల మీద చర్చలు. నన్ను ప్రెస్‌ క్లబ్‌కి తీసుకెళ్లారోసారి. అక్కడ శ్రీశ్రీ ఉన్నారు. నన్ను పరిచయం చేశారు. ‘‘ఇంకో కాళిదాసు బాధితుడన్నమాట’’ అన్నారు శ్రీశ్రీ. ‘ఆనందవాణి’ అధిపతి కాళిదాసు. శ్రీశ్రీ కొంత కాలం అక్కడ పనిచేశారు. అదీ వ్యాఖ్యానం..


*అదీ ఔదార్యం..*

రమణ చేతికి గడియారం కట్టుకున్నట్టు ఎన్నడూ చూడలేదు. బహుశా కట్టుకుంటే చేతికి కట్టుబడదేమో?.. చేతికి ఎముక లేదు గనక. ఒకసారి హోటలుకెళ్లి బయటకొస్తున్నపుడు హోటలు వాడిచ్చిన చిల్లర చేతినిండా ఉంది. ఓ బిచ్చగాడు చెయ్యజాస్తే మొత్తం అంతా వాడి చేతిలోకి వేసేశారు. ‘‘ఇంకా ఉన్నారు అందరికీ సర్దవచ్చుగదా’’ అన్నాను. ‘‘ఎవడికీ ఏమీరాదు ఒకడైనా ఓ పూట అన్నం తిటాడు గదా’’ అన్నారు. (అప్పుడు 8 అణాలు, లేదా పది అణాలు).


*పెంచిన పారితోషికం..*

ఆ ఔదార్యం ఆయన చిత్ర నిర్మాత అయినప్పుడు కూడా అలాగే ఉంది. ఏ నిర్మాత అయినా ‘పారితోషికం ఎంత తీసుకుంటారు?’ అని అడిగితే, మనం చెప్పినప్పుడు ‘అమ్మో-అంత ఇవ్వలేను’ అని బేరం ఆడి తగ్గించడం ఆనవాయితీ. ‘అందాల రాముడు’ సినిమా ముందు ‘ఎలా ఉంది మీ రేటు?’ అని అడిగారు నిర్మాత రమణ. ‘ఐదువేలూ..అలా ఉంది’ అన్నాను. ‘‘అబ్బేబ్బే...అదేంటి? పెరగాలి. సాక్షి రంగారావు, మాడా ఇంకా తక్కిన వాళ్లూ అందరికీ కాస్త పెంచే ఇస్తాను. పెద్దవాళ్లందరికీ ఎలాగూ అడిగింది ఇచ్చేస్తాం. మీలాంటి వాళ్ల దగ్గరే బేరాలు. ఆరువేలు రాస్తాను. సుబ్బరంగా పుచ్చుకుని, ఇటు తర్వాత వాళ్లకి కూడా ఈ ఎమౌంటే చెప్పండి’ అన్నారు ఆ నిర్మాత.


*దక్షత గల నిర్మాత..*

చిత్ర నిర్మాతల లెక్కల్లో రమణని ఎవరూ లెక్కవేయరు. ఎంతసేపూ రచయితల జాబితాలోనే వేస్తారు. ‘నిర్మాత’గా ఆయన పేరు 15-20 చిత్రాల మీద ఉంటుంది. నందనా ఫిలిమ్స్‌ (సాక్షి), శ్రీరామచిత్ర, కల్పనా చిత్ర పేర్ల మీద వచ్చిన సినిమాలకి నిర్మాత ఆయనే. దక్షత గల నిర్మాత. పథకం గల నిర్మాత. ఆర్భాటం లేని నిర్మాత. తన షూటింగ్స్‌లో ఎవరూ ఇబ్బంది పడకూడదు, పెట్టకూడదు, అడిగిందల్లా ఇచ్చేవారు. అవుట్‌డ్డోర్‌లో షూటింగ్‌లంటే, అక్కడ షామియానాలూ, కుర్చీలూ, బల్లలూ ఉండాల్సిందే నాలుగైదు రోజులు షూటింగ్‌యినా దూరంగా మరుగుదొడ్లు కట్టించేసేవారు - స్త్రీలకి బట్టలు మార్చుకోవడానికి తెర గదులూ, కాఫీలు, టిఫిన్లు, భోజనాలూ సరేసరి! ఓసారి షూటింగ్‌లో నేను ప్రొడక్షన్‌ బాయ్‌ని పిలిచి కాఫీ అడిగాను. ఆ అడగడం విన్నారు రమణ. ఆ అబ్బాయిని పిలిచి, ‘ఎవరూ కాఫీ కావాలని అడక్కూడదు. మనమే ‘కాఫీ కావాలా?’ అని అడుగుతూ ఉండాలి. చిన్నవాళ్లయినా పెద్దవాళ్లయినా సరే వాళ్లుగా అడిగితే మన కంపెనీకి నామోషి’ అని బోధ చేశారు! అన్నీ పక్కా ఏర్పాట్లు, ఉన్నంతలో సౌకర్యాలు. నేను దాదాపు ఐదు వందల సినిమాల్లో వేశాను. ఓ రెండు వందల సినిమాలకి అవుడ్డోర్లు వెళ్లాను. కానీ ‘అందాల రాముడు’ సినిమా అవుట్‌డ్డోరు మాత్రం - మహా గొప్పది.


*వాణిశ్రీ బాకీ..*

‘గోరంతదీపం’ సినిమా బాగా నడవలేదు. రావలసిన సొమ్ము రాలేదు. వాణిశ్రీ నాయిక. ఆమెకి ఓ ఇరవైవేలో, పాతిక వేలో బాకీపడ్డారు. సినిమా బాగా ఆడలేదు గనక, ఆమె కూడా అడగలేదు. ఆమె మరిచేపోయిందిగాని, రమణ మరచిపోలేదు. రెండేళ్ల తర్వాత ఆ బ్యాలెన్స్‌ పంపితే, ఆమె దిగ్గుబోయింది. ‘‘ఏమిటి - ఎందుకు?’’ అంది. ‘‘మీకు బాకీగదా’’ అన్నాడు నిర్మాత. ‘‘ఎందుకు? ఎప్పుడో అయిపోయిందిగదా. సినిమా కూడా బాగా నడవలేదు నష్టం కదా’’ అంది ఆ తార. ‘‘కావచ్చునమ్మా. కానీ, మా బాకీల లిస్టులో మీ పేరు అలా ఉండిపోతుంది. ఆ మచ్చ ఉండకూడాదు కదా. అంచేత, మీరు మరచిపోయినా, ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది గనక తీసుకోండి’’ అన్నది ఆ నిర్మాత సహృదయం! ‘పెళ్లిపుస్తకం’ సినిమాకి నా కథ తీసుకున్నప్పుడు, ‘‘ఎంత? మీరెప్పుడూ ఎవరికీ కథలు అమ్మలేదు నేనెప్పుడూ ఎవరి కథ కొనలేదు. అంచేత రెండూ కొత్తే. ఏంచేద్దాం?’’ అని అడిగితే, ‘‘మీ ఇష్టం మీరెంత ఇస్తే అంత అంతే’’ అన్నాను. చిరునవ్వేశారు. అవుట్‌డ్డోర్‌ షూటింగ్స్‌లో అందరికంటే ముందు లేచి, కొందరిని లేపి, మరికొందర్ని లేపించేవారు ఆయన. బాపు లోకేషన్‌లో అందరికంటే ముందుంటారు. అంచేత ‘అందరూ సిద్దమయ్యేరా లేదా’ అని రమణ అలా అలా తిరుగుతూ పర్యవేక్షించేవారు - మేనేజర్లు వేరే వున్నా. ‘నిశ్శబ్ద నిర్మాత’ అని ఆయనకి పేరు.


*మరువలేని ప్రోత్సాహం..*

నేను దర్శకత్వ శాఖలో చేరాను. ‘‘ఏమిటి మీ లక్ష్యం? రచయిత కావాలనా? దర్శకుడు అవుదామనా? నటుడు అవుదామనా?’ అని మూడు ప్రశ్నలు వేశారు. ‘‘ఏమో! విధి ఎటు నడిపిస్తుందో ఉత్సాహం కొద్ది, బతుకు దారిలో చేరాను’’ అన్నాను. ‘‘మీరు నటించడం చూశాను నాటకాల్లో, సహజత్వం ఉంది. నటుడిగా ప్రయత్నించండి’’ అని సలహా ఇచ్చింది రమణే. ఆయనకి తొలిసారి సినిమా రచయిత అకాశం వచ్చినప్పుడు అన్నారు. ‘‘ఇందులో మీకు వేషం చెప్పాను. ఆదుర్తి మీకూ తెలుసుకదా’ అని, ‘దాగుడుమూతలు’లో 10, 12 దృశ్యాల్లో వచ్చే డాక్టర్‌ వేషం ఇప్పించారు రమణ. నటుడిగా ప్రయత్నిద్దాం అనుకున్నప్పుడు వచ్చిన తొలిచిత్రం ‘ప్రేమించిచూడు’ పాత్రా ఆయన చలవే. నేను తరచుగా చెప్పే ‘మాస్టారు’ ధోరణితో ఆ పాత్రని దిద్ది, నాచేత వేయించమని పుల్లయ్యతో చెప్పిన ‘ప్రొత్సాహి’ రమణ. అంతే! ఆ పాత్రలో నేను అడక్కుండానే చాలా పాత్రలు రావడం ఆరంభించాయి.


*ఆ శక్తి స్వశక్తే..*

సినిమా రచనలో కొత్తదనం తెచ్చారు రమణ. అవన్నీ ఉదాహరణలు అనవసరం, అందరికీ తెలుసు. ‘సినిమాలకి రాయాలంటే అంతకుముందు నాటకాలు రాసిన అనుభవం ఉండాలి’ అంటారు రమణ. కొన్ని రేడియో నాటకాలు రాశారుగాని, రంగస్థల నాటికలు, నాటకాలూ రాయలేదు. మరి, అంత గొప్ప సినిమా డైలాగులు ఎలా రాశారు? హాస్యం, వ్యంగ్యం, విషాదం అన్నీ సమపాళ్లలో రాయగలిగిన ఆ శక్తి స్వశక్తి. సంస్కృతాంధ్రాంగ్లాల్లో ఆయన పండితుడు కాదు. ‘సీతాకల్యాణం’, ‘సంపూర్ణరామాయణం’, ‘శ్రీరామరాజ్యం’, ‘శ్రీనాథుడు’ ఎలా రాశారు మరి? అద్భుతమైన ప్రజ్ఞ, స్క్రీన్‌ప్లే రాయడంలోనూ అంతే! ‘‘నేను డైలాగ్‌ రైటర్నే కానీ, సినిమాల్లో సాధ్యమైనంత వరకూ డైలాగులు తక్కువగా ఉండాలి’ అన్నారు ఒకసారి. ‘దాగుడుమూతలు’కి ముందే వచ్చిన ‘మూగమనసు’లో చాలా రమణవి చాలా డైలాగులున్నాయి. ఆయన రాసే పాత్రల సృష్టీ అలాగే ఉంటుంది. కాంట్రాక్టరు, తీతా, అప్పారావు, ఆమ్యామ్యా బాబాయ్‌ (పెళ్లిపుస్తకంలో నా పాత్ర) ఇలా ఎన్నో అన్నీ నిలబడిపోయే పాత్రలు. రమణ రాసిన స్క్రిప్టు మీద బాపుకి విశేషమైన భక్తి. ఒక్కక్షరం తప్పు పలికినా, మార్చినా, బాపు ఒప్పుకోరు. ఇద్దరు కూచుని స్క్రీన్‌ప్లే చర్చించుకున్నాకే. డైలాగులు (రమణ మాషలో డై‘లాగులు’ తొడుగుతూన్నాను) రాస్తే. అంతే!


*ఆ ధోరణి ఆయనదే..*

కథారచయితగా రాసినవన్నీ గొప్పవే. ఆ శైలే వేరు. వెండితెర నవలలు రాశారు కొన్ని సినిమాలకి. ఆ ధోరణే వేరు. అలాంటి రచనల ధోరణికి ఆయనే ఆద్యుడు. అనుసరణీయుడూ. ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో హింది సినిమా వార్తలు రాసేవారు. క్రింద ‘టచ్‌స్టన్‌’ అని పేరుండేది. ఆ పంపినవాడు తెలుగువాడేనా అనుకుంటాం. కాదు అది రమణ అనువాద శైలి. యస్‌.పార్థసారథి పేరుతో రాసినవీ ఆయనవే. ఒక ‘రాజకీయ బేతాళ’, ‘పంచవింశతి’, ‘రాధాగోపాలం’ ‘జనతా ఎక్స్‌ప్రెస్‌’, ‘కోతి కొమ్మచ్చి’ ఎన్ని పుస్తకాలు చెబుతాయో రమణ కలం బలం గురించి. ప్రతికల్లో కథలు రాయడం మొదలుపెట్టి సినిమా సమీక్షలు రాసి, రేడియో నాటకలు రాసి, సినిమా రచయితగా స్థిరపడి, నిర్మాతగా ఎదిగి అన్నింటా తన వ్యక్తిత్వాన్ని ప్రతిఫలింపజేసిన ముళ్లపూడి వెంకటరమణ ఎందరికో ఆత్మియుడు, బంధువు, మిత్రుడు.


👉 సౌజన్యం: బహుముఖ ప్రతిభాశాలి రావి కొండలరావు

కామెంట్‌లు లేవు: