*విద్యయా అమృతమశ్నుతే*
విద్యద్వారా అమృతత్వం లభిస్తుంది(వేదవాక్యం)
విద్యవల్ల ఏం సంపాదించాలి? వెంటనే 'ధనం సంపాదించాలి' అని
తడుముకోకుండా సమాధానమిస్తారు. విద్యకు ధనమే పరమ ప్రయోజనం అని భావించడం చేత విద్య కూడా వ్యాపార రంగమైపోయింది. దానితో రాజకీయ వాదుల హస్తాలు సోకి ఆ రంగం కూడా కలుషితమయింది. అలాంటి వ్యవస్థలో నుంచి ఎటువంటి సంస్కారాలు లభిస్తాయి!.
( ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో
సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.)
చివరకు తల్లిదండ్రులు కూడా విద్య ద్వారా డబ్బును సంపాదించే యంత్రాలుగా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.
కానీ మన ఆర్షధర్మం (ఋషులు ఏర్పరచిన మార్గం) విద్యకు లక్ష్యాలను చాలా చక్కగా నిబంధించింది.
విద్యా దదాతి వినయం
వినాయత్ యాతి పాత్రతా |
పాత్రత్వాత్ ధనమాప్నోతి
ధనాత్ ధర్మం తతస్సుఖమ్ ||
విద్యవల్ల 'వినయం' రావాలి. వినయం అనే మాటకు అణకువ,విధేయత-అనే
అర్థాలే కాక 'జ్ఞానం' అనే అర్థముంది. విజ్ఞానిని వినీతుడు అని అంటారు.
విద్య వల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ ప్రవర్తనకు కూడా
వినయమనే పేరు. ఇక్కడ 'వినయ' శబ్దానికి ఈ అర్థాలన్నింటినీ తీసుకోవచ్చు. విద్య వల్ల విధేయత, విజ్ఞానం, ప్రవర్తనాసరళి లభిస్తాయి. దాని ద్వారా అర్హత, ఆ అర్హత
వల్ల ధనం, ఆ ధనం వల్ల ధర్మం, ధర్మం ద్వారా సుఖం. ఈ వరుసలో ఉన్న ఔచిత్యం ఎంత గొప్పది!
విద్యకీ, ధనానికీ మధ్య వినయమా, పాత్రతా ఉన్నాయి. ధనానికీ, సుఖానికీ మధ్య ధర్మం ఉంది.
ఈ మధ్యలోని ముఖ్య విషయాలను గమనించక విద్య నుంచి ధనం, ధనం నుంచి సుఖం అనే 'జంపింగ్' వ్యవహారం వల్ల వ్యక్తిత్వానికి అవసరమైన వినయం, పాత్రత,
ధర్మం అనే విలువలకు నీళ్ళొదులుతున్నాం. ఈ పద్ధతి వ్యక్తినీ, సమాజాన్నీ కూడా
క్రమంగా బలహీనపరుస్తుంది.
ఇక్కడ విద్యకీ లక్ష్యం, ధనానికి లక్ష్యం రెండూ చెప్పారు. ధనం వల్ల
సంపాదించవలసినది ధర్మం. ధర్మం ద్వారా సుఖాన్ని సంపాదించాలి. ఎంత నిశితమైన అవగాహన ఇందులో ఉందో గమనించారా?
ఈ ఒక్క శ్లోకాన్ని విద్యార్థులూ, విద్యాలయాలూ గమనిస్తే విలువలుగల విద్యావ్యవస్థను సాధించవచ్చు. ధనానికి ముందూ వెనకా ఉత్తమ లక్షణాలుంచారు.
ఆ లక్షణాల వల్ల వ్యక్తి నియంత్రణ సాధ్యపడుతుంది. సమాజానికి భద్రత ఉంటుంది.
ధర్మాన్ని ఆచరించడానికి తగిన వనరులు లేక చాలామంది అసహాయులైపోతారు.
కానీ ధర్మాచరణకు తగిన సంపాదన కలిగి ఉండడం భాగ్యం. ఆ భాగ్యాన్ని
వినియోగించుకోవడమే ధనాన్ని ధర్మం కోసం ఖర్చుచేయడం.
ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి
అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.
సమాజపు శాశ్వత సౌఖ్యం కోసం పరితపించే బుద్ధి ఉన్నవారు ఈ విధంగా ఆలోచిస్తారు.
ఒక్క శ్లోకంలో వ్యక్తి జీవిత మార్గనిర్దేశాన్ని ఇంత సమగ్రంగా బోధించిన మన సనాతనధర్మానికి మోకరిల్లవలసిందే.
విద్యకు ప్రాధాన్యమిచ్చిన గురుపీఠం మనదేశం. భౌతిక సుఖాలను కూడా
లక్ష్యపెట్టకుండా అరణ్యాలలో వాసం చేస్తూ జీవితమంతా జ్ఞాన సముపార్జన కోసం వెచ్చించి మహాతపస్వులు-"విద్యయా అమృతమశ్నుతే" విద్య ద్వారా అమృతత్వం లభిస్తుందని బోధించారు. సౌఖ్యాలనూ, సౌకర్యాలనూ పరిగణించకుండా తపస్సులా విద్యాభ్యాసం చేయాలని మన సంప్రదాయం. విద్యను వ్యాపారం చేసే దుష్ట సంస్కృతిలోనే ఈ సుఖసౌకర్యాల ఆలోచనలు పుడతాయి.
నిరంతర అధ్యయనం వల్లనే నిరంతర ధర్మం, తద్వారా సుఖం వర్థిల్లుతాయి.
సత్యస్పృహతో అసలైన ఆనందాన్ని పొందాలంటే విద్య ధనాల ముందు వెనుకనున్న సులక్షణాలను సాధించవలసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి